Diabetes : షుగర్ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోపోతే అంతే…!

By manavaradhi.com

Published on:

Follow Us
Tips to avoid Diabetes complications

మన ఆరోగ్యానికి రహస్య శత్రువు మధుమేహం. ఈ వ్యాధి ఉందో లేదో తెలుసుకునేలోగానే చాపకింద నీరులా చాలా గోప్యంగా శరీరంలోకి చేరిపోయే లక్షణం దీనికుంది. ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా జీవితంలోని మాధుర్యాన్ని దూరం చేసి చేదుని మిగులుస్తుంది. కాబట్టి మధుమేహం వల్ల ప్రమాదాలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

రక్తంలో షుగర్ స్థాయి అదుపు తప్పి అసాధారణ స్థితికి చేరితే దానినే మధుమేహం అంటాం. చక్కెర వ్యాధిగ్రస్తులు మిగతా దీర్ఘకాలిక వ్యాధుల కంటే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మధుమేహ రోగుల్లో హృద్రోగ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. వీరిలో సమస్యలు బయటకు ఎక్కువగా కనిపించకపోయినా ఇది లోలోపల శరీర అవయవాలకు హాని కలిగిస్తుంది. దీనిని నియంత్రించకపోతే శరీరం లోపలి అవయవాలన్నీ దీని బారిన పడి తమ సమర్ధతను కోల్పోతాయి .

మధుమేహంతో భాదపడేవారు ఎప్పటికప్పుడు షుగర్ స్థాయిని నియంత్రించుకుంటూ వాటి ఆరోగ్యాన్ని తెలిపే పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకుంటూ ఉండాలి. ఒకసారి మధుమేహం అంటూ వస్తే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా మందులు వాడాల్సిందే.

చక్కెర వ్యాధి ఉన్న వారికి .. న్యూరోపతి వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ. శరీరంలోని వివిధ భాగాల్లో నరాలు చెడిపోవడం వల్ల వచ్చే సమస్యనే న్యూరోపతి అంటారు. అధిక బరువుతోపాటు బ్లడ్ షుగర్ ను నియంత్రణలో ఉంచుకుంటే ఇది కొంత మేర తగ్గే అవకాశం ఉంటుంది. మధుమేహం ఉన్న వారికి మూత్ర పిండాలు కూడా త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి .. వీటిని జాగ్రత్తగా ఉంచుకోవాలంటే నిరంతరం బ్లడ్ షుగర్ ను అదుపులో ఉంచుకోవాలి.

మధుమేహం ఎక్కువకాలంగా కొనసాగుతున్నప్పుడు అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. గుండె సమస్యలు, కంటి సమస్యలు, మూత్రపిండాల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కొందరిలో తరచుగా కాళ్ళల్లో తిమ్మిర్లు వస్తుంటాయి. ఇలాంటి వారు తప్పనిసరిగా ఎప్పటికప్పుడు అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవాలి. మధుమేహ నియంత్రణలో ఉన్నా సరే సమస్యలు రావచ్చు. తరచుగా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా సమస్య తీవ్రం కాకుండా చూసుకోవాలి.

ఈ వ్యాధిగ్రస్తుల్లో రక్తనాళాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఫలితంగా రక్తసరఫరా తగ్గిపోయి, అవయవాలు దెబ్బతింటాయి. డయాబెటిస్‌ రోగులకు కాలుకు, ఇతర శరీర భాగాలకు ఏదైనా గుచ్చుకున్నా స్పర్శ, బాధ తెలియవు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. పాదాలు రోజూ పరీక్షించుకోవాలి. ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు పాటించాలి.

Leave a Comment