Iodine Deficiency : అయోడిన్ లోపానికి కారణాలు, పరిష్కార మార్గాలు..!

By manavaradhi.com

Published on:

Follow Us
Iodine Deficiency - Signs and Symptoms

ఆయోడిన్ అనేది ఆహారంలో ఉండే ఒక కీలకమైన మూలకం. ముఖ్యమైన పోషక పదార్థం. వైద్య పరిభాషలో చెప్పాలంటే ట్రేస్ ఎలిమెంట్. ఆయోడిన్ సర్వ సాధారణంగా శరీరంలో ఉత్పత్తి కాదు. అందుకే అయోడిన్ మన శరీరానికి అందాలంటే ఆహారం ద్వారానే సాధ్యమౌతుంది. మన శరీరానికి సరైన స్థాయిలో అయోడిన్ అందకపోతే అది థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి లోపానికి దారి తీస్తుంది. ఫలితంగా హైపో థైరాయిడిజం, గైత్రే లాంటి సమస్యలతో పాటు క్రిటినిజం, గర్భానికి సంబంధించిన సమస్యలు ఎదురౌతాయి. గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు పాలు ఇచ్చే మహిళలకు ఇది 50 శాతం అధికంగా అవసరం అవుతుంది. అందుకే సాధారణంగా ఆయోడిన్ లోపం లాంటివి గర్భిణులు, చిన్న పిల్లల్లోనే ఎదురౌతూ ఉంటాయి.

ముఖ్యంగా మన దేశంలో దీర్ఘకాలంగా ఆయోడిన్ లేని ఉప్పును వాడుతూ ఉండడం వల్ల 6 నుంచి 11 ఏళ్ళ వయసు గల పిల్లల్లో దాదాపు 3 నుంచి 8 శాతం వరకూ చిన్న పిల్లలు థైరాయిడ్ బారిన పడుతున్నారని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ప్రధానంగా మనం తినే ఉప్పు ద్వారానే ఆయోడిన్ అందుతుంది. ఉప్ తక్కువగా ఉండే ఆహారం తినడం వల్ల, వంట వండే సమయంలో ఉప్పు అయోడిన్ కోల్పోవడం లాంటివి ఉంటాయి. అలాగే మాంసాహారంతో పోలిస్తే శాకాహారంలో అయోడిన్ చాలా తక్కువ. అలాగే వ్యాయామం చేసే వారు కూడా గణనీయమైన స్థాయిలో అయోడిన్ కోల్పోవడం జరుగుతుంది.

శరీరానికి ఆయోడిన్ చాలా అవసరం. అయితే ఆయోడిన్ లోపం శరీరంలో ఏర్పడిందనే విషయాన్ని ముందుగా గుర్తించగలిగితే సమస్య నుంచి పరిష్కారం పొందవచ్చు. వేళ్ళ గోళ్ళు మరింత పెళుసుగా మారిపోవడం, బిరుసుబారిన మరియు పలచబడిన వెంట్రుకలు, ఉబ్బిన కళ్ళు, పాలిపోయి పొడిబారిన చర్మం లాంటి ప్రధానంగా ఆయోడిన్ లోపాన్ని గుర్తించే మార్గాలు. థైరాయిడ్, రొమ్ము, ప్రొస్టేట్ మరియు ఇతర పునరుత్పత్తి వ్యవస్థలకు సంబంధించిన సమస్యలు కూడా అయోడిన్ లోపం వల్ల కలిగే సమస్యలు. జ్ఞాపకశక్తిని కోల్పోవడం, కొలెస్ట్రాలు స్థాయి పెరగడం, కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, మాటలు మందగించడం, వినికిడి కోల్పోవడం లాంటివి కూడా సంభవిస్తాయి. అదే విధంగా మెడలో వాపు, శ్వాస తీసుకోవడం మరియు మింగడంలో కష్టం ఎదురు కావడం, కొన్ని సమయాల్లో ఊపిరి ఆడకపోవడం, బరువు పెరగడం, అలసటగా ఉండడం లాంటి ఇబ్బందులు ఎదురౌతాయి. ముఖ్యంగా గర్భిణి స్త్రీలలో ఆయోడిన్ లోపం కారణంగా గర్భస్రావం, నెలలు నిండకుండా పిల్లలు పుట్టడం, పిల్లలకు పుట్టుకతోనే లోపాలు రావడం లాంటి ఇబ్బందులు ఎదురౌతాయి. సాధారణంగా మూత్ర పరీక్ష ద్వారా ఆయోడిన్ లోపాన్ని గుర్తించవచ్చు. అలాగే అల్ట్రాసోనో గ్రఫి ద్వారా ధైరాయిడ్ పరిమాణం ద్వారా కూడా ఆయోడిన్ స్థాయిని గుర్తించవచ్చు.

ఆయోడిన్ లోపాన్ని పోగొట్టుకోవడానికి వైద్యులు సూచించిన మందులు వాడడం తప్ప మరో మార్గం లేదు. అయితే అసలు అయోడిన్ లోపం రాకుండా చూసుకునేందుకు మాత్రం ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇందులో ప్రధానమైనది అయోడిన్ ఉన్న ఉప్పును తీసుకోవడం. అలాగే అయోడిన్ కలిపిన నూనె, ఆయోడిన్ కలిపిన నీరు, అయోడిన్ చుక్కలు కూడా లభిస్తాయి. వీటిని తీసుకోవడం ద్వారా కూడా అప్పటికే ఉన్న అయోడిన్ లోపాన్ని తగ్గించుకోవచ్చు. అలానే అయోడిన్ ఉండే ఆహారాన్ని గుర్తించి తినడం సముద్రపు నాచు, సాధారణ పెరుగు, పాలు, చేపలు, రొయ్యలు, తొక్కతో పాటు బంగాళదుంపను తీసుకోవడం వల్ల అయోడిన్ పుష్కలంగా లభిస్తుంది. అదే విధంగా సోయా, క్యాబేజీ, బ్రోకలి, కాలిఫ్లవర్ లాంటి ఆయోడిన్ తక్కువగా అందించే ఆహారాన్ని తగ్గించాలి. కేవలం ఆయోడిన్ లోపం అధికంగా ఉన్న వారు మాత్రమే ఈ ఆహారాలను తగ్గించాలి.

ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం, తీసుకునే ఆహార పదార్థాల్లో అయోడిన్ పరిమాణం ఎక్కువగా ఉండేలా చూసుకోవడంతో పాటు శరీరం నుంచి టాక్సిన్స్ ను వదిలించుకోవడం ద్వారా ఆయోడిన్ స్థాయిని పెంచుకోవచ్చు.

Leave a Comment