Lifestyle: రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గితే ఏమవుతుంది.?

By manavaradhi.com

Published on:

Follow Us
Low Blood Sugar warning signs

ప్రస్తుత రోజుల్లో ఆధునిక జీవనశైలి వల్ల బ్లడ్ షుగర్ అనేది ఎంతోమందిని వేధిస్తున్న సమస్యగా మారింది. ఈ బ్లడ్ షుగర్ నియంత్రణలో లేకుంటే ఎదురయ్యే అనారోగ్య సమస్యలు అన్ని ఇన్ని కావు… కాబట్టి బ్లడ్ షుగర్ ను ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి.

రక్తంలో చక్కెర శాతం తగ్గిపోవడం.. ఈ సమస్యనే హైపోగ్లైసీమియా అంటారు. చాలమందిలో దీని ప్రభావం తక్కువగానే ఉంటుంది. కానీ ఇది చాలా ప్రమాదకరం. దీంతో రోగులు కోమాలోకి వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. మధుమేహం ఉన్నవారు మాత్రలు వేసుకుని, ఇన్సూలిన్ తీసుకుని ఎక్కువ శారీరక శ్రమ చేసినా, వ్యాయామం చేసినా రక్తంలో చక్కెర శాతం తగ్గిపోతుంది . అంతేగాకుండా ఇన్సూలిన్ మోతాదుకు మించి తీసుకోవడం, ఎక్కువ సమయం పాటు తినకుండా ఉండడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. ఇలాంటపుడు రక్తంలో చక్కెర స్థాయులను వేగంగా పెంచుకునేలా వైద్యుల సూచనల మేరకు చర్యలు చేపట్టాలి.

రక్తంలో చక్కెర శాతం తగ్గడాన్ని సూచించే ముందస్తు లక్షణాలు ఆకలి , వణకు, అశాంతిగా ఉండటం, చెమట పట్టడం, మైకము లేదా తల తిరగటం, నిద్రమత్తు, గందరగోళం, మాట్లాడటంలో కష్టం, ఆందోళన, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. నిద్రపోతున్న సమయములో కూడా హైపోగ్లైసిమియా యొక్క కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. చెమట ఎక్కువగా పట్టడం, మేల్కొన్న తరువాత అలసిపోయినట్లుగా, చికాకుగా, లేదా అయోమంగా ఉంటుంది.

చక్కెర స్థాయిలో మార్పులను నియంత్రించే ఇన్సులిన్ మరియు గ్లూకగాన్ పొట్టకు దగ్గర ఉండే క్లోమ గ్రంధిలో తయారవుతాయి. క్లోమంలోని ప్రత్యేకమైన జీతా కణాల ద్వారా ఇన్సులిన్ తయారవుతుంది. ఆల్ఫా కణాల ద్వారా గ్లూకగాన్ తయారవుతుంది. శరీరానికి గ్లూకోస్ రవాణాలో ఇన్సులిన్ కీలకపాత్ర పోషిస్తుంది. అలాగే గ్లూకగాన్ గ్లూకోస్ నిల్వ స్థాయిని పెంచుతూ ఉంటుంది. ఈ యంత్రాంగం పనిచేయడం మానేసినపుడు హైపోగ్లైసీమియా ఏర్పడుతుంది. దీనివల్ల ఇతర గ్రంధులు కూడా చక్కెర స్థాయిలను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఫలితంగా చక్కెర స్థాయిలు తగ్గి అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఏయే కారణాల వల్ల ఈ సమస్య వస్తుందో తెలుసుకుంటే భవిష్యత్తులో రాకుండా జాగ్రత్తపడవచ్చు. ఇన్సులిన్ , యాంటీబయాటిక్ మాత్రలు ఎక్కువగా వాడటం, ఆల్కహాల్ సేవించడం, భోజనం సరిగా చేయలేకపోవడం, తీవ్రమైన ఇన్ఫెక్షన్లు, అడ్రినల్ గ్రంధి సమస్యలు, కిడ్నీలు, లివర్ పాడవడం, పుట్టుకతో జన్యు లోపాల లాంటి సమస్యల వల్ల ఇన్సులిన్ విడుదల గతి తప్పుతుంది. ఫలితంగా రక్తంలో గ్లూకోస్ స్థాయి శరీరం ఆధీనం నుంచి తప్పుకుంటుంది. శరీరంలో ఇన్సులిన్ తయారీలో ఉపయోగపడే ఏ భాగానికైనా సమస్య ఇన్సులిన్ సమస్యలు కూడా మొదలవుతాయి. అప్పుడు రక్తంలో చక్కెర స్థాయి తగ్గే ప్రమాదం ఉంది.

రక్తంలో చక్కెర శాతం తగ్గకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

మధుమేహం ఉండేవారిలో గ్లూకోస్ స్థాయి నియంత్రించడానికి ఇన్సులిన్ తీసుకుంటూ ఉంటారు. వారు భోజనం చేసే సమయంలో , చేయని సమయంలో ఇన్సులిన్ ను నియంత్రణలో ఉంచకపోతే వారికి రక్తంలో చక్కెర స్థాయి తక్కువగా ఉందని చెప్పవచ్చు. ఒక్కోసారి ఇన్సులిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల , అతిగా వ్యాయామం చేయడం వల్ల కూడా ఇబ్బందులు తలెత్తవచ్చు.

క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం తీసుకునే మందులు సైతం దీనిమీద ప్రభావం చూపిస్తాయి. అందుకే మధుమేహం, క్యాన్సర్, కిడ్నీ, కాలేయ సమస్యలతో బాధపడుతున్నవారు మాత్రం దీని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రక్తంలో చక్కెర శాతాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకోవడానికి బ్లడ్ గ్లూకోజ్ మానిటర్లు అందుబాటులో ఉన్నాయి. వేలిపై సూదితో గుచ్చి, ఓ ప్రత్యేకమైన స్ట్రిప్ పై రక్తపుబొట్టును వేసి పరికరంలో ఉంచడం ద్వారా నిమిషాల్లోనే గ్లూకోజ్ స్థాయిని తెలుసుకోవచ్చు.

రక్తంలో చక్కెర శాతం తక్కువగా ఉన్నప్పుడు వెంటనే పండ్లు, బిస్కెట్స్, బ్రెడ్, శాండ్ విచ్ తీసుకోవచ్చు. ఈ సమస్య మొదలైన వెంటనే వైద్యున్ని సంప్రదించి మందులు వాడాలి. వీటి ప్రభావం శరీరంలో 48 గంటలు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆ లోపు ఈ సమస్య నివారించే చర్యలు తీసుకోవాలి. అందుకే వివిధ వ్యాధులతో బాధపడుతున్నవారు వ్యాధి సంగతి ఎలా ఉన్నా హైపోగ్లైసీమియా నుంచి జాగ్రత్తగా ఉండాలి. లేదంటే కోమాలోకి వెళ్ళే ప్రమాదం పొంచి ఉంటుంది.

తరచూ రక్తంలో షుగర్ స్థాయి ఎలా ఉందనే విషయాన్ని పరీక్షించుకుంటూ ఉండాలి. అంత కంటే ముందుగా షుగర్ స్థాయిని ప్రభావితం చేసే అంశాలు ఏమిటనే విషయాన్ని తెలుసుకోవలసిన అవసరం ఉంది. వీటి గురించి తెలుసుకుని, వాటిని అదుపు చేయగలిగితే, రక్తంలో షుగర్ స్థాయిని కూడా అదుపు చేయడం సులభమౌతుంది.

Leave a Comment