prematurity – ప్రీమెచ్యూర్ బేబీకి సాధారణంగా పుట్టుకతో ఎదురయ్యే సమస్యలేవి….?

By manavaradhi.com

Published on:

Follow Us

మాతృత్వం ప్రతి మహిళకు ఒక వరం. కాబట్టి గర్భధారణ సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అనుకున్న సమయాని కంటే ముందే అంటే 9 నుంచి 10 నెలల లోపే కాన్పు జరుగుతుంది. దీన్నే ప్రీ మెచ్యూరిటీగా వ్యవహరిస్తారు. సాధారణంగా ఓ బిడ్డ పుట్టడానికి 40 వారాల సమయం పడుతుంది. 3 వారాలు లేదా అంతకు మించి ముందుగానే కాన్పు అయితే దాన్ని ప్రీమెచ్యూర్ గా చెప్పుకోవచ్చు. బాగా ముందుగా పుట్టిన పిల్లలకు అనేక సమస్యలు ఎదురౌతాయి. ఈ పిల్లలనే ప్రీమీస్ గా పిలుస్తారు. మానసికంగా సరైన ఆరోగ్యం లేకపోవడం వల్ల ఎక్కువగా ఇలాంటి కాన్పులు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో భార్య భర్తలు ఇద్దరూ సరైన మానసిక ఆరోగ్యాన్ని పెంచుకోవడం వల్ల ఇలాంటి సమస్యను దరి చేరకుండా చూసుకోవచ్చు. బిడ్డ త్వరగా పుట్టడం వల్ల వారి ప్రధాన అవయవాలు పూర్తిగా నిర్మాణం జరగవు. అలాంటప్పుడు పిల్లల్లో అంగవైకల్య సమస్యలు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. పుట్టిన తర్వాత ప్రత్యేకంగా చూసుకోగలిగితే, కొంత కాలానికి సాధారణంగా మామూలు స్థితికి రావడానికి అస్కారం ఉంటుంది. 26 వారాలు… అంటే 6 నెలల వయసులోనే పుట్టిన పిల్లలు తీవ్రమైన ఇబ్బందులకు గురౌతారు. ఈ సమయంలో పిల్లలకు చికిత్స అందించాలన్నా సాహసంతో కూడిన నిర్ణయంగానే భావించాలి.

సాధారణంగా ప్రీ మెచ్యూర్ సమస్య రావడానికి పిండం దగ్గర లేదా తల్లి దగ్గర సమస్య ఉండవచ్చు. కొన్ని సమయాల్లో ఇద్దరి సమస్యవల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్లాసెంటాతో సమస్యలు, గర్భంలో కవల పిల్లలు లేదా అంత కంటే ఎక్కువ మంది ఉండడం, తల్లికి ఇన్ఫెక్షన్ సమస్యలు రావడం, గర్భాశయం లేదా గర్భధారణలో సమస్యలు, గర్భధారణ సమయంలో మద్యం, డ్రగ్స్ లాంటి వాడడం లాంటి అనేక కారణాలు ప్రీ మెచ్యూరిటీ సమస్యకు దారి తీస్తాయి. ప్రీ మెచ్యూరిటీతో శిశువులు పుట్టడం వల్ల భవిష్యత్ లో అనేక సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. గర్భంలో ఉండగానే బిడ్డ ఆరోగ్య పరిస్థితిని గుర్తించి, ప్రీమెచ్యూర్ విషయాన్ని నిర్థారించుకోవచ్చు. పరిస్థితి ఏ మేరకు ఉందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పిల్లల జననాన్ని కొనసాగించే విషయంలో నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఈ విషయాలేమీ తెలియకుండా, బిడ్డ పుట్టిన తర్వాత మాత్రమే ఈ విషయం తెలిస్తే, పిల్లలకు ఎక్కువగా సమస్యలు రావడానికే ఆస్కారం ఉంటుంది. వైద్యులు బిడ్డ పరిస్థితిని గమనించి, ఎంత వరకూ ఈ సమస్య నుంచి తప్పించగలం అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని చికిత్స అందిస్తారు. 32 నుంచి 37 వారాల మధ్యలో పుట్టిన పిల్లలకు కొన్ని రకాల సమస్యలు సాధారణంగానే ఉండవచ్చు. అలాంటి సమస్యలు ఏవీ లేవంటే కళ్ళు కనిపించకపోవడం, చెవులు వినిపించకపోవడం లాంటి సమస్యలు ఎదురు కావచ్చు. 26 వారాల సమయంలో పుడితే ఆ పిల్లలకు కచ్చితంగా కంటికి సంబంధించిన ఇబ్బందులు ఎదురు కావచ్చు.

ప్రీమెచ్యూర్ బేబీలను ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. మీరు అనుకున్న దాని కంటే పిల్లలు తక్కువ సమయం నిద్రపోతారు. మిగతా పిల్లలతో పోలిస్తే మధ్యలో అధికంగా మేల్కొంటూ ఉంటారు. మిగతా పిల్లలతో పోలిస్తే అధికంగా అనారోగ్యాల బారిన పడుతుంటారు. అందుకే కుటుంబంలో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే, వారికి పిల్లల్ని దూరంగా ఉంచాలి. తరచూ వైద్యుని వద్దకు తీసుకెళుతూ ఉండాలి. పిల్లలు నిద్రపోయేటప్పుడు వారిని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. ప్రీమెచ్యూర్ బేబీలకు గుండె మరియు ఊపిరితిత్తులకు సంబంధించి పరీక్షలు నిర్వహించి, సరైన చికిత్సను అందిస్తారు. వైద్యులు బిడ్డ శరీరాన్ని ఎప్పుడూ వేడిగా ఉంచేందుకు ప్రయత్నిస్తారు. బాగా త్వరగా పుట్టిన పిల్లలకు సరైన చికిత్స అవసరం. ఈ సమయంలో అలాంటి చికిత్స అందకపోతే భవిష్యత్ లో అనేక సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. కొంత మంది పిల్లలకు శస్త్ర చికిత్స కూడా అవసరం కావచ్చు. అందుకే గర్భవతులు కాగానే, తల్లలు మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. లేదంటే ప్రీమెచ్యూరిటీతో పిల్లలు ముందుగానే పుట్టే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితి తెచ్చుకోవడం కంటే, వైద్యుల సంరక్షణలో సరైన ఆహారం, మందులు, నిద్ర ద్వారా ఆరోగ్యవంతమైన రేపటి తరాన్ని బిడ్డలుగా పొందవచ్చు.

Leave a Comment