పిఠాపురం శక్తిపీఠం పురుహూతిక అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతాలు ఘనంగా జరగనున్నాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రావణ మాసం చివరి శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి వ్రతాలు ప్రారంభమవుతాయి.
శ్రావణమాసంలోని చివరి శుక్రవారం సందర్భంగా పిఠాపురం మహిళలకు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కానుక ప్రకటించారు. 10 వేల మంది ఆడపడుచులకు పసుపు, కుంకుమ, చీరలు పంపిణీ చేయాలని ఆయన నిర్ణయించారు. పిఠాపురంలోని శ్రీ పాదగయ క్షేత్రంలోని ఉమా కుక్కుటేశ్వరస్వామి, పురుహూతిక అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలకు ఏర్పాట్లు చేశారు.
మొత్తం 5 విడతలుగా వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తారు. ఒక్కో బ్యాచ్‌కు ఒక్కో అమ్మవారి పేరున అంబిక, భ్రమరాంబ, చాముండి, దుర్గ, ఈశ్వరి అని నామకరణం చేశారు. ఉదయం 5 గంటల నుంచి 12.30 గంటల వరకు బ్యాచ్‌ల వారీగా వరలక్ష్మీ వత్రం నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత వచ్చే ఆడపడుచులకు కూడా పసుపు, కుంకుమ, చీరలను కానుకగా అందిస్తారు. మొత్తం 10 వేల మంది ఆడపడుచులకు చీరల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన కూపన్ల పంపిణీ గురువారం నుంచి ప్రారంభమవుతుంది. కూపన్లపై సమయం ముద్రించి ఉంటుంది. ఆ సమయానుసారం వ్రతానికి ఏర్పాట్లు చేసుకోవాలని మహిళలకు సూచించారు. చీరలను దేవాలయ సిబ్బంది, పోలీసులు, జనసేన వాలంటీర్లు పంపిణీ చేయనున్నారు.