ఆరోగ్యకరమైన శరీరానికి ఆరోగ్యవంతమైన గుండె చాలా ముఖ్యం. రోజువారీ ఆహారపు అలవాట్ల మీద ఇది ఆధారపడి ఉంటుంది. ఏం తింటున్నాం? ఏం తాగుతున్నామనేది? మన గుండె ఆరోగ్యాన్ని నిర్థారిస్తుంది. అందుకే అలాంటి అలవాట్ల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండే హృదయాన్ని పదిలం చేసుకోవచ్చు. అందుకే మీరు తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
గుండె అనుకోని అనారోగ్యానికి గురవడానికి ప్రధాన కారణం ఆహార నియమాలు పాటించకపోవడం. ఎక్కువ మోతాదులో ఉప్పు, చక్కెర, సంతృప్త కొవ్వును తీసుకోవడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అధిక ఉప్పు కారణంగా రక్తపోటు పెరిగి గుండె పని తీవ్రత పెరుగుతుంది. ఉప్పు ద్వారా సోడియం మోతాదు ఎక్కువైతే హార్ట్ ఫెయిల్యూర్ వంటి విపరీత సమస్యలు వస్తాయి.
రెడ్ మీట్ ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. వీటిలో ఎక్కువగా ఉండే సంతృప్త కొవ్వు బాడీలో కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. తక్కువ మోతాదులో చక్కెరను తీసుకోవడం ప్రమాదకరమేం కాదు. కానీ కూల్ డ్రింక్స్ లో ఒక రోజులో తీసుకోవాల్సిన దానికన్నా ఎక్కువ మోతాదులో షుగర్ ఉంటుంది. దీనివల్ల అధిక బరువు, ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్, రక్తపోటుతో పాటు గుండెనొప్పి కూడా వచ్చే ప్రమాదం ఉంది.
కుకీలు, కేకులు, మఫిన్లు తినడం తగ్గించాలి. అందులో ఉండే అదనపు చక్కెర.. బరువు పెరగడానికి దారితీస్తుంది. హైలెవెల్ ట్రైగ్లిజరైడ్ కారణంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. వీటి తయారీ కోసం వాడే తెల్ల పిండి రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది.
చాలావరకు పిజ్జాలు అధిక సోడియం, కొవ్వు, క్యాలరీలను కలిగి ఉంటున్నాయి. దీనివల్ల హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఫిజ్జా ఆర్డర్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఉప్పు ఎక్కువగా ఉండే సాస్ ను వాడడం తగ్గించండి. ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, అధిక బరువుతో పాటు హార్ట్ స్ట్రోక్ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. సంతృప్త కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే వెన్న.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను పెంచి గుండె సంబంధిత రోగాలకు కారణమవుతుంది. వెన్నకు బదులుగా ఆలివ్ ఆయిల్ లేదా కాయగూరలతో చేసిన నూనెను వాడడం మంచిది.. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
బరువు పెంచే ఆహారంలో ఆలూ చిప్స్ ముఖ్యమైనవి. ఇందులో గుండెపోటుకు కారణమయ్యే ఉప్పు ఎక్కువగా ఉంటుంది. తక్కువ సోడియం, తక్కువ కొవ్వు కలిగిన పొటాటో చిప్స్ ను తీసుకోవాలి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లలో దొరికే డీప్ ఫ్రైడ్ ఆలూ అధిక కొవ్వు, ఉప్పును కలిగి ఉంటుంది. ఇది గుండెకు చాలా ప్రమాదకరం. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే చిలగడ దుంపను ఫ్రై చేసుకుని తింటే మంచిది. సూప్ తాగడం వల్ల శరీరానికి చాలా సులభంగా కాయగూరలు, ప్రోటీన్లు, పీచు పదార్థాలు లభిస్తాయి. అయితే దాని తయారీ కోసం వాడే ముడి పదార్థాల విషయంలో జాగ్రత్త వహించాలి.
సంతృప్త కొవ్వులు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయులు పెరిగేలా చేస్తాయి. చెడ్డ కొలెస్ట్రాల్ మోతాదులు ఎక్కువైతే గుండెజబ్బు, పక్షవాతం ముప్పు పెరుగుతుంది. మాంసం, చర్మంతో కూడిన చికెన్, వెన్న, ఛీజ్, వెన్నతీయని పాలతో చేసిన పదార్థాల్లో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని పరిమితంగానే తీసుకోవాలి. కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవటానికి మరో మంచి మార్గం పీచుతో కూడిన పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లు, పొట్టు తీయని పదార్థాలు తరచుగా తినటం.
ఆహారం ద్వారా రోజుకు కనీసం 25-35 గ్రాముల పీచు లభించేలా చూసుకోవటం మంచిది. అలాగే ఉప్పు కూడా మితంగా తినాలి. రోజుకు 2 గ్రాములు అంతకన్నా తక్కువ సోడియం మించకుండా చూసుకోవాలి. పోషకాలతో కూడిన చిరుతిండ్లు.. ఆరోగ్యకరమైన ప్రొటీన్లు, పిండిపదార్థాలు, కొవ్వు పదార్థాలు కలిగి ఉంటాయి. కాబట్టి గుండెకు హానిచేసే ఆహారాలకు దూరంగా ఉంటూ మీ ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోండి.
ఎండ్ యాంకర్ : చూశారుగా గుండె ఆరోగ్యం కోసం ఎటువంటి ఆహారాలు తీసుకోకూడదో… మనం తినే ఆహారం గుండె ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపుతుంది. జంక్ ఫుడ్ తినడం వల్ల కేలరీలు, చెడు కొలెస్ట్రాల్ అమితంగా పెరుగుతాయి. ఇలా నిరంతరం తినడం వల్ల బరువు పెరగుతారు. అలాగే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ సమస్యలు కూడా పెరుగుతాయి. అందుకే బ్యాలెన్స్ డైట్ ఫాలో అవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.