సమయానికి ఆహారం తీసుకోకపోవడం, ఒత్తిడి ఎక్కువగా ఉండడం, వివిధ శ్వాస కోశ సమస్యలు వెరసి శ్వాసలో చాలా ఇబ్బందులు తీసుకొస్తాయి. ఇలాంటి ఇబ్బందుల్లో గురక కూడా ఒకటి. గురక పెట్టడం వల్ల బాగా నిద్రపోయినట్లు అర్థమా లేదంటే నిద్ర పట్టలేదని భావమా. గురక పెట్టే వారినే కాదు, వారి కుటుంబ సభ్యులను కూడా తీవ్రంగా వేధిస్తుంది.
నిద్రపోతున్న సమయంలో కొంత మంది పెద్దగా శబ్ధం చేస్తుంటారు. మరి కొంత మంది తక్కువ స్థాయిలో శబ్ధం చేస్తుంటారు. దీన్నే గురక అని పిలుస్తారు. చాలా మందికి ఇది నవ్వుకునే సమస్య అయినా, ఆరోగ్యానికి హానికరమైన సమస్య కూడా అనే విషయం గుర్తించాలి. సాధారణంగా ఊబకాయుల్లో దీన్ని మనం ఎక్కువగా చూస్తుంటాం. ఈ మధ్య కాలంలో అనేక ఇతర కారణాల వల్ల చిన్న పిల్లల్లో కూడా ఈ సమస్య కనిపిస్తోంది. సాధారణంగా మనిషి శ్వాసిస్తూనే ఉంటాడు. నిద్ర పోయే సమయంలో ఇది ఓ క్రమ పద్ధతిలో సాగుతుంది. ముక్కు నుంచి స్వర పేటిక వరకూ మనం పీల్చిన గాలి లోపలకు వచ్చి, బయటకు వెళుతూ ఉంటుంది. ఈ మార్గంలో ఎక్కడైనా, ఏవైనా అవరోధాలు ఏర్పడినప్పుడు అంటే ముక్కు నుంచి స్వర పేటిక వరకూ గల నాణాలు సన్నబడ్డా, లేదా శ్వాస ద్వారాలు మూసుకుపోయినా, నిద్రలో గాలిని బలవంతంగా లోపలకు తీసుకోవలసిన ఉంటుంది. ఈ సమయంలో వచ్చే శబ్ధమే గురక.
నిద్ర పోతున్నప్పుడు కొండనాలుక, అంగిలి, నాలుక వెనక్కు వెళ్ళటంతో పాటు శ్వాస కోశం చుట్టూ ఏర్పడే పొర శ్వాసకు అడ్డుపడి గురక వస్తుంది. ఈ సమయంలో ఊపిరి ఆగుతుంది కూడా. ఈ సమయంలో శరీరంలో ఆక్సిజన్ స్థాయి పడిపోయి, గుండె కొట్టుకునే వేగం కూడా పెరుగుతుంది. సాధారణంగా రోజంతా అలసిపోవడం, విశ్రాంతి లేక పోవడం వల్ల గురక వస్తుందని చాలా మంది భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రయాణాల్లో తోటి వారికి ఇబ్బంది కలిగిస్తుంది. అంతే కాదు విదేశాల్లో ఈ సమస్య కారణంగా విడిపోయిన జంటల సంఖ్య కూడా బాగా ఎక్కువ.
గురక పెట్టే వారు బాగా నిద్రపోతున్నారనే అపోహలో చాలా మంది ఉంటారు. నిజానికి ఇది పూర్తిగా నిద్ర పట్టడం కాదు. కలత నిద్ర. ఇలాంటి నిద్ర ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. దీన్ని ప్రారంభంలోనే నివారించకపోతే, మరిన్ని అనారోగ్య సమస్యలకు ఆస్కారం ఉంది.
ఒక్క సారి గురక సమస్య ప్రారంభం అయ్యిందంటే శరీరంలో అనేక మార్పులు కనిపిస్తాయి. గాలి సక్రమంగా అందకపోవండ వల్ల ఎడ్రినల్ హార్మోన్ విడుదల కావడమే కాకుండా, శరీరంలో కార్బన్ డై ఆక్సైడ్ స్థాయి పెరుగుతుంది. గుండె పోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం ఎక్కువ అతుంది. రసాయనాలు రక్తంలో ప్రమాదకర స్థాయికి పెరగడం వల్ల మధుమేహం, మూత్ర పిండాల వ్యాధులకూ ఆస్కారం ఉంది. వీరిలో అనేక మానసిక సమస్యలు ఎదురు కావడానికి కూడా ఆస్కారం ఉంటుంది.
ఏకాగ్రత తగ్గి, మతిమరుపు పెరగడం, కోపం, చిరాకు, నీరసం లాంటి సమస్యలు ఎదురౌతాయి. తరచుగా నిద్రపోవాలన్న భావన ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కూర్చుని నిద్రలోకి జారుకునే వారి సంఖ్యా అధికమే. రాత్రి పూట నిద్ర పట్టకపోవడమే దీనికి ప్రధాన కారణం. దీని వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఫలితంగా మొత్తం జీవన విధానమే మారిపోతుంది. బరువు పెరుగుతుంటారు. ఎక్కువగా మూత్ర విసర్జన చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంత ప్రమాదకరమైన గురకకు కారణాలు ఏమిటో తెలుసుకుని జాగ్రత్తలు తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉంటాయి.
భోజనం ఆలస్యంగా చేసి, వెంటనే నిద్ర పోవడం గురకకు కారణాల్లో ప్రధానమైనది. దీంతో పాటు బరువు పెరగడం, మద్యపానం, పొగ తాగడం, ముక మధ్య గోడ వంకరగా ఉండడం, ముక్కులో నీటి తిత్తులు ఉండడం దీనికి కారణాలు. టాన్సిల్స్, ఎడినాయిడ్స్ వల్ల పిల్లల్లో కూడా గురక పెరుగుతుంది. వీటన్నిటితో పాటు గాలి కాలుష్యం కారణంగా వ్యాపించే శ్వాసకోశ సమస్యలు కూడా గురకకు కారణం అవుతాయి.
గురక ఏ స్థాయిలో ఉందనే విషయాన్ని తెలుసుకోవడంతో పాటు, కారణాలేమిటో అన్వేషించి వైద్యులు ఈ సమస్యకు చికిత్స అందిస్తారు. పైకి కనిపించే లక్షణాలతో పాటు శ్వాస మార్గంలో ఉన్న లోపాలను గుర్తించినప్పుడే సరైన చికిత్స అందించడం సాధ్యమౌతుంది. దీని ద్వారా కొంత మంది సాధారణ వైద్యం, మరికొందరికి శస్త్ర చికిత్స అందిస్తారు. కొందరిలో ప్రత్యేక పరికరాలు కూడా అవసరం కావచ్చు. అన్నిటికంటే ముఖ్యమైనది ఈ సమస్య తెలియగానే అశ్రద్ధ చేయకుండా, మొహమాటాన్ని పక్కన పెట్టి వైద్యుని సంప్రదించడమే. లేదంటే భవిష్యత్ లో మరిన్ని సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు.
- కొన్ని జాగ్రత్తల ద్వారా కూడా గురకకు చెక్ పెట్టవచ్చు.
- నిత్యం వ్యాయామం చేయడం, పోషకాహారాన్ని తీసుకోవడం
- నిద్ర పోవడానికి మూడు గంటల ముందే ఆహారం తీసుకోవడం
- తిన్న వెంటనే నిద్ర పోక పోవడం, నిద్ర పోయేటప్పుడు ఎడమ వైపునకు తిరిగి పడుకోవడం
- రెండు మూడు తలగడలను వాడడం, గట్టిగా ఉండే దిండ్లు తల కింద ఉంచుకోవడం లాంటివి చేయడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి.
- అదే విధంగా ఎడినాయిడ్, టాన్సిల్స్ ఉన్న వారు వెంటనే శస్త్ర చికిత్స చేయించుకోవాలి. అన్నిటి కంటే ముఖ్యంగా అధిక బరువు ఉన్న వారు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.
- ముక్కులో సమస్యలు ఉన్న వారు శస్త్ర చికిత్స చేయించుకోవాలి.
- గురక సమస్యను గుర్తించిన వెంటనే వైద్యుని సంప్రదించి, వారి సూచనలు, సలహాల మేరకు సరైన చికిత్స ద్వారా గురకను దూరం చేసుకోవచ్చు.