Osteoporosis : ఈ వ్యాధి వస్తే ఎముకలు వట్టిగానే విరిగిపోతాయి

By manavaradhi.com

Published on:

Follow Us
Osteoporosis

వయసులో ఉన్నప్పుడు సరైన ఆరోగ్యకరమైన జీవన శైలిని కొనసాగించనప్పుడు దాని ప్రభావం వృద్ధాప్యంపై పడుతుంది. వయసుతో పాటు వచ్చే సమస్యలకు తోడుగా ఆస్టియోపొరోసిస్‌ వంటి వ్యాధులు చుట్టుముడుతుంటాయి. అధికంగా ఇబ్బందిపెట్టే ఆస్టియోపోరోసిస్ వ్యాధి రాకుండా ఏంచేయాలి…? మన జీవనశైలిని ఏవిధంగా మార్చుకోవడం ద్వారా ఈ వ్యాధి మన దరి చేరకుండా కాపాడుకోవచ్చు..?

ఆస్టియోపొరోసిస్‌… దీన్నే బోలు ఎముకల వ్యాధి అంటారు. మన దేశంలో దాదాపు 60 మిలియన్ల మంది ఈ వ్యాధితో బారినపడుతున్నారని అంచనా. వృద్ధుల్లో ఎముక సాంద్రత తరిగిపోవడంతో ఈ సమస్య వస్తుంది. దీంతో ఫ్రాక్చర్‌లు ఎక్కువగా జరుగుతాయి. ఈ వ్యాధి ఎక్కువగా మహిళల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా మెనోపాజ్‌ దాటిన మహిళలలో తుంటి, వెన్నుముక, మణికట్టు ఫ్రాక్చర్లు అయ్యే అవకాశాలు పెరుగుతాయి. ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వారిలో, విటమిన్ డి లోపం ఉన్నవారిలో, పౌష్టికాహార లోపం ఉన్నవారిలో ఎక్కువగా ఈ వ్యాధి కనిపిస్తుంది. మెనోపాజ్ తర్వాత వయసులో ఉన్నవారిలో ప్రైమరీ టైప్ కనిపిస్తుండగా… వయసు పెరిగే కొద్దీ మనిషి శరీరంలోని ఎముకలు బలహీనంగా మారిపోతుంటాయి. ఇదే సమయంలో ఆస్టియోపోరోసిస్ వ్యాధికి గురైతే ఎముకలు గుళ్లబారిపోయి విరిగిపోతుంటాయి. చిన్న దెబ్బ తగిలినా ఎముకలు విరిగి చాలా సమస్యలకు కారణమవుతుంది.

స్త్రీలలో ఎముకలను ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ సంరక్షిస్తుంది. ఎముకలు బలహీనానికి కారణమయ్యే మెనోపాజ్‌కి చేరినప్పుడు ఈస్ట్రోజెన్ గణనీయంగా తగ్గుతుంది. ఫలితంగా స్త్రీలలో ఈ వ్యాధి రావడానికి ఆస్కారమెక్కువగా ఉంటుంది. క్యాల్షియం మరియు విటమిన్ D ల లోపం కూడా, ఎముకలు బలహీనపడడానికి ఒక కారణం కావచ్చు. హైపర్ పారాథైరాయిడిజం ఉన్నప్పుడు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, సీఓపీడీ వ్యాధికి గురైనప్పుడు, అధిక మద్యపానం, సిగరెట్లు తాగడం, కొన్ని రకాల మందుల వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రారంభ దశలో గుర్తించడం కష్టం కావడం వల్ల ఎముకలకు నష్టం వాటిల్లుతుంది. చిన్నపాటి ప్రమాదాలకే ఎముకలు విరిగే పరిస్థితి తలెత్తుతుంది. ఆస్టియోపోరోసిస్ ఉన్నవారికి ఎముకల్లో నొప్పి ఎక్కువగా ఉంటే మణికట్టు, వెన్నెముక, తుంటి ఎముక భాగాలను బోన్ డెన్సిటీ మీటర్ ద్వారా పరీక్షిస్తారు.

సరైన జీవనశైలిని అనుసరించడం వల్ల ఆస్టియోపొరోసిస్ ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. బలమైన, దట్టమైన ఎముకల అభివృద్ధికి తగినంత క్యాల్షియం, విటమిన్ D అవసరం. రోజూ నడక వంటి వ్యాయామాలు చేయటంతో పాటు తగినంత క్యాల్షియం, విటమిన్‌ డి తీసుకుంటే ఎముక పుష్టిని కాపాడుకోవచ్చు.క్యాల్షియం ఎక్కువగా లభించే పండ్లు, కూరగాయలు ఆహారంలో భాగం చేసుకోవాలి. రోజూ కాసేపు ఎండలో గడిపడం ద్వారా విటమిన్ డి లభిస్తుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉండే పాలు, పెరుగు, ఛీజ్ వంటి పాల పదార్ధాలు తీసుకోవాలి. క్యాల్షియం, విటమిన్ B6, B12, ఫోలేట్ ఎక్కువగా ఉండే గుడ్డును డెయిలీ మెనూలో చేర్చుకోవాలి. ఆస్టియోపొరోసిస్ కి ఆపిల్, ఆరంజ్, పియర్,అరటిపండు, నిమ్మ, పాలకూర, అల్లం చాలామంచి ఆహార పదార్ధాలు. చిక్కుళ్ళు, సోయాబీన్స్ స్త్రీలలో ఎముక ఖనిజ సాంద్రతను మెరుగుపరిచి, ఆస్టియోపొరోసిస్ సమస్యను తగ్గిస్తాయి.

సైలంట్ కిల్లర్‌గా భావించే ఆస్టియోపోరోసిస్ వల్ల కలిగే సమస్యలు, దాన్నుంచి బయటపడే మార్గాల గురించి తెలుసుకున్నారు కదూ. ఈ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండి ఎముకల సమస్య రాగానే వెంటనే వైద్యనిపుణుల్ని కలిసి సలహాలు పొందడం ఎంతైనా అవసరం.

Leave a Comment