మనకు మార్కెట్లో అనేక రకాల కూరగాయలు అందుబాటులో దొరుకుతున్నాయి. వీటిని ఆహారంగా నిత్యం తీసుకుంటే మన శరీరానికి కావల్సిన పోషకాలతోపాటు శక్తి కూడా అందుతుంది.
ప‌్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో శారీరక శ్రమ లేకుండా పోతోంది. వంట చేసుకొని కడుపారా ఆరగించే సమయం కూడా లేకుండా పోతోంది. ఆఫీసు క్యాంటీన్లోగానీ, కర్రీ పాయింట్లలో గానీ దొరికే కూరలపైనే ఆధారపడాల్సిన అగంత్యం నెలకొన్నది. రోజంతా కష్టించి పనిచేసే శరీరాలకు కావలసిన పోషకాలు కూరగాయల్లో పుష్కలంగా లభిస్తాయి. తక్కువ ధరల్లో లభ్యమవడమే కాకుండా వీటిలో ఉండే విటమిన్లు, ఖనిజ లవణాలు, పిండి పదార్థాలు మన ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ఎంతో మేలు చేస్తాయి. కొన్నింటిని వండితే వాటిలోని పోషకాలు ఆవిరైపోతాయి. కాబట్టి అలాంటి ఆహారాన్ని పచ్చిగా తింటేనే పోషకాలు లభిస్తాయి. అలా అని అన్ని ఆహారాలను పచ్చిగా తినకూడదని హెచ్చరిస్తున్నారు పోషకాహార నిపుణులు.
కూరగాయలను ఇష్టం తినేట్లుగా చేయాలంటే రోస్ట్ చేసుకోవాలి. చిలగడదుంప, గుమ్మడికాయ, కాలీఫ్లవర్‌లను సమంగా కోసి సన్నటి మంటపై దోరగా వేయించి తినడం వల్ల వాటిలోని పోషకాలు సరైన రీతిలో మనకు అందుతాయి. అలాగే గుమ్మడికాయ, చెర్రీ టమాటలు, ఉల్లిగడ్డ ముక్కలు, మష్‌రూం ముక్కలను బెల్‌పెప్పర్‌తో కలిపి గ్రిల్‌పైన ఫ్రైచేసుకోవడం వల్ల వాటిలోని పోషకాలు బయటకు పోకుండా ఉంటాయి. ప్రతీసారి చిప్స్ తినే బదులుగా క్యారెట్, ముల్లంగి, చిలగడదుంప, స్నాప్ బఠానీలను బెల్ పెప్పర్‌తో మిక్స్ చేసి రుబ్బి వడ్డిస్తే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పెరుగు చట్నీని అందరూ ఇష్టపడతారు. అందుకని దీన్ని తయారుచేసేప్పుడు దానిలో కొన్ని ఆకుకూరల ముక్కలు, ఉల్లిగడ్డ, దోసకాయ ముక్కలు, పుదీనా, అల్లం, జీలకర్ర వేస్తే రుచితోపాటు మరెన్నో పోషకాలు కూడా అందుతాయి.
వంటల్లో తీపి కోసం చక్కెరగానీ, బెల్లంగానీ వాడకుండా డ్రైఫ్రూట్స్ వాడటం అలవాటు చేసుకోవాలి. వీటిని తినేందుకు చిన్నారులు ఎక్కువ శ్రద్ధ చూపుతారు. కూరగాయల సలాడ్‌కు పండ్లను చేర్చడం వల్ల మరిన్ని ఎక్కువ పోషకాలు అందుకోవచ్చు. నూడుల్స్ అంటే ఇష్టపడే పిల్లలకు పాలకూర, గుమ్మడి, దోసకాయ, చిలగడదుంపలతో నూడుల్స్ తీగలు తీసి వారికి నచ్చేలా అందివ్వాలి. కాలిఫ్లవర్, గుమ్మడికాయలతో అరటిపండు, పెరుగు లేదా పాలు, దాల్చిన చెక్కతో కలిపి స్మూతీలు తయారుచేసి తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. రోజుకో రకం కూరగాయలతో చట్నీలు తయారుచేస్తుంటే పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు. కోడిగుడ్డు ఆమ్లెట్‌వేసుకొనేప్పుడు సన్నగా తరిగిన కాలిఫ్లవర్, ముల్లంగి, క్యారట్ ముక్కలతో పుదీనా కలిపడం వల్ల చాలా పోషకాలు అందుతాయి. బయట దొరికే చిప్స్‌కు బదులుగా ఇంట్లోనే అరటి, బంగాళాదుంప, చిలగడదుంపలతో చిప్స్ చేసి ఇవ్వాలి. అదేవిధంగా నిత్యం కూరల్లో దాల్చినచెక్క, జీలకర్ర, కారం, పసుపు, అల్లం వంటివి సరైన మోతాదులో వాడుకోవడం వల్ల పలు ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.
తాజా కూరగాయల్ని తీసుకోవడం ద్వారా డాక్టర్‌కు దూరంగా ఉండొచ్చు. అయితే ప్రస్తుతం కూరగాయల సాగుకు ఎక్కువ మొత్తంలో రసాయనిక ఎరువులు వాడుతున్నందున.. బాగా శుభ్రం చేసిన తర్వాతనే వంటలకు శ్రేయస్కరమని గుర్తుంచుకోవాలి.








