Health Tips: ఏడుపు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.. ఎలాగో తెలుసా..?

By manavaradhi.com

Published on:

Follow Us

చాలా మందికి చిన్న విషయానికే ఏడుపు వచ్చేస్తుంటుంది. కొంతమంది అయితే వారికి ఎంత పెద్ద కష్టం వచ్చినా అలానే ఉంటారు. వాళ్ళ కళ్ళల్లో నుంచి ఒక్క చుక్క నీరు కూడా రాదు. మరికొందరు ప్రతి చిన్న విషయానికి ఎక్కువ ఆందోళన పడతారు. ఎవరైనా అదేపనిగా ఏడవడం మంచిది కాదు, కానీ మనసుకు బాధ కలిగినప్పుడు, బాధలో ఉన్నప్పుడు కన్నీరు కార్చమంటున్నారు పరిశోధకులు. బాధ కలిగినప్పుడు సహజసిద్ధమైన కన్నీటిని కార్చాలి. అదేవిధంగా ఒత్తిడి కూడా. ఒత్తిడి కలిగినప్పుడు దానిని అనుభవించాలి. ఈ రెండూ అప్పుడప్పుడు మేలు చేసేవే.

ఎవరు ఓదార్చినా ఓదార్చక పోయినా తనివి తీరా కన్నీరు పెట్టుకుని విలపించడం ఆరోగ్యానికి, ప్రత్యేకించి గుండెకు ఎంతో మంచిదని మానసికవేత్తలు చెబుతున్నారు. కొందరు ఏడ్చేందుకు మొహమాట పడతారు. సిగ్గు పడతారు. కంట నీరు పెట్టుకోవడం నలుగురిలో నామోషీగా భావిస్తారు. ఏడుపు వచ్చినప్పుడు బిడియాన్ని విడిచిపెట్టి మనస్ఫూర్తిగా కన్నీరు కార్చమంటున్నారు మానసికవేత్తలు.

మానవ ఉద్వేగాలలో కన్నీరు ఒకటి. బాగోద్వేగాల కలబోత లో ఎప్పుడో ఒకసారి మనందరమూ కన్నీరు పెట్టుకొన్నవారిమే. దుఖం, దిగులు, బాధ, వేదన వంటి సందర్భాలలోనే కాదు ,పట్టలేని సంతోషమొచ్చినా కూడా మన కళ్ళ వెంట నీళ్ళొస్తాయి. కన్నీళ్ళు పెట్టుకోవడమూ ఒక గొప్ప వరమే. మన లోపల ఆర్ద్రత, ప్రేమ, దయ, ఉన్నాయని చెప్పడానికి కన్నీళ్ళే ఉదాహరణ. ఎందుకంటే కన్నీళ్ళు ఆరోగ్యకరమైన ఉద్వేగము. ఆరోగ్యంగా ఉండాలంటే మనస్ఫూర్తిగా కన్నీళ్లు పెట్టుకోండి. వెక్కివెక్కి ఏడ్వండి. ఉద్వేగాలను దాచుకుని బాధ పడటం కంటే ఏడిస్తేనే ఆరోగ్యంగా ఉంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఏడ్చినప్పుడు వచ్చే కన్నీరు కంటికి మంచి చేస్తుంది. ఆ కన్నీళ్లు కళ్ళను శుభ్రపరుస్తాయి. కనుగుడ్లకు, కనురెప్పలకు కన్నీళ్లు ఒక లూబ్రికెంట్‌గా ఉపయోగపడతాయి. కనుగుడ్లను, రెప్పలను లూబ్రికేట్‌ చేసి వాటి లోపలి పొరలను ఎండిపోకుండా చేస్తుంది కన్నీరు. ఎందుకంటే ఆ పొరలు ఎండిపోయినట్లయితే చూపు మందగించే ప్రమాదం ఉంది. వ్యాయామం చేస్తే ఎలా ఒత్తిడి దూరం అవుతుందో అలాగే కన్నీరు కారిస్తే కూడా ఒత్తిడి దూరం అవుతుంది. ఒత్తిడి వల్ల శరీరంలో ఉత్పత్తయ్యే రసాయనాలు కన్నీళ్లతో పాటే బయటకు పోతాయి. అయితే ఏడుపులో కూడా ఒక నియంత్రణ ఉండాలి. లేదంటే ఆ కన్నీళ్ళు కూడా తలలో నరాలపై ఒత్తిడిని పెంచుతాయి. కాబట్టి అతిగా ఎప్పుడు ఏడుస్తూ ఉండకూడదు.

రోజూవారి పనులలో శరీరంపై దుమ్ము,ధూళి చేరినట్లే కళ్లల్లో కూడా వివిధ రకాల క్రిములు చేరతాయి. ఆ క్రిములు పోవాలంటే కంటి నుంచి నీరు రావాలి. కళ్లలో బాక్టీరియాను చంపడంలో కన్నీళ్లు ముందుంటాయి. ఇవి యాంటీ బాక్టీరియల్‌, యాంటీ వైరల్‌ ఏజెంట్లుగా కంటికి రక్షణ కల్పిస్తాయి. కంట్లో క్రిములతో పోరాడి వెళ్ళగొట్టి కంటి ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. కళ్లలో నుంచి వచ్చే నీటిలో లైసోజోమ్‌ అనే ద్రవం ఉంటుంది. అది 90 నుంచి 95 శాతం బాక్టీరియాను చంపేస్తుంది. ఒత్తిడి కలిగిన సమయంలో ఏడవడం వల్ల ఒక్కసారి ప్రశాంతత ఏర్పడుతుంది. విశ్రాంత భావన కలుగుతుంది.

ఒక్కసారి ఏడ్చినట్లయితే ఆ వ్యక్తిలో మాంగనీస్‌ స్థాయి తగ్గుతుంది. దానితో ఆందోళన, నరాల ఉద్రిక్తత, కోపం, అలసట, భావావేశంలాంటి నెగెటివ్‌ భావాలన్నీ పోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది. దీనివల్ల పాజిటివ్‌ శక్తిని కూడగట్టుకోవచ్చు. ఏడిస్తే నరాలు, హృదయం ఎంతో తేలిక పడతాయి. ఏడవడం వల్ల సాంత్వన పొందడం లేదా హాని కలగడం అనేది పరిస్థితులను బట్టి ఉంటుంది. డిప్రెషన, యాంగ్జయిటీతో బాధపడేవారు ఏడిస్తే అది వారికి మంచికన్నా చెడే ఎక్కువ చేస్తుంది. ఒత్తిడికి లోనయి ఏడిస్తే ఊపిరి సైతం మెల్లగా తీసుకుంటారు. ఏడుపులో ఉద్రేకపడితే ఒత్తిడి బాగా పెరుగుతుంది. ఫలితంగా గుండె వేగం పెరుగుతుంది. చెమటలు బాగా కారతాయి. ఒక్కసారి ఏడిస్తే మూడ్‌ బాగుపడుతుంది. అంతేకాదు ఏడవడం వల్ల ఉద్వేగం తగ్గుతుంది. శరీరంలో నొప్పులు కూడా తగ్గుతాయి.

Leave a Comment