Silent Heart Attack: హార్ట్ ఎటాక్ పెద్దవాళ్ళు కాదు చిన్న వాళ్ళు రావచ్చు!

By manavaradhi.com

Published on:

Follow Us
Heart Attacks and Young People

హార్ట్ ఎటాక్ అన్నది వైద్యపరంగా అత్యవసర పరిస్థితి. రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండెకు రక్త సరఫరా నిలిచిపోయి హార్ట్ ఎటాక్ వస్తుంది. లేదా రక్తనాళాలు కుచించుకుపోయి గుండెకు రక్త సరఫరా తగినంత అందకపోయినా గానీ హార్ట్ ఎటాక్ వస్తుంది. రక్త సరఫరా నిలిచిపోవడంతో శరీరంలోని కణాలకు ఆక్సిజన్ అందదు. దీంతో ప్రాణాంతకం అవుతుంది. ఏటా 20 లక్షల మంది బలైపోతున్నారు. హార్ట్ ఎటాక్ బారిన పడుతున్న వారిలో 4 నుంచి 10 శాతం మంది 45 ఏళ్లలోపు వయసు వారుంటున్నారు.

కుటుంబ చరిత్ర, ఒత్తిడి, కాలుష్యం, రక్తపోటు, డయాబెటీస్, కొల్లెస్టరాల్ వంటివి ప్రధానంగా చిన్నవయసు వారిలో గుండెపోట్లు కలిగిస్తున్నాయి. గుండెపోటు వచ్చే లక్షణాలు గురించి ప్రతి ఒక్కరు అవగాహన కలిగిఉండాలి… ఛాతీలో వస్తూ, పోతూ వుండే అసౌకర్యం. లేదా కొద్ది నిమిషాలుండి పోయేది. శరీర పైభాగంలో నొప్పి లేదా వీపు, మెడ, దవడ, పొట్ట, ఒక చేయి లేదా రెండు చేతులలోను నొప్పి లేదా అసౌకర్యం.ఛాతీ నొప్పి కలిగి లేదా నొప్పి లేకుండా శ్వాస మందగించటం, చెమటలు పట్టడం, వికారం, కొద్దిపాటి తలనొప్పి వంటివి గుండెపోటు వచ్చేటందుకు చిహ్నాలుగా కనపడతాయి. ఇది గుండెపోటు సంకేతమే అని గుర్తించి నిమిషాల వ్యవధిలో ఆస్పత్రికి వెళ్లగలిగితే నిండు ప్రాణాన్ని నిక్షేపంగా కాపాడుకునేందుకు ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది.

గుండెపోటు అనగానే ఛాతీ పట్టుకుని కుంగిపోతున్న వృద్ధులు కళ్లముందు మెదులుతారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. 25 నుంచి 30 ఏళ్ల వయసువాళ్లూ గుండె జబ్బుల బారిన పడుతున్నారు. ఇందుకు కారణాలు మనలో, మన చుట్టూరానే ఉన్నాయి. వాటిని సరిదిద్దుకోగలిగితే యువత గుండె సమస్యల నుంచి తప్పించుకోవచ్చంటున్నారు వైద్యులు. గుండె పనితీరు మెరుగ్గా ఉండాలంటే జీవనశైలి, ఆహారపుటలవాట్లు సక్రమంగా, ఆరోగ్యకరంగా ఉండాలి. ఎప్పుడైతే ఈ రెండూ క్రమం తప్పుతాయో వాటి ప్రభావం శరీరం మీద పడి ఆరోగ్య వ్యవస్థ గాడి తప్పుతుంది.

కాలంతోపాటు మన ఆహార వ్యవహారాల్లో, జీవన విధానంలో ఎన్నో మార్పులొచ్చాయి. వేళకు తిండి, నిద్ర కరువయ్యాయి. శారీరక శ్రమ తగ్గి, మానసిక ఒత్తిడి పెరిగింది. మద్యం, ధూమపానం లాంటి వ్యసనాలు పెరిగాయి. వీటన్నిటి ఫలితంగా శరీరం ఒడుదొడుకులకు గురవుతూ, క్రమేపీ ఆరోగ్య వ్యవస్థ నిర్వీర్యమైపోతోంది. ఈ పరిస్థితి గుండె జబ్బులకు దారి తీస్తోంది.

శారీరక, మానసిక, వృత్తిపరమైన ఒత్తిడి ఏదైనా గుండె మీద ప్రభావం చూపిస్తుంది. ఉద్యోగంలో కలిగే శారీరక, మానసిక ఒత్తిడి, వ్యక్తిగత జీవితంలోని ఎత్తుపల్లాలు.. వీటిలో దేని ప్రభావమైనా శరీరం మీద ఎక్కువే! వృత్తి వేళల్లో మార్పులు,సమయపాలన పాటించకపోవటం, రాత్రి పని చేయటం.. ఇలా ఒత్తిడికి కారణాలెన్నో! వేళపట్టున తినే అలవాటు యువతలో లోపిస్తోంది. ఆకలితో పనిలేకుండా చేతికందినది తినేయటం, ఆకలి వేసినప్పుడు పౌష్టిక ఆహారం తీసుకోకుండా కాఫీ, టీలు, కోలాలతో కడుపు నింపేయటం మొదలైన అలవాట్లు కూడా ప్రమాదమే! బయట దొరికే జంక్‌ ఫుడ్‌, వాటి తయారీలో వాడే కలరింగ్‌ ఏజెంట్స్‌, ప్రిజర్వేటివ్స్‌, కృత్రిమ చక్కెరలు, నూనెలు, కొవ్వులు ఆరోగ్యాన్ని హరిస్తున్నాయి. గంటల తరబడి కదలకుండా కంప్యూటర్ల ముందు పని చేయటం వల్ల శరీరంలో కొవ్వు పెరుగుతుందనే విషయం అందరికీ తెలిసిందే!

శారీరక వ్యాయామంతో ఈ అదనపు కొవ్వును కరిగించుకోవచ్చు. అస్త్యవస్త జీవనశైలి వల్ల రక్తంలో పెరిగే కొలెస్ట్రాల్‌ను కూడా వ్యాయామంతో తగ్గించవచ్చు. కాబట్టి రోజు మొత్తంలో కనీసం అరగంటపాటైనా నడక లాంటి సాధారణ వ్యాయామం చేయాలి. వ్యాయామానికి ప్రత్యేక స్థానం కేటాయించాలి. యోగా, కార్డియో, వెయిట్‌ ట్రైనింగ్‌, ఈత, క్రీడలు.. వీటిలో ఇష్టమైన దాన్ని అనుసరించాలి.గుండె జబ్బులకు గురికాకుండా ఉండాలంటే అందుకు కారణమయ్యే అంశాలకు దూరంగా ఉండాలి.

మద్యపానం, ధూమపానాలకు దూరంగా ఉండాలి. ఆహార నియమాలు పాటించాలి. నిద్ర వేళలను కచ్చితంగా అనుసరించాలి. జంక్‌ ఫుడ్‌కు బదులు తాజా కూరగాయలు, ఆకుకూరలు పళ్లు తినాలి.సమతులాహారం తీసుకోవాలి.ప్రతి రోజూ కనీసం అరగంటపాటైనా నడక లాంటి తేలికపాటి వ్యాయామం చేయాలి.శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి.

నేటి రోజుల్లో గుండె సంబంధిత వ్యాధులు చిన్న వయసులలోనే వచ్చేస్తున్నాయి. 30 సంవత్సరాల వయసున్న వారు కూడా గుండె పోట్ల బారిన పడుతున్నారని వైద్యులు చెపుతున్నారు. కాబట్టి చిన్న వయస్సులో నాకేం అవుతుందులే… అని అశ్రద్ధ చూపకండి. జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ … చేడు వ్యసనాలకు దూరంగా ఉంటూ మన గుండెను చక్కగా కాపాడుకుందాం….

Leave a Comment