సునీల్ కనుగోలుది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్న పేరు. ఈయన గురించి ఎక్కడా ప్రసారాలు లేవు, మీడియాలో పెద్దగా కనిపించరు.. ఫోటోలు లేవు అసలు సనీల్ గురించి చర్చలు లేవు… కానీ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీకి ఎన్నికల విషయాలపై నేరుగా సలహాలు ఇచ్చే వ్యక్తులలో ఒకరిగా ఆయన ఎదిగారు అంటే ఎంత రాజకీయాలాను ఇట్లే మలుపుతిప్పకలిగే దిట్టో ఇట్టే అర్థం చేసుకోవాచ్చు..
తెలంగాణ కాంగ్రెస్ విజయం తర్వాత ప్రస్తుతం మారుమోగుతున్న పేరు సునీల్ కనుగోలు. ఎన్నికల్లో రాజకీయవ్యూహాలు రచించడంలో కాకలు తీరిన కేసీఆర్ తో తలపడి.. కొద్ది నెలల కాలంలోనే కాంగ్రెస్‌ను విజయతీరాన్ని చేర్చడంలో ఎన్నికల వ్యూహకర్త సునీల్ కీలకంగా వ్యవహరించారు. ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ, బీఆర్ఎస్ వ్యూహాలకు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావటంలో సనీల్ రచించి వ్యూహాలు అద్భుతం అని చెప్పాలి.
అమెరికాలో ఉన్నత చదువులు పూర్తి చేసిన సునీల్ కనుగోలు. ప్రఖ్యాత కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సేలో పనిచేశాడు. ఆ తర్వాత భారత్ వచ్చి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ టీమ్ లో చేరాడు. గతంలో ఆయన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బృందంలో కీలకసభ్యుడిగా పనిచేశారు. ఆ తర్వాత ప్రశాంత్ కిశోర్ సంస్థ నుంచి విడిపోయి సొంతంగా సంస్థను స్థాపించి, కొద్దికాలంలోనే తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. తన పేరు మీదే ‘ఎస్కే.. అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్’ సంస్థను ప్రారంభించి దేశంలో 14 ఎన్నికల్లో పలు పార్టీలకు వ్యూహకర్తగా వ్యవహరించారు. గతంలో సునీల్ ఎంకే స్టాలిన్ కోసం కూడా పని చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అద్భుతమైన ప్రచారానికి రూపకల్పన చేశారు. ఆ ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని కూటమి మొత్తం 39 పార్లమెంట్ స్థానాల్లో 38 స్థానాలను గెలుచుకుంది. ఒకప్పటి తన సహోద్యోగి అయిన ఐపాక్‌కి చెందిన ప్రశాంత్ కిషోర్ డీఎంకే శిబిరంలో చేరి వ్యూహ రచన చేశారు. తర్వాత సునీల్ స్టాలిన్ శిబిరాన్ని విడిచిపెట్టి బెంగళూరుకు వెళ్లారు.
2022 సెప్టెంబరు 7 నుంచి 14 రాష్ట్రాల మీదుగా కాంగ్రెస్ అగ్రనాయుకుడు రాహుల్ గాంధీ “భారత్ జోడో యాత్ర” రూపకల్పన వెనుక ఉన్నది కూడా సునీల్ కనుగోలే. ఇవన్ని ఒక ఎత్తు అయితే కాంగ్రెస్ పార్టీ కోసం సునీల్ కనుగోలు సాధించిన తొలి విజయం కర్ణాటక అసెంబ్లీని చేజిక్కించుకోవడం అనే చెప్పాలి. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీతో కలవకముందు సునీల్ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల్లో వివిధ పార్టీల కోసం పనిచేశారు. తెలంగాణలో వ్యూహాల అమలు, అంతర్గత సర్వేల వంటి విషయాల్లో సునీల్‌కు కాంగ్రెస్ అధిష్ఠానం పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం కూడా విజయానికి తోడ్పడిందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… సునీల్ కనుగోలు గతంలో ప్రశాంత్ కిశోర్ సహచరుడే. 2014లో ప్రశాంత్ కిశోర్, సునీల్ కనుగోలు బీజేపీ కోసం పనిచేశారు. ప్రశాంత్ కిశోర్ కంటే ముందే సునీల్ కనుగోలు ప్రధాని నరేంద్ర మోదీకి వ్యక్తిగత వ్యూహకర్తగా పనిచేశారు. సునీల్ కనుగోలు, ప్రశాంత్ కిశోర్ అప్పట్లో సిటిజెన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ (CAG) స్థాపించి ప్రధానిగా నరేంద్ర మోదీని గద్దెనెక్కించడం కోసం కృషి చేశారు.