Fasting| Weight Loss: బరువు తగ్గడం కోసం ఉపవాసం చేస్తున్నారా?

By manavaradhi.com

Published on:

Follow Us
Weight Loss

అధిక బరువు తగ్గడానికి ప్రతీ ఒక్కరూ ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఏవేవో ప్రయత్నిస్తుంటారు. కొన్ని రోజులు చేయగానే అనుకున్న ఫలితాలు రాకపోవడంతో వాటిని వదిలేస్తుంటారు. కానీ, కొన్ని చిట్కాలు పాటించడం వల్ల ఈజీగానే బరువు తగ్గుతారు. ముఖ్యంగా ఉపవాసం చేయడం వల్ల కూడా ఈజీగా బరువు తగ్గుతారు.

ఉపవాసాన్ని వైద్య పరిభాషలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గా చెబుతారు. ఒక క్రమం ప్రకారం ఉపవాసం చేయడం వల్ల గొప్ప ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో కీలకమైనది బరువు తగ్గడం. ఉవాసం చెయ్యడం వల్ల బరువు తగ్గడం మాత్రమే కాదు, ఒంట్లో గ్లూకోజు నిరోధకత తగ్గి, మధుమేహం బారిన పడే అవకాశాలు తగ్గుతున్నాయి. కొంత సమయం ఉపవాసం చేయడం వల్ల అప్పటికే శరీరంలో దాచుకున్న కొవ్వును కరిగించుకోవడం మొదలు పెడుతుంది. దీని వల్ల శరీరంలో వ్యాధుల ముప్పు తగ్గడానికి ఆస్కారం ఉందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. బరువు తగ్గించుకునేందుకు మాత్రం ఉపవాసం ఉండటం సరైన పద్దతి కాకపోవచ్చు. బరువు తగ్గేందుకు భోజనం తగ్గించే ముందు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని డైటీషియన్లు కోరుతున్నారు.

ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఒక రకమైన కాల నియంత్రిత డైట్. ఈ రకమైన ఉపవాసం చేసేవారు ఒక రోజులో చివరి భోజనానికి, మరుసటి రోజు తొలి భోజనానికి మధ్య ఎక్కువ విరామం ఇస్తారు. మిగిలిన భోజనాలను, తక్కువ కాల వ్యవధిలో తీసుకుంటారు. సాధారణంగా ఉపవాసం ఉండేవారు 16 గంటల పాటు ఏమీ తినకుండా ఉంటారు. మిగతా 8 గంటల వ్యవధిలో భోజనం చేస్తారు.కాల నియంత్రిత డైట్‌లో ఫాస్టింగ్‌తో పాటు 5:2 డైట్ కూడా ఉంటుంది. ఈ విధానంలో భోజనాల మధ్య విరామ సమయం కంటే కూడా తీసుకునే ఆహారంపై దృష్టి సారిస్తారు. 5:2 డైట్ విధానంలో డైటింగ్ చేసేవారు వారంలో ఐదు రోజులు సాధారణ పరిమాణంలోనే ఆహారాన్ని తీసుకుంటారు. మిగిలిన రెండు రోజుల్లో, రోజూ తీసుకునే క్యాలరీల్లో కేవలం 25 శాతం మాత్రమే తీసుకుంటారు.

ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్ లో 5:2 ఫాస్టింగ్ మెథడ్ చాలా పాపులర్. దీనర్థం 2 రోజులపాటు కెలరీలపై ఆంక్షలు విధించుకుని, మిగతా 5 రోజులు షరామామూలుగా మీరు ఆహారాన్ని లాగించవచ్చు. వారంలో ఏ 2 రోజులు మీరు ఇలా ఉండాలనుకుంటారో అది మీ ఇష్టం. కానీ బాగా గుర్తుంచుకోండి, 2 రోజులు వరుసగా మాత్రం మీరు ఉపవాసం ఉండకండి. ఉపవాసం ఎలా చేయాలి, ఎంత వరకూ చేయాలి, ఏ విధంగా చేయాలనే అంశాలను దృష్టిలో ఉంచుకోవడం చాలా అవసరం. కొవ్వుతో కూడిన ఆహార పదార్థాలను మానేసి, ఎక్కువగా ఫైబర్ ఉండే ఆహారాన్నీ తీసుకోవడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. రోజూ ఉపవాసం ఉండడం కూడా మంచిది కాదు. వారానికి రెండు మాత్రం కచ్చితంగా ఉపవాసం చేయడం ద్వారా బరువు తగ్గడానికి నూరు పాళ్ళు ఆస్కారం ఉంది.

ఒక్క పూట ఉపవాసం ఉండి, మిగిలిన వారమంతా ఇష్టం వచ్చినట్లుగా కొవ్వుతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల ఏ మాత్రం ప్రయోజనం ఉండదు. ఉపవాసం ద్వారా బరువు తగ్గాలని భావించే వారు, మిగిలిన రోజుల్లో నూనెతో కూడిన ఆహారానికి దూరంగా ఉండాలి. అదే విధంగా మసాలాలు, కారంగా ఉండే ఆహారాన్ని తగ్గించుకోవాలి. ఒకే సారి ఎక్కువ ఆహారాన్ని కాకుండా, కొంచెం కొంచెంగా ఆహారాన్ని తీసుకోవడం వల్ల కూడా ప్రయోజనాలు ఉంటాయి. మొత్తంగా వారంలో 5 రోజు సాధారణ ఆహారం తీసుకుంటూ, కనీసం రెండు రోజుల పాటు ఉపవాసాన్ని పాటించడం వల్ల బరువు తగ్గవచ్చు.

ఎక్కువ ఉపవాసం చేయడం వల్ల ఎక్కువ బరువు తగ్గుతారనేది కేవలం అపోహ మాత్రమే. శరీరానికి సరైన పోషకాహారాన్ని అందిస్తూ, కొవ్వు పెరుగుదలకు కారణమైన ఆహారాన్ని తగ్గిస్తూ చేసే ఉపవాసమే మంచి ప్రయోజనాలను అందిస్తుంది. ఉపవాసం ప్రారంభించిన వెంటనే ఒకేసారి పూర్తిగా మానేయడం కూడా మంచిది కాదు. కొద్ది గంటల పాట మానేస్తూ శరీరానికి క్రమంగా ఉపవాసాన్ని అలవాటు చేయాలి. ఉపవాసం తర్వాత తీసుకునే ఆహారం కూడా తేలిగ్గా ఉండాలి. ముఖ్యంగా కూరగాయలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి. ఉపవాసం తర్వాత ఎక్కువ ఆహారం తీసుకోవడం కూడా మంచిది కాదు.

పని ఎక్కువగా ఉన్న రోజుల్లో ఉపవాసం ఉండేలా చూసుకోవాలి. ఉపవాసం రోజున తేలికపాటి, ఉల్లాసభరితమైన పనులు చేయడం సులభంగా ఉంటుంది. ఉపవాసం సమయంలో నీరు, ద్రవాహారం మాత్రం అధికంగా తీసుకోవాలి. ఒంట్లో నీరు తగ్గకూడదు. సోడా పానీయాలు, టీ, కాఫీలకు దూరంగా ఉండాలి. అయితే చిన్న పిల్లలు, అరవై ఏళ్ళు పైబడిన వృద్ధులు, గర్భిణులు, పాలిస్తున్న తల్లులు, మధుమేహం ఉన్న వారు ఉపవాసం చేయకూడదు. ఇలాంటి వారు ముందుగా వైద్యుల సలహా తీసుకుని మాత్రమే ఉపవాసం చేయాలి. బరువు తగ్గేందుకు ఉపవాసం మంచిదే అని వైద్యులు నిర్ణయించిన తర్వాతే ఉపవాసానికి ఉపక్రమించడం మేలు చేస్తుంది. అయితే తిండి మానేయడం మాత్రమే బరువు తగ్గే మాత్రం కాదని వైద్యులు గట్టిగా చెబుతున్నారు.

బరువు తగ్గడానికి ఉపవాసాలు మంచిదని కొంతమంది అపోహ పడుతూ ఉంటారు. తిండి తగ్గించి చేసే ఉపవాసాలు శరీరం బరువు తగ్గేందుకు కొంత సహకరిస్తాయి . ఉపవాసం పూర్తి కాగానే ఆవురావురుమంటూ తినడం వల్ల బరువు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అధిక కొవ్వు, ప్రొటీన్లు లేని ఆహారం రెండు పూటలా తినవచ్చు. దీనికి తోడుగా క్రమం తప్పకుండా శరీర వ్యాయామం చేయడం వలన శరీరం బరువు తగ్గుతుంది.

Leave a Comment