పురుషులు శారీరకంగా దృఢంగా ఉంటారు. ఇదే వారిని ఆరోగ్యం పట్ల అశ్రద్ధ కలిగించేలా చేస్తుంది. అదీ కాకుండా ఎంత పని ఒత్తిడినైనా తట్టుకుంటాం.. రోజూ వ్యాయామం చేయకపోయినా ఫరవాలేదు. గుండె జబ్బులు,రక్తపోటు.. ఇలాంటి జబ్బులు నాకు వస్తాయా అనే ధోరణి చాలా మంది మగవారు ఉంటున్నారు. తెలిసి చేసినా .. తెలియక చేసినా . ఆరోగ్యం పట్ల పురుషులు నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నారనేది మాత్రం నిజం. అసలు ఫురుషులు ఆరోగ్యం విషయంలో ఎలాంటి తప్పుడు చేస్తున్నారు.
చాలా మంది మగవారు ఆరోగ్యం విషయంలో అస్సలు శ్రద్ధ పెట్టరు. ఆరోగ్యంగా ఉన్నానని మానసికంగా భావించడం మంచిదే. అయితే జాగ్రత్తల విషయంలో దూరంగ కావడం అస్సలు మంచిది కాదు. మనకు ఇష్టం వచ్చినది తినేస్తూ, తాగేస్తూ జీవితాన్ని లాగుతూ ఉంటాం. ఎవరైనా అప్రమత్తత గురించి చెబితే, నాకేం జబ్బు లు లేవు అనుకుంటూ ఉంటాం. ముందు ఈ ఆలోచన మానుకోవాలి. ఏదో ఒక సమస్య ఉంటేనే వైద్యుని సంప్రదించడం కాదు, సమస్య లేకపోయినా, తెలియని సమస్యలు ఉన్నాయోమో తెలుసుకోవడానికైనా వైద్యుని సంప్రదించాలి.
గుండె సంబంధ సమస్యల గురించి యువకులు అస్సలు పట్టించుకోరు. ఈ వయసులో గుండె పోటు ఏమిటి అనుకుంటారు. పరీక్ష చేయించుకోవడానికి కూడా ముందుకురారు. 30 ఏళ్ల వయసులోనే గుండె పోటుకు తొలిబీజం పడుతుంది. అందుకే ఏ వయసులో ఉన్నప్పటికీ, మీరు తీసుకునే ఆహారంలో కుటుంబంలో గుండెపోటు సమస్యల గతాన్ని దృష్టిలో ఉంచుకుని, పరీక్షలు చేయించుకోవలసి ఉంటుంది.
రాత్రి పూట ఎక్కువ సేపు టీవీలకు అతుక్కు పోతున్నారా. అయితే నిద్రకు సంబంధించిన సమస్యల నుంచి, గుండె సమస్యల దిశగా సమస్య పరిగెత్త వచ్చు. ఎక్కువ తొందరపాటు ఉండే వారిలో ఈ సమస్య ఎదురు కావడానికి ఆస్కారం ఉంది గనుక, ప్రతి దానికి ఊరికే కంగారు పడడం, గాబరా లాంటివి తగ్గించుకోవాలి. అదే విధంగా టెన్షన్లను పక్కన పెట్టి, నిద్ర పోవడం అలవాటు చేసుకుంటేనే ఆరోగ్యం బాగుంటుంది.
ఎండలో తిరగడమంటే చాలా మందికి కష్టంగానే ఉంటుంది. అయితే రోజూ చర్మానికి ఎండ తగలకపోతే… చర్మ క్యాన్సర్లు రావడానికి ఆస్కారం ఉంది. అలా అని మండు వేసవిలో మధ్యాహ్నం ఎండలో తిరగమని కాదు, ఉదయం లేదా సాయంత్రం వేళల్లో అయినా ఓ గంట పాటు శరీరానికి ఎండ తగిలేలా జాగ్రత్తలు తీసుకోవాలి. మరీ ఎక్కువ ఎండ కూడా చర్మానికి హాని కలిగిస్తుంది. డి విటమిన్ పుష్కలంగా పొందాలన్నా ఎండలో ఉండడం తప్పనిసరి.
చాలా మంది పడగ్గది సమస్యల విషయంలో మొహమాట పడుతూ ఉంటారు. అంగస్థంభన విషయంలో సమస్యలు ఉన్నాయంటే, కచ్చితంగా గుండె సంబంధ సమస్యలు ఉన్నాయని గుర్తించాలి. పురుషాంగంలో రక్త ప్రవాహంలో సమస్యలు వస్తే ఇలా జరుగుతుంది కాబట్టి, అపోహలు, మొహమాటాలు పక్కన పెట్టి వెంటనే పరీక్షలు చేయించుకోవాలి.
మీ ఆరోగ్యం మీద శ్రద్ధ కనపరచాలంటే రోజుకు ఎన్ని మార్లు బాత్ రూమ్ కు వెళుతున్నారనేది కూడా లెక్కలోకి తీసుకోవాలి. రోజుకు ఎనిమిది సార్లు, రాత్రిళ్ళు 2 సార్లకు మించి మూత్ర విసర్జనకు వెళ్తున్నారంటే అది మీకు సమస్య మాత్రమే కాదు… ఎన్ లార్జ్ ప్రొస్టేట్, ఓవర్ యాక్టివ్ బ్లాడర్ సహా కొన్ని రకాల క్యాన్సర్లకు అది సంకేతం గనుక అప్రమత్తంగా ఉండి, వైద్యుని సంప్రదించాలి.
దంత సమస్యలు వచ్చి, అవి బాగా ముదిరి ఇబ్బంది పెడితే తప్ప చాలా మంది దంత వైద్యుల్ని సంప్రదించరు. నిజానికి స్త్రీ పురుషులిద్దరూ క్రమం తప్పకుండా దంత వైద్యుల్ని సంప్రదిస్తూ ఉండాలి. దీని వల్ల నోటి సమస్యలను గుర్తించడం, నివారించడం మాత్రమే కాకుండా, మధుమేహం, క్రోన్స్ సమస్య, ల్యూపస్, ల్యుకేమియా లాంటి ఇబ్బందుల్ని గుర్తించడానికి ఆస్కారం ఉంటుంది.
చాలా మంది రోజూ ఒకే రకమైన ఆహారం తీసుకోవడం కూడా అనారోగ్య సమస్యలకు కారణం అవుతోంది. అంతే కాదు ఏదో ఒకటిలే అనే జంక్ ఫుడ్స్ విపరీతంగా తినేస్తూ ఉంటారు. పండ్ల జోలికి అస్సలు వెళ్లరు. నిజానికి ఫైబర్ ఉండే పళ్ళు… ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే రోజుకు కనీసం 2 మార్లు పండ్లను తీసుకోవాలని వైద్యు చెబుతారు. దీని వల్ల గుండె, క్యాన్సర్, జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. రక్తంలో చక్కెర స్థాయి కూడా అదుపులో ఉంటుంది.
ఇక కీలకంగా చెప్పుకోవలసిన ముఖ్యమైన అంశం… యువకులమంటూ కొని తెచ్చుకునే చెడు అలవాట్లు. ఇందులో ధూమ పానం, మద్య పానం, థ్రిల్లింగ్ కోసం చేసే ఎన్నో పనులు ఉంటాయి. వీటి వల్ల కూడా ఎంతో మంది శారీరక, మానసిక అనారోగ్యాల బారిన పడుతున్నారు. వీటికి సాద్యమైనంత దూరంగా ఉంటే మంచిది.
రోజూ వ్యాయామం చేయడం మంచి పోషకాహారం తీసుకోవడం.. ఆరోగ్యంపట్ల శ్రద్ద వహించడం.. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురవగానే వైద్యులను సంప్రదించడం అలవాటు చేసుకుంటే పురుషుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతే కాకుండా మద్యం , స్మోకింగ్ లాంటి దురలవాట్లను మానుకుంటే మంచిది.