Healthy heart : గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి…?

By manavaradhi.com

Updated on:

Follow Us
Heart Health

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కువ మందిని బాధపెడుతున్న సమస్యల్లో గుండె సమస్యలే అధికంగా ఉన్నాయి. ఈ సమస్యలతో బాధపడుతున్న వారిలో వృద్ధుల కంటే యువతే ఎక్కువ. గుండె గనుక ఏదైనా వ్యాధి భారినపడితే అటువంటి సమయంలో శరీరంలోని మిగతా భాగాలకు అందవలసిన రక్తప్రసరణపై ప్రభావం చూపుతుంది. దీంతో వివిధరకాల అవయవాలు పనితనం మందగించి చతికిలపడతాయి. కాబట్టి గుండె జబ్బుల బారినపడకుండా నివారించుకోవటమే ఆరోగ్యం. దీనికి మూలం మన జీవనశైలిలోనే ఉంది. మంచి పోషకాహారం తీసుకోవటం, రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, ఒత్తిడికి దూరంగా ఉండటం, బరువును నియంత్రణలో ఉంచుకోవటం వంటి మౌలిక అంశాలపై దృష్టి పెట్టాలి.

  • గుండెకు ఎలాంటి సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే మంచి ఆహారపు అలవాట్లు, సరైన జీవనశైలిని అలవర్చుకోవాలి. కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. అందులో చక్కెర, ట్రాన్స్‌ ఫాట్‌ తక్కువగా ఉండేలా చూసుకోవాలి.
  • ఫైబర్‌, ఒమేగా-3 ఫాటీ ఆసిడ్స్‌ వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు స్థాయిలు తగ్గుతాయి. గుండె కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది.
  • గుండె ఆరోగ్యం గురించి ఆలోచించే వారు నూనెల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండడం తప్పనిసరి. ముఖ్యంగా ఆలివ్ ఆయిల్ ను అధికంగా వాడడం మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, రక్తనాళాలను రక్షిస్తుంది.
  • గ్రీన్‌ టీ తాగడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా రోజుకు రెండు కప్పుల గ్రీన్‌ టీ తాగటం వల్ల గుండె ఆరోగ్యవంతంగా ఉంటుందని అంటున్నారు. ఇది కొవ్వుని తగ్గించి, రక్త ప్రసరణను పెంచుతుంది.
  • మనిషిని ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్స్ కీలక పాత్ర పోషిస్తాయి. విటమిన్ డి లోపిస్తే మధుమేహం, గుండె సంబంధ వ్యాధులకు గురయ్యే ప్రమాదముంది. శరీరానికి సూర్య కిరణాలు వల్ల డీ విటమిన్‌ ఉత్పత్తి అవుతుంది. రోజుకు 20 నిమిషాలు ఆరుబయట సూర్యకాంతి తగిలే ప్రదేశంలో గడిపితే ఈ విటమిన్‌ దండిగా లభిస్తుంది.
  • శ్వాసపై ద్యాస ఉంచి ఊపిరి తీసుకోవడం మూలంగా శరీరానికి కావలసిన ప్రాణవాయువుని ఎక్కువ మోతాదులో తీసుకుని జీవక్రియలు ఉత్తేజితమవుతాయి. లోతుగా శ్వాసని తీసుకోవడంవలన ఆక్సిజన్ మరింత సరఫరా అవుతుంది. తద్వారా గుండె పనితీరు మెరుగవుతుంది.
  • ఆనందం, ఒత్తిడి, నిరాశ అనేవి మన గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ప్రతిరోజూ తీసుకునే ఆహార పదార్ధాలలో షుగర్ అధికంగా వుంటే శరీరం లావెక్కుతుందని, తద్వారా గుండె సంబంధిత వ్యాధులు మరింత పెరిగే అవకాశం వుంది. కాబట్టి రోజుకు 150 కెలోరీలకు మించకుండా ఉండేలా చక్కెరను తీసుకోవాలి.

గుండె జబ్బులు తలెత్తేందుకు ఒత్తిడి అనేది ప్రధాన కారణంగా వ్యవహరిస్తుందని ప్రపంచవ్యాప్తంగా కార్డియాలజిస్ట్ లు స్పష్టం చేస్తున్నారు. ఆరోగ్యకరమైన లైఫ్ స్టయిల్ ను పాటించే వాళ్ళలో కూడా ఒత్తిడి వలన గుండె జబ్బుల సమస్య కనిపించే అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు. కాబట్టి, ఒత్తిడిని మేనేజ్ చేసుకునే విధానాలను తెలుసుకోవాలి. యోగా లేదా మెడిటేషన్ ను సాధన చేయాలి. తద్వారా, ప్రాణాంతకమైన గుండె జబ్బుల నుంచి రక్షణ పొందవచ్చు.

రోజులో కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చెయ్యాలి. ఇది గుండె జబ్బులను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వ్యాయామాన్ని జీవితంలో భాగం చేసుకోగలితే అన్ని విధాల మంచిది. లిఫ్ట్ వాడడం కంటే మెట్లు ఉపయోగించడం, చిన్న చిన్న దూరాలకు వాహనం వాడకుండా కాలి నడుకన వెళ్లడం వంటివి కూడా శరీరం ఉత్తేజితంగా ఉండేందుకు తోడ్పడుతాయి.

కార్డియాలజిస్ట్ లు స్మోకింగ్ కు దూరంగా ఉండమని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే, స్మోకింగ్ వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. గుండె జబ్బులు పెరుగుతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుంది. కాబట్టి, ఈ అలవాటుకు దూరంగా ఉండటం మంచిది.

రెగ్యులర్‌గా నడవటం వల్ల గుండె మంచి సమర్ధ వంతంగా రక్తాన్ని పంప్‌ చేయగలుగులుగుతుంది. శరీరమంతటికీ జరిగే రక్త సరఫరాను మెరుపరచి మనిషిని యాక్టివ్‌గా వుండేటట్లు చేస్తుంది. రక్తంలో ఉండే, గుండె జబ్బుల్ని కొని తెచ్చే – కొలెస్ట రాల్‌, ట్రైగ్లి జరైడ్స్‌ శాతాన్ని తగ్గిస్తుంది. మరోమాటలో చెప్పాలంటే గుండె జబ్బుల్నించి కాపాడటానికి నడక దివ్యౌషధంగా పనిచేస్తుంది.

Leave a Comment