గుండె మన శరీరంలో అన్ని భాగాలకు రక్తాన్ని పంపిస్తుంది. ఇది మన జీవక్రియలో నిరంతర జరిగే ప్రక్రియ. చాలా మందిలో అనేక రకాల కారణాల వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డలు కట్టడమో, రక్తం చిక్కపడడం వల్ల గుండె పోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వీరికి వైద్యులు బ్లడ్ థిన్నర్స్ ఇస్తారు. కానీ వీటి వాడేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
రక్తాన్ని పలుచబరిచే మందులు వాడేటప్పుడు చాలా జాగ్రత్తలు అవసరం. రక్తం గడ్డకట్టే సమస్య ఉన్నవారికి వైద్యులు ఈ మందులను సూచిస్తుంటారు. రక్తనాళాల్లోని లోపలి పొర మామూలుగా ఎండోథీలియం అనే సున్నిత కణాలతో ఆవరించబడి ఉంటుంది. ఈ ఎండోథీలియం కణాలు క్రియాశీలకంగా ఉంటూ, రక్తప్రవాహాన్ని క్రమబద్దం చేస్తుంటాయి. దానికి తోడు రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడకుండా, రక్త నాళాల్లోంచి రక్తం కారిపోకుండా కూడా నిరోధిస్తుంటాయి. అయితే, వివిధ కారణాల వల్ల ఈ ఎండోథీలియం కణాలు దెబ్బతింటూ ఉంటాయి.
ఎండోథీలియం కణాలు ఇలా దెబ్బ తిన్నప్పుడు రక్తం చిక్కబడటమో, గడ్డలు కట్టడమో జరుగుతుంది. ఈ గడ్డలు గుండె రక్తనాళాల్లో అడ్డుపడి గుండెపోటుకు కారణం కావచ్చు. మెదడు రక్తనాళాల్లో అడ్డుపడి పక్షవాతానికి కారణం కావచ్చు. అయితే, గడ్డలు ఏర్పడకుండా నిలువరించడానికి యాంటీ కాగులెంట్లను, ప్లేట్లెట్ల అసహజ ధోరణిని నిరోధించడానికి యాంటీ ప్లేట్లెట్లను ఇవ్వాల్సి ఉంటుంది.
సాధారణంగా రక్తాన్ని పలచబరిచే బ్లడ్ థిన్నర్లను రెండవ దశ వైద్యంగానే ఇస్తారు. స్టెంట్లు వేసిన తర్వాత ఇస్తూ ఉంటారు. ఈ మందులను కనీసం ఏడాదిపాటైనా, క్రమం తప్పకుండా రోజూ వేసుకోవలసి ఉంటుంది. దెబ్బతిన్న గుండె కవాటాలకు చికిత్స పొందిన వాళ్లయితే ఈ మందులను జీవితకాలమంతా వాడాల్సి ఉంటుంది. కాలి నరాల్లో రక్తం గడ్డలు కట్టినప్పుడు అవి కరిగిపోవడానికి ఈ మందులు 6 మాసాల పాటు వాడాల్సి ఉంటుంది.
రక్తం పేరుకుపోవడం లేదా రక్తం గడ్డకట్టుకుపోవడం వల్ల కొందరి గుండె లయ తప్పి కొట్టుకుంటుంది. అలాంటి వారికి కూడా యాంటీ కాగ్యులెంట్లు, నావల్-యాంటీ కాగ్యులెంట్ల వంటి మందుల వల్ల ప్రయోజనం కలుగుతుంది. ఐతే ఈ మందులు వాడేటప్పుడు ఏ చిన్న గాయమైనా పెద్ద ప్రమాదంగా పరిణమించవచ్చు. రక్తాన్ని పలుచబరిచే మందుల వల్ల బ్లడ్ లో ప్రసరణ వేగం పెరుగుతుంది. గడ్డకట్టే అవకాశం ఉండదు. ఇలాంటి సమయాల్లో దెబ్బలు తాకకుండా జాగ్రత్తపడాలి. ఒకవేళ దెబ్బలు తగిలి గాయమైతే బయటకు వస్తున్న రక్తాన్ని ఆపడం చాలా కష్టం. ఈ మందులు వాడే వారు ఎక్కువగా ఆటలు ఆడకూడదు.
బ్లడ్ థిన్నర్ల వల్ల ఎంతో మంది హృద్రోగులకు ప్రయోజనం కలుగుతుందనేది వాస్తవం. అయితే, కొంత మంది హృద్రోగులు వీటి దుష్ప్రభావాలకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా రక్తం పలచగా ఉండడం వల్ల ఎముకలు, పొట్ట, చర్మం, మెదడు భాగాల్లో అతిగా రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంది. అయితే రోగి పడిపోయి గాయాల పాలై, లేదా మరేదైనా ప్రమాదానికి గురైన వారిలోనే ఈ దుష్ప్రభావాలు ఎక్కువగా కనిపిస్తాయి. అందువల్ల ఇలాంటి ప్రమాదాల బారిన పడకుండా పలు విధాల ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అలాగే ఏదైనా సర్జరీ జరగడానికి, లేదా దంతాలను తొలగించడానికి ముందు బ్లడ్ థిన్నర్ మందులను ఆపాల్సి ఉంటుంది. సర్జరీ అయిపోయాక మందులను వేసుకోవడం మళ్లీ కొనసాగించవచ్చు.
రక్తాన్ని పలుచబరిచే మందులు వాడేటప్పుడు చాలా జాగ్రత్తలు అవసరం. బ్లడ్ తిన్నర్స్ మందులు వాడేవారు ఎలాంటి గాయాలు కాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఈ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే, బ్లడ్ థిన్నర్ల ద్వారా అనేక ప్రయోజనాలు, అవసరమైన ఆరోగ్య రక్షణ పొందవచ్చు.