తెలంగాణా రాష్ట్రంలో, కరీంనగర్ జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి క్షేత్రం (Vemulawada Rajanna Temple) మన తెలుగునాట దక్షిణకాశీగా ప్రసిద్ధి. దీన్ని మొదట్లో లేములవాడ, లేంబాల వాటిక అనే పేర్లతోనూ పిలిచేవారని ఇక్కడున్న శాసనాల ద్వారా మనకు తెలుస్తుంది. కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా రాజరాజేశ్వరస్వామి విరాజిల్లుతుండగా, ఇతర ప్రాంతాల్లో ఎక్కడా లేని విధంగా ఎన్నో విశిష్టతలతో అలరారుతున్నది. ప్రధాన ఆలయంలో ఎటు చూసినా కొలువైన దేవతల గుడులతో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్నది.
భక్తుల పాలిట పెన్నిధి.. కోరిన కోర్కెలు ఇట్టే తీర్చే స్వామి వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి. రాజన్న అని నోరారా పిలుచుకునే ఈ రాజరాజేశ్వరస్వామి.. ఎంతో మహిమగల దేవుడని భక్తుల విశ్వాసం. వేములవాడ శ్రీ రాజన్న ఆలయ క్షేత్ర స్థలపురాణం ప్రకారం మాళవ ప్రభువైన రాజరాజ నరేంద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పౌరాణిక ఆధారాలు చెబుతున్నాయి. అంతేకాదు అప్పటిలో వేములవాడను చాళుక్యులు రాజధానిగా చేసుకొని పాలించినట్లు చరిత్రలో కూడా ఉంది. చాళుక్య రాజులలో మొదటి రాజు వినయాదిత్య యుద్ధమల్లుడు, అతని కుమారుడు అరికేసరి, ఆ తర్వాత రెండో యుద్ధమల్లుడు వేములవాడ కేంద్రంగా రాజ్యాన్ని పాలించారు. చాళుక్య రాజుల్లో చివరివాడు.. భద్రదేవుడి కుమారుడైన మూడో అరికేసరి అని దేవస్థానంలో ఉన్న శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది.
ఈ ఆలయం మరోక విశిష్ఠత ఏంటి అంటే.. భారత దేశంలోని ఏ ఆలయాల్లో లేనివిధంగా ఉదయం ప్రాతః కాల పూజ, మధ్యాహ్నం అన్న పూజ, ప్రదోషకాల పూజ (సాయంకాలం), రాత్రి నిషీ పూజ కార్యక్రమాలు ప్రతిరోజు ఉంటాయి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ధర్మగుండంలో పుణ్యస్నానం చేసి కోడెమొక్కు చెల్లించడం ఈ ఆలయ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాతే భక్తులు స్వామిని దర్శించుకొని ప్రధాన పూజలైన కల్యాణం, అభిషేకం, అన్నపూజ, కుంకుమ పూజ, ఆకుల పూజ, పల్లకిసేవల వంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. భక్తుల్లో చాలామంది స్వామివారికి తమ తలనీలాలు సమర్పించి తమ ఎత్తు బంగారాన్ని(బెల్లం) స్వామికి మొక్కుగా చెల్లించి.. ఆపై దాన్ని స్వామి ప్రసాదంగా పంపిణీ చేస్తారు.