Health tips : హార్ట్ ఎటాక్ సంకేతాలను గుర్తించి జాగ్రత్తపడండి

By manavaradhi.com

Published on:

Follow Us
Heart Attacks and Young People

శరీరంలో గుండె ప్రాధాన్యత గురించి ఎవరూ ఎవరికీ చెప్పనక్కర్లేదు. అది ఎంత ముఖ్యమో మనందరికీ తెలిసిందే. మారిన జీవన శైలితో గుండె జబ్బుల ముప్పు పెరుగుతోంది. చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్ బారిన పడుతున్న కేసుల సంఖ్య కూడా అధికమవుతోంది. ప్రాణాలు కోల్పోతున్న వారు కూడా ఎందరో. ఇది గుండెపోటు సంకేతమే అని గుర్తించి నిమిషాల వ్యవధిలో ఆస్పత్రికి వెళ్లగలిగితే నిండు ప్రాణాన్ని నిక్షేపంగా కాపాడుకునేందుకు ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది. అందుకే గుండెపోటు లక్షణాలన్నవి తెలుసుకుని, ఆ విధమైన అవగాహనతో ఉండడం ఎంతో అవసరం.

హార్ట్ ఎటాక్ అన్నది వైద్యపరంగా అత్యవసర పరిస్థితి. రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండెకు రక్త సరఫరా నిలిచిపోయి హార్ట్ ఎటాక్ వస్తుంది. లేదా రక్తనాళాలు కుచించుకుపోయి గుండెకు రక్త సరఫరా తగినంత అందకపోయినా గానీ హార్ట్ ఎటాక్ వస్తుంది. రక్త సరఫరా నిలిచిపోవడంతో శరీరంలోని కణాలకు ఆక్సిజన్ అందదు. దీంతో ప్రాణాంతకం అవుతుంది. ప్రతి 33 సెకన్లకు ఒకరు హార్ట్ ఎటాక్ కారణంగా మన దేశంలో ప్రాణాలు కోల్పోతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.

చేయి, భుజం నొప్పి అనేది ..హార్ట్ ఎటాక్ సమయంలో ముందుగా కనిపించే లక్షణాల్లో ఇదీ ఒకటి. నొప్పి ప్రథమంగా చాతీలో మొదలై అక్కడి నుంచి ఎడమవైపు చేతిలోకి, భుజంలోకి విస్తరిస్తుంది. చాతీ భాగంలో గట్టిగా పట్టేసినట్టు ఉంటుంది. ఎక్కువ మందిలో కనిపించే ప్రథమ లక్షణం ఇది. గుండెకు సంబంధించి ఆర్టరీ పూడుకుపోయినా, హార్ట్ ఎటాక్ లోనూ చాతిలో నొప్పి, పట్టేసినట్టు, ఒత్తిడి అనిపిస్తుంది. ఒక్కొక్కరికీ ఒక్కోరకమైన అనుభవం కనిపించొచ్చు. కొందరికి గుండెపై బరువు పెట్టిన్నట్టు ఉంటుంది. కొందరిలో నొక్కినట్టు, చాతిలో అసౌకర్యంగానూ ఉండొచ్చు. ఇదేదో ఒకటి రెండు నిమిషాలు ఉండిపోయేది కాదు… అలా చాలా సేపు ఉంటుంది. ఏదైనా పనిచేస్తున్న సమయంలో, నిద్రలోనూ ఈ పరిస్థితి ఏర్పడవచ్చు. వైద్య పరంగా చాతీ నొప్పిని యాంజినాగా పేర్కొంటారు. సాధారణంగా కరోనరీ ఆర్టరీ వ్యాధిలో కనిపించే లక్షణం. ఇది గుండెపోటుకు దారితీస్తుంది. అప్పటి వరకూ గుండె జబ్బులు లేని వారు, ఉన్న వారు సైతం ఈ తరహా లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యున్ని సంప్రదించాలి. హార్ట్ ఎటాక్ సమయంలో కొంత మందిలో వాంతులు కావడం జరుగుతుంది. పురుషుల్లో కంటే మహిళల్లో హార్ట్ ఎటాక్ సమయంలో ఇది ఎక్కువగా కనిపించే లక్షణం.

గుండె శరీరమంతటికీ రక్తాన్ని సరిగా పంప్ చేయలేని స్థితిలో వివిధ భాగాల్లో వాపు కనిపిస్తుంది. గుండె రక్తాన్ని వేగంగా పంప్ చేయలేకపోతే రక్తం నరాల్లోకి వెనక్కి వచ్చేస్తుంది. దీంతో వాపు కనిపిస్తుంది. వాపు కనిపించినంత మాత్రాన అది గుండెజబ్బుగానే అనుకోవడానికి లేదు, మూత్రపిండాల వైఫ్యలంలోనూ ఇదే విధంగా ఉంటుంది. గుండె పనితీరు వైఫల్యం చెందితే అది మూత్రపిండాలపైనా పడుతుంది.చాతీ పట్టేసినట్టు ఉండి చెమటలు పడుతుంటే మాత్రం అది హార్ట్ ఎటాక్ కు సంకేతమేనంటున్నారు వైద్య నిపుణులు.

స్త్రీలు, పురుషుల్లో భిన్నంగా ఈ లక్షణాల్లో తెడాలు ఉండవచ్చు. మగవారిలో గుండెపోటు సమయంలో ఎక్కువగా చాతీలో పట్టేసినట్టు, నొప్పి, ఎడమచేయి, భుజం, వెన్ను నొప్పి తరహా లక్షణాలు కనిపిస్తే… అదే మహిళల్లో ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడడం, తలతిరగడం, వాంతులు, దవడ నొప్పి, వెన్ను నొప్పి లక్షణాలు కనిపిస్తాయి. మగవారిలో ఇంకా వీపు భాగంలో ఉండే పెద్ద ఎముకల దగ్గర నొప్పి రావచ్చు. కడుపులో పైభాగంలోనూ నొప్పి వస్తుంది. గుండె ఓ లయబద్ధంగా కొట్టుకోవాలి. అలా కాకుండా వేగంగా కొట్టుకుంటున్నా, చాలా నిదానంగా కొట్టుకుంటున్నా అది గుండెకు సంబంధించిన సమస్యకు సంకేతమే. ఇలాంటి ముందస్తు లక్షణాలు కనిపించగానే అదేంటన్నది వైద్యులను కలసి పరీక్షించుకోవాలి.

నయం చేయడం కంటే.. అరికట్టడం మంచిదని నిపుణులు చెబుతుంటారు. లక్షణాలపై అవగాహ ఉంటే.. ఏదైనా వార్నింగ్ సంకేతాలు కనిపించినప్పుడే వెంటనే వైధ్యుని సంప్రదించాలి. వెంటనే అలర్ట్ అయి.. జాగ్రత్తలు తీసుకోవడం వల్ల.. మనతోపాటు, మన పక్కనవాళ్ల ప్రాణాలను కూడా కాపాడవచ్చు.

Leave a Comment