SS Rajamouli : జక్కన్న కెరీర్ లో ఇప్పటి వరకు ప్లాప్ అనే విషయమే లేదు. తీసిన సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే. ఒకదాన్ని మించి మరొకటి ఆడుతుంటాయి. ఆయన రికార్డులను తిరగరాయాలంటే మళ్లీ ఆయనతోనే సాధ్యం. అలాంటి రాజమౌళి తీసిన భారీ బడ్జెట్ మూవీ మొదటి రోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. నిజమేనండి బాబు. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
‘‘బాహుబలి: ది బిగినింగ్’ విడుదలైన రోజున వచ్చిన టాక్ విని చాలా నిరాశకు గురయ్యా. అది తొలి పాన్ ఇండియా ఫిల్మ్. తెలుగుతో సహా దక్షిణాది భాషలతో పాటు, ఉత్తరాదిలోనూ విడుదల చేశాం. అమెరికా, యూఏఈ సహా ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో తీసుకొచ్చాం. ఈ మూవీకి సంబంధించి మాకు ప్రధాన ఆదాయ వనరు తెలుగు రాష్ట్రాలే. ఇక్కడినుంచే ఎక్కువ కలెక్షన్లు వస్తాయని అనుకున్నాం. అమెరికా సహా ఇతర దేశాల్లో మూవీ బాగుందని టాక్ వినిపించింది. కానీ, తెలుగులో షో పడగానే నెగెటివ్ టాక్ బయటకు వచ్చింది. ఫిల్మ్ ఇండస్ట్రీలోనే అతిపెద్ద ఫ్లాప్ మూవీ అని ప్రచారం జరిగింది. ఆ సమయంలో నేను చాలా బాధపడ్డా. ఎందుకంటే నన్ను నమ్మి నా నిర్మాతలు ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ నాతో మూడేళ్ల పాటు ప్రయాణం చేయడమే కాదు, ‘బాహుబలి’పై ఎంతో ఖర్చు చేశారు. వారిని ఎలా బయటకు తీసుకురావాలో నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత నెమ్మదిగా పాజిటివ్ టాక్ మొదలై, ‘బాహుబలి2’పై అంచనాలను పెంచింది’’ అని రాజమౌళి చెప్పుకొచ్చారు.










