Health Check Ups – ఏడాదికోసారైనా బాడీ చెకప్ ఎందుకు చేయించుకోవాలి?

By manavaradhi.com

Published on:

Follow Us
Annual Health Check-Up

మానవ శరీరం ఒక యంత్రం లాంటిది. అలుపన్నదే లేకుండా నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. మనం నిద్రపోతున్నా శరీరంలోని వ్యవస్థలన్నీ సక్రమంగా వాటి పని అవి చేస్తూనే ఉంటాయి. ఒక వేళ శరీరంలో ఏ భాగం అయినా అలా పనిచేయకపోతే మనకు తిప్పలు తప్పవు. శరీరంలోని వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా… సమీప కాలంలో ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందా అనేది తెలుసుకోవడం కోసం జనరల్ బాడీ చెకప్ చేయించుకోవడం అవసరం.

అడుసు తొక్కనేల కాలు కడగనేల అంటారు. అలాగే అనారోగ్యం పాలు కానేల.., ఆ తరువాత డాక్టర్లు దగ్గరకు తిరగనేల. రోగాలు పాలు కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటే అనేక అనారోగ్యాలను దరిచేరకుండా చూసుకోవచ్చు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుసుకోవడం కోసం అరోగ్య పరీక్షలు అవసరం. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, విపరీతమైన ఒత్తిడి, సరైన నిద్ర, వ్యాయామం లేకపోవడం లాంటివి నేటి సగటు జీవికి సాధారణం అయిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యం ఎలా ఉందో తెలియాలంటే జనరల్ బాడీ చెకప్ చక్కని మార్గం. ఏ అనారోగ్యం లేకున్నా ఆరు నెలలకోసారి.. లేదా సంవత్సరానికోసారయినా బాడీ చెకప్ చేయించుకోవడం ద్వారా అనారోగ్యాలకు చెక్ పెట్టవచ్చు.

తల వెంట్రుక నుంచి కాలి గోరు వరకు శరీరంలో అన్ని వ్యవస్థలు ఒక పద్ధతి ప్రకారమే పనిచేస్తాయి. జుట్టు రాలే సమస్య నుంచి గోళ్ళు పాలిపోవడం వరకు అనేక విధాలుగా అనారోగ్యం తాలుకా లక్షణాలును శరీరం మనకు తెలియజేస్తూ ఉంటుంది. కొన్ని సార్లు వాటిని మనం గ్రహించగలుగుతాం. కొన్ని సార్లు అర్థం కాకపోవచ్చు. లేదా పట్టించుకోం. అయితే ఈ లక్షణాలు ఏం సూచిస్తున్నాయి అనేది తెలియడం కోసమే జనరల్ బాడీ చెకప్. బయటకు ఆరోగ్యంగా కనిపిస్తున్నా శరీరం లోపల ఇబ్బందులు ఉండవచ్చు. అలాంటి ఇబ్బందుల్ని కొన్ని పరీక్షల ద్వారా ముందే గ్రహించడాన్ని జనరల్ బాడీ చెకప్ అని చెప్పుకోవచ్చు. రక్తంలో హెమోగ్లోబిన్ స్థాయి, షుగర్ లెవల్స్, లివర్ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ టెస్ట్, యూరిన్ టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్, ఈసీజీ లాంటివి జనరల్ బాడీ చెకప్ లో భాగంగా చేస్తారు. బాహ్య లక్షణాలు బట్టి మరికొన్ని అదనపు టెస్ట్ లు కూడా చేయవచ్చు.

జనరల్ బాడీ చెకప్ చేయించుకోవడానికి ప్రత్యేకమైన సమయం అంటూ ఏమీ ఉండదు. ఏదైనా అనారోగ్యం వస్తే డాక్టర్ దగ్గరకు వెళతాం. అయితే ఏ అనారోగ్యం లేకున్నా ఆరు నెలలకోసారి బాడీ చెకప్ చేయించుకోవాలి. వయసు మళ్ళిన వారికి బాడీ చెకప్ చేయించుకోవడం ద్వారా ఎక్కు వ ప్రయోజనం ఉంటుంది. ఇక గర్భిణీలు ప్రతి నెలా చెకప్ చేయించుకోవడం సాధారణంగా జరిగేదే. ఐదేళ్ళలోపు చిన్న పిల్లల ఆరోగ్య స్థితిపై కూడా ప్రతి రెండు నెలలకోసారి వైద్యుడ్ని సంప్రదించడం ఉత్తమం. ప్రత్యేకించి సీజన్ మారినప్పుడు చిన్నపిల్లలకు సంబంధించిన వ్యాధులు సోకుతాయి. కాబట్టి ఆ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.

వయస్సులో ఉన్నవారు కూడా కుటుంబంలో ఎవరికైనా జన్యుపరమైన, వంశపారంపర్య వ్యాధులు ఉంటే బాడీ చెకప్ చేయించుకోవాలి. ఒత్తిడి ఎక్కువగా ఉండే ఉద్యోగాలు చేసే వారిని కూడా రెగ్యులర్ చెకప్ చేయించుకోమని వైద్యులు సూచిస్తారు. తరచూ జలుబు, జ్వరం బారిన పడుతున్నా, శరీరం మీద ఏవైనా చిన్న చిన్న పుండ్లు వస్తున్నా.., వికారంగా ఉండటం, నిద్ర పట్టకపోవడం, త్వరగా అలసిపోవడం, ఉన్నట్టుండి బరువు పెరగడం లాంటి లక్షణాలు కనిపిస్తుంటే వైద్య పరీక్షలు చేయించుకోవడం వలన రోగం బయటపడుతుంది.

మన శరీరం గురించి మనకు పూర్తి అవగాహన కలిగించేదే బాడీ చెకప్. వైద్య పరీక్షల అనంతరం ఆరోగ్యానికి సంబంధించి ఎక్కడ నిర్లక్ష్యం చేస్తున్నాము అనే అవగాహన వస్తుంది. సాధారణంగా తీసుకుంటున్న ఆహారంలో ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయి.., వ్యాయామం ఏ మేరకు చేయాలి అనే విషయాలపై స్పష్టత వస్తుంది. షుగర్ లెవల్స్ పెరుగుతుంటే అందుకు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి.., రక్తంలో కొలస్ట్రాల్ స్థాయి పెరుగుతుంటే వ్యాయామం పెంచాల్సిన అవసరం ఉంటుంది. అలర్జీలు, ఇతర సమస్యలు వస్తుంటే జీవనశైలి మార్చుకోవాలి.

Leave a Comment