కొన్నిసార్లు మనం ఆకలిగా ఉందని మన బొజ్జలోకి నానా చెత్త లాంటి ఆహారాన్ని పంపిస్తుంటాం. దీంతో రకరకాల అనారోగ్య సమస్యలు మనపై దాడిచేయడానికి సిద్ధంగా ఉంటాయి. 30 ఏళ్ళ వయసులోనే 60 ఏళ్ల వయసులో రావాల్సిన రోగాలు చుట్టుముడతాయి. అందువల్ల దొరికిందల్లా తినకుండా కడుపు ఆరోగ్యం కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
కణాలతో నిర్మితమైన మన శరీరంలో కేవలం ..కణజాలమే కాదు.. చాలా రకాల బ్యాక్టీరియాలు కూడా ఉంటాయి.. ఐతే ఈ బ్యాక్టీరియాలు చాలా వరకు శరీరానికి మేలే చేస్తాయి. శారీరక, మానసిక ఆరోగ్యానికి ఇవి దోహదపడతాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ బ్యాక్టీరియాలు ఎక్కువ శాతం మన పొట్టలోనే దాగి ఉంటాయి. జీర్ణవ్యవస్థలో చాలా బాగా ఉపయోగపడతాయి. అంతేకాదు.. శరీరంలో ఉండే చెడు సూక్ష్మ క్రిములతోనూ ఇవి పోరాడతాయి. చెడు, మంచి బ్యాక్టీరియాలు పొట్టలో సమంగా ఉంటే దాన్ని ఈక్వలిబ్రియమ్ అని పిలుస్తారు. ఐతే కడుపులో మంచి బ్యాక్టీరియా తగ్గిపోయి.. చెడు బ్యాక్టీరియా పెరిగిన పక్షంలో మనకు క్రాన్స్, అల్సర్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
కడుపులో ఉండే చెడు బ్యాక్టీరియా … కారణంగా గుండె సమస్యలు రావచ్చు. కోడి గుడ్లు, మాంసాహరం తీసుకున్నప్పుడు కడుపులో ఉండే బ్యాక్టీరియా కొన్ని రకాల రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. ఇవి కాలేయం ఉత్పత్తి చేసే రసాయనంతో కలిసిపోయి.. ట్రైమిథైలమిన్ ఎన్ ఆక్సైడ్..TMAOగా ఏర్పడతాయి. ఈ TMAO.. రక్తకణాల్లో కొలస్ట్రాల్ పెరిగే విధంగా పని చేస్తుంది. దీనివల్ల శరీరంలో కొలస్ట్రాల్ స్థాయి పెరిగిపోయి.. గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. TMAO.. శరీరంలో అధికమైతే కిడ్నీ వ్యాధులు కూడా రావచ్చు.
కడుపులో బ్యాక్టీరియా మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం చూపిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. కంటి చూపు, ధ్వని శ్రవణం, రుచి తెలుసుకోవడం, వాసన చూడడం వంటి వాటిపై ప్రభావం ఉంటుందంటున్నారు. కొన్నిమార్లు బ్యాక్టీరియాలో తేడాల వల్ల ఆటిజమ్, ఆందోళన, ఒత్తిడి కలిగే అవకాశం ఉందని చెబుతున్నారు. పొట్టలో బ్యాక్టీరియా అసమానతలు. . స్థూలకాయానికి కారణం కావచ్చు.
కడుపులోఉండే బ్యాక్టీరియా మెదడుకు సరిగ్గా సంకేతాలు పంపని పక్షంలో ఎక్కువ తినవచ్చు లేదా తక్కువగా తినే అవకాశం ఉంటుంది. దీని వల్ల స్థూలకాయం వస్తుందంటున్నారు పరిశోధకులు. గట్ బ్యాక్టీరియాకు.. పిట్యూటరీ గ్రంధికి సంబంధం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఆకలిని పెంచే హార్మోన్లను ఎక్కువగా ఉత్పత్తి చేయడం వల్ల ఎక్కువ తినాలన్న ఫీలింగ్ కలుగుతుంది.
కడుపులో మంచి బ్యాక్టీరియా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలం. శరీరంలో మంచి బ్యాక్టీరియా.. మనం పుట్టిన సమయంలోనే తల్లి నుంచి సంక్రమిస్తుంది . పెరుగుతున్న సమయంలో మనం తీసుకునే ఆహారం, ఇతర అలవాట్ల నుంచి దాని ప్రభావం పెరుగుతుంది. మనం తీసుకునే ఆహారాలు కొన్ని ప్రొబయాటిక్స్ గా పని చేస్తాయి. ఈ ప్రో బయాటిక్స్ మనకు ఎక్కువగా పాలు, పాలపదార్థాల నుంచి లభిస్తాయి. ఇవి కడుపులోని మంచి బ్యాక్టీరియాను మరింత పెంచి.. సమతుల్యతను కాపాడతాయి. ప్రొ బయాటిక్స్ కారణంగా రోగ నిరోధక వ్యవస్థ మరింత బలపడుతుంది. ఇది ప్రేవుల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ప్రొబయాటిక్స్ చైతన్యవంతంగా లేని బ్యాక్టీరియాను నాశనం చేసి మంచి బ్యాక్టీరియాకు ఊతమిస్తాయి.