🔹అసెంబ్లీ సమావేశాల్లో రమ్మీ ఆడిన మంత్రి మాణిక్ రావ్ కోకాటే..
🔹మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో కోకాటేకు క్రీడల శాఖ .
🔹మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మండిపడుతున్న విపక్షాలు.
మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా సభలో కూర్చొని రమ్మీ ఆడారంటూ మహారాష్ట్ర మంత్రి మాణిక్ రావ్ కోకాటేపై వచ్చిన ఆరోపణలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది. మాణిక్ రావ్‌పై వేటు వేయలేదు కానీ.. ఆయనకు క్రీడల శాఖను అప్పగించడం విమర్శలకు దారితీసింది.
మహారాష్ట్రలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు సంబంధించి గురువారం నాడు అర్ధరాత్రి ఓ ప్రకటన వెల్లడైంది. ఇప్పటి వరకు మాణిక్ రావ్ కోకాటే వ్యవసాయశాఖ మంత్రిగా విధులు నిర్వహించగా.. ఆ బాధ్యతల నుంచి తప్పించి ఎన్సీపీ మంత్రి దత్తాత్రేయ భరణెకు అప్పగించారు. ఇక, కోకాటేకు క్రీడలు, యువజన సంక్షేమ మంత్రిత్వశాఖను కేటాయిస్తున్నట్లు ఆదేశాలు వచ్చాయి. వివాదాస్పదమైన చర్యలకు పాల్పడే మంత్రులపై తీవ్ర పరిణామాలు తప్పవనే సంకేతాల కోసం ఈ మార్పు చేపట్టినట్లు ప్రభుత్వం Rummy Row in Maharashtraపేర్కొంది.
కానీ, అసెంబ్లీలో రమ్మీ ఆడిన మంత్రిని పదవి నుంచి తొలగించక పోగా.. కేవలం శాఖను మార్చడం ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో వివాదాస్పదమైంది. ఇలా చేయడం జవాబుదారీతనం అనిపించుకోదు.. కేవలం కంటితుడుపు చర్య మాత్రమే అని శివసేన (యూబీటీ) నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు క్రీడల శాఖను అప్పగించడమంటే.. అసెంబ్లీలో రమ్మీ ఆడటాన్ని అధికారికంగా పర్మిషన్ ఇచ్చినట్లే అవుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.