వృద్ధాప్యం రెండో బాల్యం. వృద్ధాప్యం ఓ భిన్నమైన జీవన దశ…! కాలంతో పాటే యవ్వన ఛాయలు కరిగిపోతూ.. దశాబ్దాల శ్రమ ఫలితంగా శరీరం అరిగిపోతోందన్న సంకేతాలు ఆరంభమైనప్పుడే జాగ్రత్తలు తీసుకుంటే ఈ మలిదశను ఎంతో ఆనందంగా గడపొచ్చు. అలాంటి వృద్ధాప్యంలోనే అనేకానేక ఆరోగ్య సమస్యలు చుట్టు ముడతాయి. వృద్ధాప్యంలో ఎదురయ్యే సమస్యలకు ఎలాంటి పరిష్కారాలున్నాయి.
70 ఏళ్ళు దాటిన తర్వాత వృద్ధాప్యం ప్రారంభమవుతుంది. వయస్సు పెరిగేకొద్ది వచ్చే సాధారణ ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతుంటాయి. వృద్ధుల్లో తరచుగా కనిపించే 11 రకాల ఆరోగ్య సమస్యలు :
- చూపు తగ్గడం
- కదలికలు కష్టం కావడం
- కీళ్లు , కండరాల బాధలు
- గుండె జబ్బులు
- మెదడు, నాడుల సమస్యలు
- శ్వాస సమస్యలు
- చర్మ వ్యాధులు
- మలబద్దకం, జీర్ణసమస్యలు
- మానసిక సమస్యలు
- వినికిడి లోపం
- మూత్ర సంబంధ సమస్యలు
వీటితో పాటు జ్ఞాపకశక్తి తగ్గిపోవటం, విసర్జనాలను ఆపుకోలేకపోవటం వంటి సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. అలాగే, మానసిక ఒత్తిడికి గురవటం, కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాతం వంటి ఆరోగ్య సమస్యలను గుర్తించవచ్చు.
ఎక్కువగా వృద్థుల్లో కనిపించే సమస్య… ఆస్టియో ఆర్ధరైటిస్. వయస్సులో వచ్చే మార్పుల వల్ల కార్టిలేజ్ తరిగిపోవటం వల్ల రెండు ఎముకలు ఒక దానికొకటి రాసుకోవటం జరిగి కీళ్ళనొప్పికి దారి తీస్తుంది. ఎముకలు ఇన్ఫ్లమేషన్కి గురై ఎక్కువ బరువు మోపటంతో కీళ్ళ నొప్పి వస్తుంది. కీళ్ళకు దెబ్బలు తగిలి ఇన్ఫ్లమేషన్ రావటం, ప్రమాదాల వల్ల కూడా ఆస్టియో ఆర్థరైటిస్ వస్తుంది. ఊబకాయం వల్ల ముఖ్యంగా మోకాళ్ళు, కీళ్ళు ఆస్టియో ఆర్థరైటిస్‌కి గురవుతాయి. వంశానుగత కారణాల వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. ఎక్స్‌రే ద్వారా వ్యాధి నిర్థారించవచ్చు. ఎక్కువసేపు నిలబడలేకపోవటం, ఎక్కువ దూరం నడవలేకపోవటం, మెట్లు ఎక్కలేక పోవటం, రాత్రిపూట నొప్పి ఎక్కువ, చల్లగాలికి నొప్పులు ఎక్కువ అవ్వటం వంటి ముఖ్య లక్షణాలు గుర్తించవచ్చు. అలాగే వృద్ధాప్యంలో వేధించే మరో సమస్య ఆస్టియో పోరోసిస్. వృద్ధాప్యం వల్ల ఎముకలల్లో సాంద్రత కోల్పోయి, కణజాలం ఆకృతి, నాణ్యతను కోల్పోయి, ఎముకలలో ఉండే శక్తి తగ్గిపోతుంది. ఎలాంటి ప్రమాదం జరగకుండానే ఎముకలు విరుగుతాయి. స్త్రీలలో నెలసరి ఆగిపోయిన తరువాత కొన్ని హార్మోన్ల ఉత్పత్తి తగ్గి ఆస్టియో పోరోసిస్ సమస్య వచ్చే అవకాశం ఉంది. వెన్నుపూస ఎముకల బలహీనత వల్ల నడుమునొప్పి వస్తుంది. మోకాళ్ళ కీళ్ళలో బోన్ మాస్ తగ్గి నొప్పి, ఎక్కువ దూరం నడవలేకపోవటం, మెట్లు ఎక్కలేకపోవటం, కొందరిలో వెన్నుపూస వంగిపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
వస్తువులు పెట్టిన చోటు మరచిపోవడం ముదిమి వయసులో సాధారణమే. మతిమరుపు ఎక్కువై ఇంట్లో వాళ్లను సైతం గుర్తుపట్టలేనంతగా సమస్య ఉంటుంది. వృద్ధుల్లో తికమక పడటం, మతిమరుపు వంటి లక్షణాలు సహజంగా కనిపించేవే. నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంచడానికి… ఎర్ర రక్తకణాల తయారీకి … బీ 12 విటమిన్ తప్పనిసరి. ఎప్పుడైతే బీ 12 విటమిన్‌ను గ్రహించే శక్తి తగ్గుతుందో… అప్పుడు మతిమరుపు ప్రారంభమవుతుంది. మాంసం తీసుకోవడం ద్వారా మరీ ముఖ్యంగా కాలేయం ద్వారా బీ 12 విటమిన్ పొందవచ్చు. చేపలు, గుడ్డు, చికెన్‌లో కూడా బీ12 లభిస్తుంది. అలాగే రక్తనాళాలు పూడుకుపోయి కొంత భాగానికి రక్తం కరవైతే పక్షవాతం సంభవిస్తుంది. శరీరంలో సగ భాగం చచ్చుబడిపోతుంది. మెదడులో ఏ భాగం దెబ్బతింటే ఆయా ప్రాంతం నియంత్రణలో ఉండే అవయవాలు పట్టుతప్పిపోతాయి. ఈవ్యాధి లక్షణాలు కనపడగానే 24 గంటల్లో వైద్యం అందించడం ద్వారా కొంత ఫలితం సాధించవచ్చు. జ్ఞాపకశక్తి తగ్గిపోవటం, నిర్ణయాలు తీసుకోలేకపోతుండటం, సమస్యలను సరిగా అర్థం చేసుకోలేకపోతుండటం.. వీటివల్ల రోజువారీ పనులు కూడా కష్టంగా మారతాయి. క్రమేపీ ఇది జ్ఞాపకశక్తి లోపానికి దారి తీస్తుంది. నివారణ కోసం హైపర్ టెన్షన్, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ వంటి వాటిని కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవాలి. పొగ అలవాటు మానెయ్యాలి. రోజూ తక్కువ డోసులో ఆస్పిరిన్ మాత్ర తీసుకోవాలి.
మలివయసు వారిని నిత్యం ఇబ్బందికి గురిచేసే మరో సమస్య మలబద్ధకం. తగినంత శారీరక శ్రమ లేకపోవటం, దానికి తోడు సరిగా నమలకపోవడం, నమిలేందుకు వీలులేని ఆహారపదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్య మరింతగా ముదురుతుంది. పీచు ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు, ముడి ధాన్యాల వంటివి ఎక్కువగా తినాలి. నీరు సమృద్ధిగా తాగాలి. పీచులేనటువంటివి, బాగా శుద్ధి చేసిన పదార్థాలు తీసుకోవడం తగ్గించాలి. ప్రతి రోజూ మలవిసర్జన జరిగితేనే హాయిగా ఉంటుందన్న భావన నుంచి బయటపడాలి. మలవిసర్జన… రోజుకు మూడు సార్ల నుంచి వారానికి మూడు సార్ల వరకూ… సహజమే. వృద్ధాప్యంలో వాడే కొన్ని రకాల మందులు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మలబద్ధకం ఏర్పడుతుంది.
వృద్ధాప్యంలో ఇబ్బందిపెట్టే మరో సమస్య … దృష్టిలోపం. వయసుతో పాటు చూపు కొద్దిగా తగ్గడం సహజమే. ఒక వయసుకు రాగానే కంటిలోని కార్నియా పొర దళసరిగా తయారై, శుక్లాలు వస్తాయి. అలాగే ఒక వయసుకు వచ్చేసరికి వినికిడి కూడా తగ్గుతుంది. ముఖ్యంగా వృద్ధాప్యంలో అధిక పౌనఃపున్యం ఉండే ధ్వనులు సరిగా వినపడవు. చాలామంది వినికిడి తగ్గిందన్న విషయాన్ని అంగీకరించటానికే ఇష్టపడరు. ఒకవేళ దాన్ని అంగీకరించినా, వెద్యులకు చూపించుకోవటానికి ఇష్టపడరు. కానీ దీనివల్ల నలుగురిలో కలవలేకపోవటం, ఎవరేమంటారోనని చిన్నతనంగా భావిస్తుండటం, సమాజానికి దూరం కావటం, క్రమేపీ కుంగుబాటులోకి జారిపోవటం వంటి సమస్యలన్నీ బయల్దేరతాయి. కాబట్టి వినికిడి తగ్గుతోందనిపిస్తే తోసేసుకుని తిరగటం కాకుండా.. వెద్యులకు చూపించుకుని అవసరమైతే తేలికపాటి వినికిడి యంత్రాల వంటివి తీసుకోవటం ద్వారా చక్కటి సామాజిక జీవితాన్ని గడపొచ్చని గుర్తించాలి.
వయస్సు పెరిగే కొలది రక్తపోటు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. అధిక రక్తపోటు సమస్య మూత్రపిండాల వ్యాధి, గుండెపోటు వంటి ఆటుపోట్లకు దారితీస్తుంది. బ్రెయిన్ హామరేజ్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. వృద్ధులలో ఐసోలేటేడ్ సిస్టోలిక్ అధిక రక్తపోటు గణనీయంగా హృదయ వ్యాధుల ప్రమాదాలని పెంచుతుంది. 140 mm Hg కంటే ఎక్కువ సిస్టోలిక్ బీపీని కలిగి ఉన్న వ్యక్తులకు చికిత్స అవసరం.ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించినట్లయితే అధిక రక్తపోటును నివారించవచ్చు. ఆహారపు అలవాట్లలో ఎక్కువగా కూరగాయలు, పండ్లు, ధాన్యపు ఉత్పత్తులు ఉండేలా… కొవ్వు పాల ఉత్పత్తులను తక్కువ స్థాయిలో చేర్చాలి. చమురు, కొవ్వు పదార్ధాలను పరిమితంగా తీసుకోవాలి. బరువును తగ్గించుకోవాలి. అలాగే వృద్ధులను వేధించే మరో సమస్య … మధుమేహం. ఇది వ్యాధి కాకపోయినా.. అనేక అరోగ్య సమస్యలకు కారణమవుతుంది. క్లోమగ్రంథి విడుదల చేసే ఇన్సులిన్ హార్మోన్లో హెచ్చుతగ్గుల కారణంగా వచ్చే మధుమేహం… నలభై దాటిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. మధుమేహాన్ని ఎంతగా అదుపులో ఉంచుకోగలిగితే వృద్ధాప్యంలో ఎంతో మంచిది. నెలకు 2 కిలోల కంటే ఎక్కువ బరువు తగ్గుతున్నట్లుగా గమనిస్తే వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలి.
వీటితో పాటు బ్రాంకైటిస్, ప్రొస్టేట్ గ్రంధి పెరగడం, హైపో థైరాయిడిజమ్, వెర్టిగో వంటి ఆరోగ్య సమస్యలతో పాటు అశక్తత, నిస్సత్తువ, మరణం పట్ల భయం అన్నవి వృద్ధాప్యంలో ప్రధానంగా కనుపించే సమస్యలు. ఆందోళనలు, ఒత్తిడులు, వ్యాకులతలు తగ్గించుకోవాలి, పోషకాహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. స్నేహితులతో, కుటుంబసభ్యులతో సరదాగా గడపాలి.