ఆకలి మనిషిని ఏదైనా తినేలా చేస్తుంది. అయితే ఆకలిగా ఉన్నదని ఏది దొరికితే అది తిన్నామే అనుకోండి ఇక పొట్ట తిప్పలు పడాల్సిందే. ఏఏ ఆహారాలను తీసుకోవడం పొట్టకు మంచిది..? గ్యాస్‌ను ప్రేరేపించే ఏఏ ఆహారాలను దూరంగా పెట్టాలి..?
మనం తింటున్న ఆహారంలో అనేక కలుషిత పదార్థాలు చేరుతున్నాయి. దీంతో కడుపులో మంట, అజీర్తి, గ్యాస్ నొప్పి లాంటివి వస్తున్నాయి. కడుపులో ఆమ్లాలు ఉత్పత్తి కావడం వల్ల గ్యాస్ తయారవుతుంది. గ్యాస్ట్రీక్ సమస్య వల్ల కడుపు ఉబ్బరంగా ఉండటం, నొప్పి లేవడం వంటి ఇబ్బందులు తలెత్తుతుంటాయి. గ్యాస్ సమస్య అనేది ప్రతి ఒక్కరికి అనుభవంలోకి వచ్చే ఒక సాధారణ విషయం. కొన్నిసార్లు మనం తీసుకొనే ఆహారం ద్వారా గ్యాస్ ఏర్పడి మలబద్ధకం లేదా అతిసారానికి దారితీస్తుంది. మారుతున్న జీవనశైలి, వేళకు ఆహారం తీసుకోకపోవడం, మానసిక ఒత్తిడి, రాత్రి నిద్రపట్టకపోవడం, నిరంతర ఆలోచనలు, కారణం లేకుండానే కోపం రావటం, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటి కారణాలతో గ్యాస్ సమస్య తీవ్రరూపం దాల్చి వేధిస్తుంటుంది.
అత్యధిక ఫైబర్ ఉన్న ఆహారాలు, ఆరోగ్యకరమైన ఆహారాలు జీర్ణం కాకపోవటం వలన గ్యాస్ ఏర్పడుతుంది. గ్యాస్ ప్రకోపించిన సందర్భాల్లో గ్యాస్ అసంకల్పితంగా బయటకు రావటం త్రేనుపులు రావటం, ఉదర ప్రాంతంలో తీక్షణమైన నొప్పులు రావటం, చాతీ ప్రాంతంలో నొప్పి రావటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. బీన్సు, చిక్కుళ్ళు, క్యాబేజి, కాలిఫ్లవర్, పాలు, పాల ఉత్పత్తులు, గోధుమ, శనగపిండి వంటకాలు, వేరుశనగ, కందిపప్పు, ఉల్లిపాయ, పచ్చి కూరగాయలు, ద్రాక్ష, సార్బిటాల్ అధిక మోతాదులో ఉండే యాపిల్, బ్లూబెర్రీలు వంటి పండ్లతోపాటు పుచ్చకాయ తినడం వల్ల గ్యాస్ సమస్య ఎక్కువవుతుంది. అదేవిధంగా స్టార్చ్ ఉండే ఆలుగడ్డలు, అలాగే పుట్టగొడుగులు, కార్బొనేటెడ్ పానీయాలు , షుగర్ ఆల్కహాల్‌తో ఉన్న డైట్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల గ్యాస్ తయారవుతుంది.
జీర్ణక్రియ సాఫీగా జరిగేలా వీలుండే ఆహారాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. జీర్ణక్రియకు సహాయపడే అవాలు, యాలకులు, జీలకర్ర, పసుపు వంటివి గ్యాస్ రాకుండా ఉండటానికి కూరల్లో వాడాలి. మసాలాలు, వేపుళ్ళు, ఆయిల్ ఫుడ్స్, ఫాస్ట్‌ఫుడ్, ఆల్కహాల్, స్మోకింగ్, టీ, కాఫీలు మానివేయాలి. నిల్వ ఉంచిన పచ్చళ్ళు తినడం మానేయాలి. ఉప్పులో నిల్వ చేసిన ఎండు చేపలు, ఎండు రొయ్యలు తినకుండా చూసుకోవాలి. గ్యాస్‌ను ప్రేరేపించే చూయింగ్ గమ్, షుగర్ క్యాండీలను తినడం మానుకోవాలి. చీటికీ మాటికీ కృత్రిమ స్వీట్‌నర్స్, పెయిన్ కిల్లర్స్ వంటివి తీసుకోకూడదు. నిత్యం కొద్దిసేపు వ్యాయామం చేస్తూ తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చూసుకోవాలి. అలాగే మానసిక ప్రశాంతత కోసం యోగా, ప్రాణాయామం వంటివి ప్రాక్టీస్ చేయాలి.
పిండి పదార్థాలు, కొవ్వు అధికంగా ఉండేవి త్వరగా జీర్ణం కాక గ్యాస్‌ను ప్రేరేపిస్తాయి. అలాగే వేళకు భోజనం చేయడం కూడా చాలా ముఖ్యమైనదని గుర్తుంచుకోవాలి. ఎక్కువసార్లు తక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవడం చాలా మంచిది.








