Hindu temple in Pakistan – ఇప్పటికీ పాకిస్థాన్ లో అద్భుతమైన శివాలయం ఉంది

By manavaradhi.com

Updated on:

Follow Us

ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం |
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్ ||

మన దాయాది దేశం పాక్‌లో ఓ శివ క్షేత్రం ఉంది అంటే మీరు నమ్ముతారా… నమ్మక తప్పదు.. అంతే కాదు ఈ ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. పాకిస్థాన్‌లోని సింధ్‌ రాష్ట్రం ఉమర్‌కోట్‌లో హర హర మహాదేవ శంభో శంకర.. అంటూ ఆలయ ప్రాంతమంతా శివ నామస్మరణలో మార్మోగిపోతుంది. దేశవిభజనకు ముందు అవిభక్త భారత్‌లోని సింధ్‌రాష్ట్రంతో పాటు ప్రస్తుతం పాక్‌గా పేర్కొంటున్న ప్రాంతంలో లక్షలాదిమంది హిందువులు ఉండేవారు. దేశ విభజన అనంతరం మెజార్టీ హిందువులు భారత్‌కు వచ్చేశారు. అయితే కొందరు మాత్రం అక్కడే ఉంటూ పాక్‌ సమాజంలో భాగమయ్యారు. ఇప్పటికీ పాక్‌లో వేలాది హిందూ దేవాలయాలు, గురుద్వారాలు ఉన్నాయి. ఉమర్‌కోట్‌‌ సిటీలో దాదాపు 80 శాతం మంది హిందువులు ఉన్నారు.అందుకే ఈ ఆలయం నిత్యం భక్తులతో అలరారుతూ ఉంటుంది.

పాకిస్థాన్‌లో కొన్ని మాత్రమే భక్తులతో అలరారుతుండగా వేలాది కట్టడాలు కనీస సంరక్షణ లేక శిథిలావస్థకు చేరుకున్నాయి. సింధ్‌లోని ఉమర్‌కోట్‌గా పిలిచే ఈ ప్రాంతాన్ని మొదట్లో అమర్‌కోట్‌ అనేవారు. ముస్లిం పాలకుల కాలంలో ఉమర్‌కోట్‌గా మారింది. మొగల్‌పాలకుడు అక్బర్‌ అమర్‌కోట్‌లోనే జన్మించాడు. ఈ ఆలయ క్షేత్ర పురాణాల ప్రకారం ఇక్కడ పెద్ద పెద్ద పచ్చిక మైదానాలు ఉండేవి. కొందరు పశువుల కాపరులు తమ పశువులను ఇక్కడకు మేతకు తీసుకువచ్చేవారు. కొన్ని ఆవులు ఒక ప్రాంతానికి వెళ్లి పాలిస్తుండేవి. దీంతో ఒక ఆసక్తితో ఆవుల కాపరి ఒకరు అక్కడకు వెళ్లి పరిశీలించగా అది శివలింగమని తేలింది. దీంతో స్థానికులకు తెలపగా వారు పూజలు ప్రారంభించారు. ఇక్కడ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. శివలింగం ఇప్పటికీ పెరుగుతుండటం విశేషం. మహాశివరాత్రి పర్వదినాన ఈ క్షేత్రానికి లక్షలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. శంభో శంకర నామస్మరణతో ప్రతిధ్వనిస్తుంది.

1947 కి పూర్వం పాకిస్తాన్ భారత దేశంలోనే కలిసి ఉన్నప్పుడు ఇక్కడ హిందువులు పూజలు నిర్వహిస్తుండెడివారు. అక్కడ వేదకాలం నుండి హిందూమతం విలసిల్లుతోంది. ప్రస్తుతం పాకిస్తాన్ జనాభాలో హిందువుల సంఖ్య 1.3% మాత్రమే ఉన్నా ఇక్కడ హైందవ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబించించే దేవాలయాలు అనేకం ఉన్నాయి. శివహర్కరే, కరివిపుర్ 51 శక్తిపీఠాలలో ఒకటి. మహిషాసురమర్ధిని ఈ దేవాలయంలోని దేవత. ఈ శక్తిస్థలంలో పడిన సతీదేవి శరీరఖండాలు ఆమె కన్నులు. శివుడు ఈ పుణ్యక్షేత్రంలో క్రోధీశుడిగా వెలిశాడు. ఈ దేవాలయం కరాచీ నగరానికి సమీపంలో పర్కాయి రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఉంది. ఏప్రిల్ నెలలో నాలుగురోజులపాటు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి.

Leave a Comment