ఉద్యోగ జీవితంలో ఎక్కువగా కూర్చోవడం.. శరీరానికి శ్రమ కలిగించకుండా.. మెదడు మాత్రమే శ్రమ కలిగించడం.. సరైన సమయానికి తినకపోవడం.. మంచి ఆహారాన్ని తీసుకోకపోడం ఇలా ఏదో ఒక రకంగా బరువు పెరుగడానికి కారణామవుతుంటాయి. చాలా మంది బరువు తగ్గడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఆహారం మానేయడం, ట్యాబ్లెట్స్ వాడడం లేదా ట్రీట్ మెంట్స్ తీసుకోవడం వంటివి చేస్తుంటారు. బరువు తగ్గాలి అంటే తక్కువగా తినాలి అనుకుంటుంటారు. నిజానికి ఇవేవి కాదు … సరైన ఆహారం ద్వారా బరువు తగ్గించుకోవచ్చు.
ఆరోగ్యకరమైన బరువు అనారోగ్య సమస్యల నుంచి వచ్చే ప్రమాదాన్ని బాగా తగ్గిస్తుంది. అధిక బరువు కలిగిన వారు తగ్గాలంటే డైటింగ్ చేయడం కంటే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కలిగి ఉండడం మంచి ప్రయోజనాలు ఇస్తుంది. అందుకే ఎక్కువ తక్కువలు కాకుండా, సరైన స్థాయిలో ఆహారాన్ని తీసుకోవడం వల్ల సరైన బరువును సంపాదించుకోగలుగుతారు. బరువు ఎక్కువ ఉన్నారని కడుపు కాల్చుకోవడం మంచి పద్ధతికాదు. తక్కువ తిన్నా, లేదా ఎక్కువ తిన్నా రెండూ ప్రమాదాలు కొని తెస్తాయి. కొంత మంది తక్కువ తిన్నా లావు అవుతుంటారు. మరి కొందరు ఎంత తిన్నా సన్నగానే ఉంటారు. దీనికి కారణం వారికి అందే పోషకాలు అనే చెప్పుకోవాలి.
ప్రమాదకరమైన కొవ్వులతో పాటు, ఆహారంలో అవసరమైన కొవ్వులు కూడా ఉంటాయి. మంచి చేసే కొవ్వుల వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. అలాగే అనవసరమైన కొవ్వు శరీరంలో పేరుకు పోయి, స్థూలకాయంతో పాటు ఇతర రోగాలను తీసుకొస్తుంది. ఏ ఆహారం తీసుకున్నా ఎలా తీసుకోవాలన్న విషయాన్ని తెలుసుకున్నప్పుడే ఆహారం శరీరానికి మేలు చేస్తుంది. ఒక్కోసారి ఆరోగ్యకరమైన ఆహారం అయినప్పటికీ సరైన విధానంలో తీసుకోకపోవడం వల్ల అనారోగ్యాలకు కారణం అవుతుంది. చక్కని పోషకాహారంతో పాటు వ్యాయామం లాంటి ఆరోగ్యకరమైన అలవాట్లు మేలు చేస్తాయి.
సరైన ఆహారాన్ని ఎంపిక చేయడానికి అనేక కారణాలను లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది. రుచి, శుచితో బాటు పౌష్టికాహార విలువలు ఇలా ఎన్నో అంశాలు ఆహారంతో ముడిపడి ఉంటాయి. ఒక్కోవ్యక్తికి ఒక్కో రకంగా పౌష్టికాహారం అవసరమౌతుంది. ఏదైనా సరే ఆహారాన్ని మరీ ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా తీసుకోవాలి. ప్రతిరోజూ ఒకే నిర్ణీత సమయానికి భోజనం చేయాలి. ఇలా చేస్తే మన శరీరంలో జీవక్రీయలన్ని సక్రమంగా జరుగుతాయి. ఆహారంలో ఎక్కువగా సలాడ్స్ ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల ఏదైనా జీర్ణంకాని పదార్థాలు మీ జీర్ణవ్యవస్థను ఇబ్బంది పెడుతుంటే ఈ సలాడ్స్ ఎంతో ఉపయోగకరంగా పనిచేస్తాయి.
మనం నిత్యం తీసుకునే ఆహారం, విటమిన్లు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేడ్లు.. ఇలా అన్నీ సమపాళ్లలో ఉండాలి. తీసుకునే ఆహారం ఎప్పుడూ ఒకే రకంగా ఉండకూడదు. కాలానుగుణంగా వచ్చే పండ్లూ, కూరగాయలు ఎంచుకోవాలి. అలాగే వెన్న తీసిన పాలూ, పాల పదార్థాలూ.. చిరుధాన్యాలు తీసుకోవాలి. అప్పుడే శరీరానికి అవసరమైన పోషకాలన్నీ అందుతాయి. ప్యాక్ చేసిన బయటి ఆహారాన్ని కొంటున్నప్పుడు తప్పనిసరిగా వెనక భాగంలో ఉండే వివరాలను చదవాలి. దానిలో ఉండే కెలోరీలు, కొవ్వు, ఉప్పు శాతం ఎంతున్నాయో చూసుకోవడం మంచిది.
ఆరోగ్యకరమైన జీవనశైలి బరువును అదుపులో ఉంచుకోవడానికి సాయపడుతుంది. సరిపడిన స్థాయిలో ప్రొటీన్లు, విటమిన్లు తీసుకోవడం, ఆహారం ఫైబర్ ఉండేలా చూసుకోవడం అవసరం. శరీర తత్త్వాన్ని బట్టి అవసరమైన పోషణ అందే విధంగా ఆహారాన్ని తీసుకోవలసి ఉంటుంది. కొంత మంది బరువు తగ్గడానికి భోజనంలో కార్బోహైడ్రేట్లు పూర్తిగా మానేద్దామనుకుంటారు. కానీ, డైటింగ్ చేసే కాలంలో కూడా శరీరానికి కార్బోహైడ్రేట్లు తప్పనిసరి అవసరమవుతాయి. నిజానికి కార్బొహైడ్రేట్లు చాలా తొందరగా కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. దీనివల్ల మనకు తెలియకుండానే బరువు తగ్గే అవకాశం ఉంది. కాకపోతే కార్బోహైడ్రేట్లను ఎంత మోతాదులో తీసుకుంటున్నామన్నదే ఇక్కడ ముఖ్యమవుతుంది.
కొవ్వు తక్కువగా ఉండే ఆహారంలో కేలరీలు తక్కువగా ఉంటాయనే ఆలోచన కేవలం అపోహ మాత్రమే. అందుకే బరువు తగ్గాలనుకునే వారు, వారు తీసుకునే ఆహారంలో కేలరీల స్థాయిని ఎప్పటికప్పుడు సరి చూసుకుంటూ ఉండాలి. బరువు పెరగడానికి కొవ్వు మాత్రమే కారణం అనే అపోహలో ఉంటాము. కానీ కొన్ని కండరాలు కొవ్వు పెరగేందుకు తోడ్పడతాయి. ఇలాంటి వాటి విషయంలో జీవక్రియ రేటుకు, బరువుకు సంబంధం ఉండదు. అలాగే ఫలానా ఆహారం వల్ల మాత్రమే బరువు తగ్గుతారనే నియమం లేదు. ఎందుకంటే వారి వారి శరీర తత్త్వాన్ని బట్టి కొన్ని రకాల ఆహారాలు కొందరి బరువును పెంచితే, మరికొందరి బరువును తగ్గిస్తాయి.శరీర బరువు తగ్గాలని డైటింగ్ చేసే వాళ్లు ముంచినీళ్ల తాగే విషయంలో కూడా తప్పనిసరిగా జాగ్రతలు పాటించాలి. బాగా నీళ్లు తాగాలి. డీహైడ్రేషన్ శరీరానికి మచిది కాదు. అందులోనూ డైట్ పాటించేటప్పుడు తప్పనిసరిగా నీళ్లు తాగాలి.
బరువు తగ్గాలనుకునే వారు మంచి కొవ్వులు, ప్రొటీన్లు మరియు పిండి పదార్థాల వంటి ఆహారం తీసుకోవడం ఉత్తమం. శరీరంలో కేలరీలు తగ్గకుండా చూసుకోవడం వలన బరువు పెరగకుండా ఉంటారు. అలాగే ఆకలిగా ఉన్నప్పుడు తినకుండా ఉండడం, సరైన సమయానికి తినకపోవడం వలన శరీరంలో కొవ్వు పెరిగి… బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే రోజు వ్యాయమం చేయడం వలన శారీరకంగా చురుకుగా ఉంటారు. మెదడుపై ఒత్తడిని తగ్గించడం, అలాగే సరిగ్గా నిద్రపోవడం వలన బరువు తగ్గుతారు.