Vaikuntha Ekadashi : ముక్కోటి ఏకాదశి.. ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేయాలి ?

By manavaradhi.com

Published on:

Follow Us
Vaikuntha Ekadashi

Vaikunta Ekadasi: శ్రీ మహా విష్ణువు వైకుంఠ ఏకాదశి రోజు మూడు కోట్ల దేవతలకు, భక్తులకు ఉత్తర ద్వారంలో దర్శనం ఇస్తాడు కాబట్టి ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది. ఈ రోజు వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనాలు విశేషంగా కొనసాగుతాయి. తిరుమలలో శ్రీనివాసుడి ఆలయం, శ్రీరంగంలో రంగనాథుని ఆలయం, భద్రాచలం శ్రీ సీతారామాలయంలో స్వామివారు ఉత్తర ద్వార దర్శనంలో ఇస్తున్నారు.

ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశి రోజున స్తుతించే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది. ఈ పుణ్య దినాన విష్ణాలయాల్లో ఉత్తర ద్వారం తెరిచి ఉంచుతారు. క్షీరసాగర మథనం జరిగి హాలాహలం, అమృతం ఉద్భవించిందీ ఈ రోజునే. అందుకే ఇంతటి పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించి లక్ష్మీ సమేతుడైన శ్రీమహావిష్ణువుని షోడశోపచార విధితో పూజించి, నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేస్తే పుణ్య ఫలం దక్కుతుందని ప్రగాఢ విశ్వాసం.

పురాణ గాథలు

ముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యాన్ని వివరించే రెండు పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి. పర్వతమహర్షి సూచన మేరకు వైఖానసుడనే రాజు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల అతడి పితృదేవతలకు నరక బాధల నుంచి విముక్తి కలిగి స్వర్గలోకంలో ప్రవేశించారట. అలాగే, పద్మ పురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి ‘ముర’ అనే రాక్షసుడిని సంహరించిన రోజు కూడా ఇదే. మురాసురుడి దురాగతాలను భరించలేక దేవతలు విష్ణువును శరణు కోరగా, ఆయన ఆ రాక్షసుడితో తలపడి సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికాశ్రమంలోని హైమావతి అనే గుహలోకి ప్రవేశించాడు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును సంహరించేందుకు ముర ప్రయత్నించగా మహా విష్ణువు నుంచి ఆవిర్భవించిన వైష్ణవీ శక్తి దుర్గ రూపంలో అక్కడ ప్రత్యక్షమై తన కంటి చూపుతో మురను బూడిద చేసింది. అప్పుడు విష్ణువు సంతోషించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి ఏదైనా వరం కోరుకోమని చెప్పాడు. తాను ఆవిర్భవించిన ధనుర్మాస శుక్లపక్ష ఏకాదశి రోజున ఉపవాసం ఉండి మిమ్మల్ని భక్తితో సేవించిన వారి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది. దీంతో పుష్య శుక్ల పక్ష ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు. అప్పటినుంచి ఏకాదశి వ్రతం ప్రాచుర్యం పొందింది.

Leave a Comment