Health Tips: ఈ చెడు అలవాట్లు వెంటనే మానుకోండి.. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

By manavaradhi.com

Published on:

Follow Us

సాధారణంగా మనలో ప్రతి ఒక్కరిలోనూ కొన్ని చెడు అవాట్లు, కొన్ని మంచి అలవాట్లు ఉంటాయి. కానీ, కొన్ని చెడు అలవాట్లకు మనం కావాలని అలవాటు పడం. కానీ మనకు తెలియకుండానే కొన్ని పనులు చేస్తూ అలవాట్లుగా మార్చుకుంటాం. జీవితాంతం మ‌న వెంట ఉండే కొన్ని చెడు అలవాట్లను మానుకోవాలి. మంచి ఆరోగ్యానికి ముఖ్యమైనది ఆరోగ్యకరమైన మరియు ఉత్తేజకరమైన మనస్సు. మన మనస్సు ఆరోగ్యకరంగా లేకపోతే దాని ప్రభావం శరీరంలోని రోగ నిరోధక శక్తిపై ఉంటుంది. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఒంటరితనానికి సంబంధించి లేదా ఏదైనా సమస్యకి సంబంధించి తీవ్రంగా మదన పడుతున్నట్టైతే ఆ ప్రభావం మీ మానసిక ఆరోగ్యంపై పడుతుంది.

మనుషులతో కలవలేకపోవడం మనస్సుని అలాగే ఆరోగ్యాన్ని ఒత్తిడికి లోను చేయడం ఈ కోవలోకే వస్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు మాత్రమే కాకుండా కొన్ని రకాల చెడు అలవాట్లు కూడా శరీర బరువును ప్రభావిత పరుస్తాయి. కొంతమంది అదేపనిగా వేళ్ళు విరవడం, గోళ్ళు కొరుక్కోవడం లాంటివి సరదాగా చేస్తుంటారు. అంతేకాదు స్మార్ట్ ఫోన్ ను ఎక్కువగా వాడటం, కాఫీలు ఎక్కువగా తాగడం, స్వీట్స్ ఎక్కువగా తినడం, మద్యం సేవించడం లాంటి చెడు అలవాట్ల కారణంగా ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోంది.

ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారమైనా అతిగా తింటే స‌మ‌స్యలు త‌ప్ప‌వు. అందుక‌నే త‌క్కువ ఫ్యాట్స్ ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డమేకాకుండా, అతిగా తిన‌డం కూడా చెడు అల‌వాటేనని గుర్తుంచుకోవాలి. అంతే కాదు త్వరత్వ‌ర‌గా భోజ‌నం చేయడం కూడా చెడ్డ అల‌వాటుగానే ప‌రిగ‌ణించాల్సి ఉంటుంది. భోజనం చేయడానికి కనీసం 20 నిముషాల సమయం కేటాయించాలి. ఆహారాన్ని నమలకుండా మింగడం వల్ల అసిడిటీ, కడుపుబ్బరం, కడుపులో గ్యాస్ ప్రాబ్లం వంటి సమస్యలు వస్తాయి. జంక్ ఫుడ్ జోలికి అస్సలు పోవద్దు.

ఎక్కువగా మద్యం సేవించడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఎక్కువగా మద్యాన్ని సేవించడం వల్ల కాలేయ సంబంధిత వ్యాధులు, బరువు పెరగడం, కళ్ళు తిరగడం, అలసట వంటి దీర్ఘ కాలిక ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. అదేవిధంగా సిగరెట్ తాగడం అనేది ఓ సామాజిక రుగ్మతలా తయారైంది. ఏ విధంగా చూసినా పొగతాగడం శరీరానికి హానికరం. పొగతాగడం వల్ల వేలకొద్ది విషవాయువులు, విషపూరిత లోహాలు మరియు కార్సినోజేన్‌లు మన శరీరంలోకి వెళ్తాయి. ఇవి ఊపిరితిత్తుల వ్యవస్థను నాశనం చేసి క్యాన్సర్, టీబీ వంటి భయంకర వ్యాధులు వచ్చేలా చేస్తాయి. ఇక నిద్ర రాకున్నా మంచంపై అటూ ఇటూ దొర్ల‌డం కూడా మంచి అల‌వాటు కాద‌ని సెల‌విస్తున్నారు పరిశోధ‌కులు. వీటి కార‌ణంగా గుండె సంబంధ స‌మ‌స్య‌లే కాకుండా డ‌యాబెటిస్‌, మాన‌సిక ఒత్తిడిల‌కు గుర‌వుతారు. ఏక‌ధాటిగా గంట‌లు గంటలు కూర్చోకుండా విధిగా ప్ర‌తి అర్థ‌గంట‌కు ఓసారి లేచి అటూ ఇటూ తిర‌గాలి.

గంటల కొద్దీ టీవీ ముందు కళ్ళప్పగించి చూడడం వల్ల కళ్ళు దెబ్బతింటాయి. ఎక్కువ సేపు టీవీ చూడడం వల్ల హార్ట్ ఎటాక్, స్ట్రోక్, ఊబకాయం వంటి సమస్యలు కలుగుతాయి. ప్రతీ మనిషికి రోజుకు ఆరేడు గంటల నిద్ర ఆరోగ్యానికి అత్యవసరం. సరైన నిద్ర లేకపోతె శరీరంలోని రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. ఇతర శరీర ప్రక్రియలు అలాగే వ్యవస్థల పద్దతులు పాడవుతాయి. నిద్రలేమి వల్ల రోగ నిరోధక శక్తి బలహీనమవుతుంది. హెడ్ ఫోన్స్ లేదా ఇయర్ ఫోన్స్ మనలో చాలా మందికి రోజు మొత్తంలో ఏకైక స్నేహితుడు. ప్రయాణం చేస్తున్నప్పుడు లేదా బయటికి వెళ్ళినప్పుడు సంగీతం వినడం ద్వారా టైం పాస్ చేస్తాము. కానీ ఇదే అలవాటు ఎక్కువ గంటలు నిర్విరామంగా కొనసాగితే మాత్రం ఈ అలవాటుని తగ్గించుకునే ప్రయత్నం ఆరంభించాలి.

రోజూ ఎత్తు చెప్పులు వేసుకునే మహిళలు వారి శరీరానికి తీరని హాని కలిగిస్తున్నారని చెప్పుకోవాలి. ఎత్తు మడమల చెప్పులు వేసుకోవడం వల్ల కీళ్ళపై ఒత్తిడి ఎక్కువవుతుంది. అనేక రకాల ఇతర సమస్యలు కూడా తలెత్తవచ్చు. చాల మంది మహిళలకు మేకప్‌తో నిద్రపోయే అలవాటు ఉంటుంది. ఫలితంగా మచ్చలు, కాంజేస్టెడ్ స్కిన్, చర్మ రంద్రాలు మూసుకుపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటితో పాటు, మస్కారా, ఇతర మేకప్‌ల వంటివి కంటికి ఇబ్బంది కలిగించడమే కాకుండా దృష్టికి సంబంధించిన సమస్యలు అందిస్తాయి. అందువల్ల మీలో ఉన్న చెడు అలవాట్లకు స్వస్తి చెప్పండి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోండి.

Leave a Comment