దుమ్ము, ధూళి ఏది తగిలినా అలర్జీ రావడం మనం చాలా మందిలో చూస్తుంటాం. అదేపనిగా తుమ్ములతో అదరగొడ్తుంటారు. ఇలా పొద్దస్తమానం మనల్ని ఇబ్బంది పెట్టే అలర్జీలను ఎలా అదుపులో పెట్టుకోవాలి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అలర్జీల నుంచి ఉపశమనం పొందవచ్చు..?
శరీరం యొక్క వ్యాధినిరోధక వ్యవస్థలోతలెత్తే అసందర్భ ప్రతిచర్యను అలర్జీగా పేర్కొంటారు. గాలి, నీరు, ఆహారం ద్వారా ప్రవేశించే క్రిములతో శరీరంలోని తెల్లకణాలు పోరాడి వాటి బారి నుంచి మనల్ని రక్షించి ఆరోగ్యంగా ఉంచుతాయి. అలర్జీని కలిగించే పదార్థం శరీరంలో ప్రవేశించి వాటి తెగకు చెందిన యాంటి బాడీస్‌తో కలిసి విడుదల చేసే హిస్టమైన్ అనే పదార్థం.. రక్తం గానీ ఇతర భాగాలపై గానీ ప్రతిక్రియ జరిపి దురద, వాపు, పుండ్లు పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పుప్పొడి రేణువులు, దుమ్ము, ధూళి, కొన్ని రకాల ఆహారాలు, కొన్ని మందులు, రబ్బర్, ఇతర సరిపడని పదార్థాలు తాకడం, జంతువుల స్పర్శ, వాతావరణంలో మార్పుల వల్ల ఈ ప్రతిక్రియను చూపిస్తుంది. వరుసబెట్టి తుమ్మడం, ముక్కులో నుంచి నీరు కారడం, కళ్లు ఎరుపెక్కి మండటం, దురద, దద్దుర్లు ఏర్పడటం, గొంతు గరగరమనేలా ఉండటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, పిల్లికూతల వంటి శబ్దాలు రావడం.. ఇలా ఎన్నో రకాల ఇబ్బందులకు కారణంగా అలర్జీలను పేర్కొనవచ్చు.
అలర్జీలు ముఖ్యంగా .. శ్వాసకోశ అలర్జీ, స్కిన్ అలర్జీ, జీర్ణకోశ అలర్జీలుగా ఉంటాయి. జన్యుపరమైన కారకాల ద్వారా వివరించలేని అలెర్జీ సమస్యలు ఇటీవలికాలంలో ఎక్కువవుతున్నాయి. అలర్జీలను అదుపులో పెట్టుకొనందుకు మన ఇండ్లలోనే రకరకాల వస్తువులు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా పుప్పొడి ఇంట్లోకి రాకుండా కిటికీలు మూసిఉంచాలి. పుప్పొడి ఉండే మొక్కల్ని చేతులతో తాకకుండా చూసుకోవాలి. కొన్ని రకాల మొక్కలను ఇంట్లో పెంచుకోవడం ద్వారా ఎలర్జీలను ఎదుర్కొవచ్చు. బయటకు వెళ్లిన ప్రతిసారి చేతులు, కాళ్లను శుభ్రం చేసుకోవాలి. వీలైతే స్నానం చేయడం అలవాటుచేసుకోవాలి. అలర్జీ వ్యాపించే అవకాశాలు ఉన్నప్పుడు బయటకు వెళ్లే సమయాల్లో ముఖానికి మాస్క్ ధరించాలి. అలర్జీకి గురైన సందర్భాల్లో ముఖ్యంగా పిల్లలకు తాజా పండ్లు, నట్స్ ఎక్కువగా తినిపించాలి. ముఖ్యంగా ఆరెంజ్, గ్రేప్స్, యాపిల్స్, టమాటలు తినిపించాలి.
అలర్జీని కలుగజేసే పరిసరాలకు దూరంగా ఉండాలి. శరీరానికి పడని పదార్థాలు తీసుకోవద్దు. చల్లటి పదార్థాలు తీసుకోవద్దు. ముక్కు రంధ్రాలను నీటితో శుభ్రం చేసుకొని శ్లేష్మం లేకుండా చూసుకోవాలి. ఇలా శుభ్రపరుచుకోవడం వల్ల ముక్కులోని మ్యూకస్ పొరల్లో నిలిచిఉండే సూక్ష్మక్రిములను బయటకు పంపవచ్చు. అలర్జీతో బాధపడుతున్నవారు మంచినీరుగానీ, పండ్ల రసాలుగానీ, నాన్ ఆల్కహాలిక్ ద్రవాలుగానీ ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది. టీ, ఉడకబెట్టిన పులుసు, సూప్ వంటి వెచ్చటి ద్రవాలు అదనపు ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఇంటిని దుమ్ము, ధూళి లేకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చికాకు కలిగించే కఠినమైన కెమికల్స్ వాడకుండా చూసుకోవాలి. వెనిగర్, బేకింగ్ సోడా వంటి సహజ క్లీనర్లు వాడాలి. వేడి నీటిని ఆవిరిపట్టడం ద్వారా అలర్జీల నుంచి ఉపశమనం పొందవచ్చు. సిగరెట్ పొగ తాగడం మానుకోవాలి. అలర్జీకి గురైన సందర్భాల్లో అల్లం, వెల్లుల్లిని ఆహారంలో ఎక్కువగా తీసుకునేలా చూసుకోవాలి.
ముక్కులో సూక్ష్మక్రిములు చేరి విసిగిస్తుంటే ఆక్యుపంక్చర్ వైద్యవిధానంలో మంచి ఫలితం ఉంటుందని వైద్యనిపుణులు సెలవిస్తున్నారు. వేటి కారణంగా అలర్జీ వస్తుందో తెల్సుకొని మసలుకోవాలి. పడని పదార్థాలను దూరంగా పెట్టాలి.