పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఫ్యాన్స్ కు చాలా కాలం తర్వాత మంచి ట్రీట్ ఇచ్చింది ఈ మూవీ. ఇందులో పవన్ యాక్షన్ అందరినీ ఆకట్టుకుంది. నాలుగు రోజుల్లోనే రూ.252 కోట్లు వసూలు చేసింది. పవన్ కెరీర్ లోనే హయ్యెస్ట్ కలెక్షన్లు అందుకున్న సినిమాగా చరిత్ర సృష్టించింది. ఫ్యాన్స్ అయితే చాలా కాలం తర్వాత ఈ మూవీతో ఫుల్ ఖుషీలో ఉన్నారు.
మెగా హీరోలు ఈ సినిమాను చూశారు. హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో స్పెషల్ గా వేసిన షోకు పవన్ కల్యాణ్ తో పాటు చిరంజీవి-సురేఖ దంపతులు, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయిదుర్గాతేజ్, వైష్ణవ్ తేజ్, అకీరా, ఆద్య, చిరంజీవి మనవరాళ్లు వచ్చారు. వీరితో పాటు అడవిశేష్, రాహుల్ రవీంద్రన్ , సుజీత్, థమన్ కూడా వీరితో పాటు ఉన్నారు. దీంతో ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా చూసిన అనంతరం అగ్ర కథానాయకుడు చిరంజీవి ఈ సినిమాపై పూర్తి రివ్యూ ఇచ్చారు. తన అభిమానులకు కావాల్సిన వినోదాల విందును పవన్ (Pawan Kalyan) ఈ సినిమాతో ఇచ్చారని తెలిపారు.
కుటుంబంతో పాటు, ‘ఓజీ’ (OG) మూవీ యూనిట్‌తో కలిసి థియేటర్‌లో దిగిన ఫొటోలను చిరంజీవి పంచుకున్నారు. ‘‘నా కుటుంబంతో కలిసి ఓజీ చూశాను. చిత్రంలోని ప్రతి అంశాన్ని పూర్తిగా ఆస్వాదించాను. హాలీవుడ్ ప్రమాణాలకు తగినట్లు ఈ సినిమాను అద్భుతంగా నిర్మించారు. అండర్ వరల్డ్ గ్యాంగ్‌స్టర్ చిత్రమిది. భావోద్వేగాలకు లోటులేకుండా రూపొందించారు. ప్రారంభ సన్నివేశం నుంచి క్లైమాక్స్ వరకూ ప్రతి సన్నివేశాన్ని దర్శకుడు సుజీత్ అసాధారణరీతిలో రూపొందించాడు. పవన్ కల్యాణ్‌ను తెరపై ఇలా చూడడం చాలా గర్వంగా అనిపించింది. తన ప్రత్యేక ఆకర్షణతో సినిమాను నిలబెట్టాడు. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తోన్న అభిమానులకు ‘ఓజీ’తో సరైన విందు ఇచ్చాడు. తమన్ ఈ చిత్రానికి ఆత్మతో సమానం. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. చిత్రబృందానికి నా అభినందనలు’’ అని చిరు (Chiranjeevi) తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

ఇక ఈ సినిమా విడుదలైన నాడు కూడా చిరంజీవి పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్‌ను అందరూ ‘ఓజాస్ గంభీర’గా సెలబ్రేట్ చేసుకుంటుంటే ఎంతో ఆనందంగా ఉందన్నారు (Chiranjeevi Og Review). తమన్ సంగీతం అద్భుతంగా ఉందని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.










