మనం నడవడానికి పాదాలే కీలకం. ఇంట్లో చిన్న పాటి పనులు చేసుకోవాలన్నా పాదాల ఇబ్బందులతో ముందుకు కదల లేని పరిస్థితి. దీనికి కారణం పాదాల సమస్యలు చిన్నవిగా ఉన్నప్పుడు పట్టించుకోక పోవడం. దీని వల్ల సమస్యలు తిరిగి తిరిగి వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా కొన్ని కొన్ని అలవాట్లు మానుకోవడం ద్వార పాదాలను అందంగా ఆరోగ్యం ఉంచుకోవచ్చు.
మన శరీర బరువును మోస్తాయి. ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్తాయి. మనం నడక నేర్చినప్పటి నుంచీ నిరంతరం శ్రమిస్తూనే ఉంటాయి. అయినా ఇతర అవయవాల మాదిరిగా పాదాల ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోం. చూసీ చూడనట్టు వదిలేస్తుంటాం. బిగుతుగా ఉన్నా చెప్పులు, షూ ధరిస్తుంటాం. ఇలాంటివన్నీ పాదాలపై తీవ్రమైన ఒత్తిడి కలగజేస్తాయి. ఏళ్లకేళ్లుగా శ్రమిస్తుండటం వల్ల పాదాలకు రక్త సరఫరా తగ్గటం వంటి జబ్బులూ దాడిచేయొచ్చు. అందువల్ల పాదాలను జాగ్రత్తగా కాపాడుకోవటం ఎంతో అవసరం.
పాదాల సమస్యల్లో ప్రధానం చెప్పుకోవలసింది నొప్పుల గురించే. వీటి గురించి ప్రారంభంలోనే అవగాహన తెచ్చుకోవడం ద్వారా భవిష్యత్ లో ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ఇందులో మొదటగా చెప్పుకోవలసింది మడమ నొప్పి గురించే. మడమను, ఎముకను కలిపినపుడు అక్కడ ఉండే మెత్తని కణజాలంలో వాపు వచ్చినప్పుడు కూడా ఈ సమస్య ఎదురు కావచ్చు. నిద్ర లేచిన వెంటనే ఈ సమస్య బాధిస్తుంది. మడమ వంపులో ఈ సమస్య ఉందంటే కచ్చితంగా అది వాపు కావచ్చు. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు పాదాలకు విశ్రాంతి ఇవ్వాలి.
మెత్తటి మరియు హీల్ ఎత్తుగా లేని చెప్పులు ధరించాలి. దీని వల్ల సమస్యను అధిగమించవచ్చు. మడమను తాకి ఉండే పాదం నొప్పి. ఇది అసహజమైన నడక లేదా, సౌకర్యం లేని చెప్పుల వల్ల ఇబ్బంది పెడతాయి. అధికంగా మార్నింగ్ వాక్ చేసే వారికి ఈ సమస్యలు ఎదురు కావచ్చు. నొప్పి నివారణ చర్యలు, పాదాల విశ్రాంతి, చికిత్స లాంటి ద్వారా ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. ఎక్కువ కాలం సమస్య బాధిస్తుంటే వైద్యుని సంప్రదించడం తప్పనిసరి.
పాదాలకు వచ్చే సమస్యలు ఏవి ?
పాదాలకు సంబంధించిన కీళ్ళలో వచ్చే సమస్యలు తీవ్రమైన గౌట్ లాంటి నొప్పులను కలుగ జేస్తూ ఉంటాయి. బొటన వేలు ఈ సమస్యకు అధికంగా ప్రభావితం అవుతుంది గనుక… అడుగులు వేసేటప్పుడు ఈ సమస్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. బొటన వేలు మొదల్లో ఉబ్బడం లాంటి సమస్య సరైన పాదరక్షలు ధరించకపోవడం వల్ల ఎదురౌతాయి.
ముఖ్యంగా పాదాలపై భారం పడే పనులు చేసినపుడు తప్పకుండా పాదాలను కాపాడుకునే ప్రయత్నాలు చేయాలి. అదే విధంగా మధుమేహం లాంటి సమస్యలు ఉన్న వారి విషయంలో పాదాలు మరింత జాగ్రత్తగా కాపాడుకోవడం తప్పనిసరి. పాదాలకు ఎదురయ్యే అతిపెద్ద సమస్యల్లో స్ట్రెస్ ఫ్రాక్చర్ ఒకటి. ప్రమాదాల ద్వారా ఎదురయ్యే ఈ సమస్యలో కాల్లో ఉండే ఎముక పగిలి పోతుంది. దీని వల్ల మడమనొప్పి, వాపు, ఇన్ఫెక్షన్ లాంటివి ఎదురు కావచ్చు. ఈ సమస్య ఎదురైనప్పుడు మడమ మీద ఒత్తిడి లేకుండా చూడాలి.
మెత్తని పాద రక్షలు ధరించి మడమను కాపాడుకోవాలి. అదే విదంగా నొప్పి నివారణ ఔషధాలు వాడాలి. శస్త్ర చికిత్స లాంటివి అవసరం కావచ్చు. వైద్యుని సంప్రదించడం ద్వారా నొప్పి నివారణ చర్యలు పాటించవచ్చు. అలాగే మోర్టాన్ న్యూరో మ సమస్యలు కాలి వేళ్ళకు ఎదురౌతాయి. వేళ్ళ మధ్య ఉండే నరాల చుట్టూ కణజాలం గట్టిపడడం వల్ల ఈ సమస్య ఎదురౌతుంది. దీని వల్ల తిమ్మిరి లాంటి ఇబ్బందులు వస్తాయి. అధికంగా మహిళల్లో ఈ సమస్య కనిపిస్తుంది. వైద్యుని సంప్రదించి సరైన మందులు తీసుకోవడం, నొప్పి నివారణ చర్యలు పాటించడం చేయాలి.
పాదాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
పాదాలను కాపాడుకోవటం షూ ఎంపిక నుంచే మొదలెట్టాలి. పాదం వంపు వద్ద మంచి దన్ను, మడమ కింద కాస్త మెత్తగా ఉండే షూ ఎంచుకోవటం మేలు. అలాగే మడాలు మరీ ఎత్తుగా లేకుండానూ చూసుకోవాలి. వేళ్లు లోపలి వైపులకు నొక్కుకుపోకుండా ముందు భాగంలో తగినంత స్థలం ఉండే షూ తీసుకోవాలి. ఎత్తుమడాల చెప్పులతో పాదాల నొప్పి మాత్రమే కాదు.. వేళ్ల వద్ద బొబ్బలు, వేళ్లు వంగిపోవటం, మడమ నుంచి వేళ్ల వరకూ విస్తరించి ఉండే కణజాలం పొర వాపు, గోళ్లు లోపలి వైపునకు పెరగటం వంటి సమస్యల ముప్పూ పెరుగుతుంది. అందువల్ల మడాలు మరీ ఎత్తుగా ఉండే చెప్పులకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది.
వీలైనప్పుడల్లా పాదాలను కాస్త సాగదీయటానికి ప్రయత్నించండి. దీంతో నొప్పి తగ్గుముఖం పడుతుంది. బిగుతుగా అయిన కండరాలు, కండర బంధనాలు సాగి వదులవుతాయి. ప్రతిరోజూ సబ్బు, గోరువెచ్చటి నీటితో పాదాలను శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత వేళ్ల మధ్య తడిలేకుండా పూర్తిగా తుడుచుకోవాలి. దీంతో ఇన్ఫెక్షన్లు దరిజేరకుండా చూసుకోవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే పాదాల ఆరోగ్యమూ మెరుగవుతుంది. నడక, పరుగు, సైకిల్ తొక్కటం వంటివన్నీ పాదాల కండరాలు తేలికగా కదలటానికి, బలోపేతం కావటానికి, రక్తప్రసరణ మెరుగవటానికి తోడ్పడతాయి.
వ్యాయామం చేయటం ద్వారా.. ముఖ్యంగా నడకతో పాదాలకు రక్తసరఫరా బాగా మెరుగుపడుతుంది. పాదాల సమస్యలు కొన్నిసార్లు మధుమేహం, కీళ్లవాపు, నాడీ సమస్యల వంటి తీవ్ర జబ్బులకూ తొలి సంకేతం కావచ్చు. వీటిని ముందుగానే గుర్తిస్తే తీవ్రమైన సమస్యల బారినపడకుండా కాపాడుకోవచ్చు. పాదాల్లో తీవ్రమైన నొప్పి, మొద్దుబారటం వంటివి కనిపిస్తే తాత్సారం చేయకుండా డాక్టర్ను కలవాలి.