జలుబు, జ్వరం వంటివి యాంటీ బయాటిక్ మందులతో నయమవుతాయనే అపోహ చాలా మందికి ఉంది. అది ఎంత మాత్రం నిజం కాదు. నిజానికి సాధారణ జలుబు, ఫ్లూ రెండు వైరల్ ఇన్ఫెక్షన్ లే. ఇవి చిన్న చిన్న ఇన్ఫెక్షన్లే అయినే త్వరగా వదిలిపెట్టవు. కాబట్టి వీటికి ట్యాబ్లెట్ల కంటే చిన్న చిన్న చిట్కాల ద్వారా త్వరగా ఉపశమనం కలిగిస్తాయి.
జలుబు, ఫ్లూ రెండు వైరల్ ఇన్ఫెక్షన్ లే. గొంతు నొప్పి, ముక్కు కారటం, దగ్గు, అలసట, వంటివి రెండింటిలోనూ కనిపించే సాధారణ లక్షణాలు. నిజానికి సాధారణ జలుబు, ఫ్లూ జ్వరాలకు పెద్దపెద్ద వైద్యాలూ, చికిత్సలేం అవసరం లేదు. అలాగని మలేరియా, డెంగీ వంటి జ్వరాలను నిర్లక్ష్యం చెయ్యటానికి లేదు. జలుబు అనేది ప్రధానంగా వైరస్ కారణంగా వచ్చే సమస్య. దీనికి రైనో వైరస్ వర్గానికి చెందిన ఎన్నో రకాల వైరస్‌లు కారణం కావచ్చు. పైగా ఈ వైరస్‌లు ఎప్పటికప్పుడు రూపం మార్చుకుంటూ ఉంటాయి. కాబట్టి మన రోగ నిరోధక వ్యవస్థ వీటిని గుర్తుంచుకుని పోరాడటం, వీటికి వ్యతిరేకంగా యాంటీబాడీలు తయారు చేసుకోవటం కష్టం. అందుకే అందరినీ తరచూ జలుబు వేధిస్తూనే ఉంటుంది.
సాధారణంగా జలుబు ఒక వారం పాటు బాధిస్తుంది, తర్వాత చాలా వరకూ దానంతట అదే తగ్గిపోతుంది. కాకపోతే ఉపశమనం కోసం ఆవిరి పట్టటం ముఖ్యం. దీనివల్ల తెమడ పల్చబడి తేలికగా బయటకు వచ్చేస్తుంది. అలాగే తరచుగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు తప్పనిసరిగా నోటికి చేతి రుమాలు లేదా టిష్యూ పేపర్ అడ్డం పెట్టుకోవాలి.
గోరు వెచ్చని నీళ్లలో ఉప్పు కలిపి పుక్కిలించి ఉమ్మివేయడం ద్వారా జలుబు, ఫ్లూ సమయాల్లో ఉపశమనంగా ఉంటుంది. ఇది శ్లేష్మ స్థరాన్ని శుభ్రపరిచే దిశగా పనిచేస్తుంది. నెమ్మదిగా గొంతునొప్పి, ముక్కు దిబ్బడ తగ్గించడం లో కీలకపాత్ర పోషిస్తుంది. జలుబును తగ్గించుకోటానికి నీటిని తాగటం అనేది చాలా సులువైన పద్దతి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. గోరువెచ్చగా ఉండే నీరు గొంతు భాగంలో కలిగే ఇన్‌ఫక్షన్‌ను తగ్గిస్తుంది. వేడిగా ఉండే జావ, సూప్‌లు లాంటి ద్రవ పదార్థాలు తాగాలి.
రోజు మొత్తం వేడిగా ఉండే పానియాలు తరచుగా తాగటం వలన జలుబు నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. వెల్లుల్లి, అల్లం.. ఇవన్నీ కూడా ముక్కు దిబ్బడను తగ్గించడంతో పాటు, జలుబు చేసిన సమయంలో రిలీఫ్‌గా ఉండేందుకు తోడ్పడతాయి. రోజుకు రెండు సార్లు విక్స్ లేదా పసుపు వేసుకొని ఆవిరి పడితే జలుబు త్వరగా తగ్గడంతో పాటు గొప్ప రిలీఫ్ వస్తుంది.
జలుబు మరియు ఫ్లూ ల నుండి ఉపశమనం పొందడానికి ఎంత ప్రయత్నించినా, విశ్రాంతి లేనిదే ఫలితం ఉండదు. రోజులో ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. డీప్ బ్రీదింగ్ ఎక్సర్‌సైజ్‌ల వల్ల కూడా కఫం బయటకు వచ్చేస్తుంది. యోగాలో ప్రాణాయామం మేలు చేస్తుంది. ఫ్లూ జ్వరంలో గొంతు నొప్పి ఉంటే ఉండొచ్చు. జ్వరం మాత్రం 101 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుంది. ఒళ్లు నొప్పులు విపరీతంగా బాధిస్తాయి.చాలామందిలో ఈ లక్షణాలు రెండు మూడు రోజులు బాధించి, అవే తగ్గిపోతాయి. కాబట్టి మొదటి 2 రోజులూ పెద్ద చికిత్సలేం అక్కర్లేదు. ప్యారాసెటమాల్ వంటివి తీసుకుంటే సరిపోతుంది. అయితే మూడు రోజుల తర్వాత కూడా బాధలు తగ్గకుండా వేధిస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
వీటికి ప్రత్యేకించి చికిత్స అవసరం లేదు. ఈ రెండూ చాలావరకూ వాటంతట అవే తగ్గిపోయేవే అయినా కొద్దిమందిలో ఫ్లూ సమస్యాత్మకంగా మారొచ్చు. అందుకని తేడా తెలుసుకుని, అవసరాన్ని బట్టి వైద్యులను సంప్రదించటం అవసరం.