Good Eating Habits – ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు

By manavaradhi.com

Published on:

Follow Us
Healthy Fat Foods

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో భోజనం కాస్తా మొక్కుబడి కార్యక్రమంగా మారిపోయింది. దాంతో పోషకాహారం అందక పలు రకాల ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. సరైన ఆహారాన్ని ఎంపిక చేయడానికి అనేక కారణాలను లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది. రుచి, శుచితో బాటు పౌష్టికాహార విలువలు, సౌకర్యవంతం, వ్యక్తిగత ఇష్టాలు ఇలా ఎన్నో అంశాలు ఆహారంతో ముడిపడి ఉంటాయి. చాలామందికి ఒక అపోహ ఉంటుంది. నాలుకకు రుచిగా ఉన్నవి మీ ఆరోగ్యానికి మంచిది కాదు అనేది వాస్తవం కాదు. ఒక్కోవ్యక్తికి ఒక్కో రకంగా పౌష్టికాహారం అవసరమౌతుంది.

ఏదైనా సరే ఆహారాన్ని మరీ ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా తీసుకోవాలి. ప్రతిరోజూ ఒకే నిర్ణీత సమయానికి భోజనం చేయాలి. ఇలా చేస్తే మన శరీరంలో జీవక్రీయలన్ని సక్రమంగా జరుగుతాయి. ప్రతిరోజూ అల్పాహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఉదయం భోజనం రోజంతా ఆకలిని అరికట్టడంలో సహాయపడుతుంది.

మనం తీసుకోనే ఆహారంలో ఖచ్చితంగా కొన్ని ఆహార నియమాలను పాటించాలి. తీపిపదార్థాలు, వేపుడు పదార్థాలు వీలయినంత వరకు తగ్గించుకోవాలి. తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు తినాలి. గంటకు ఒకసారి కొంతకొంత తినడం ఉత్తమం. దీనిద్వారా అసిడిటీకి దూరంగా ఉండవచ్చు. ఆహారంలో ఎక్కువగా సలాడ్స్ ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల ఏదైనా జీర్ణంకాని పదార్థాలు మీ జీర్ణవ్యవస్థను ఇబ్బంది పెడుతుంటే ఈ సలాడ్స్ ఎంతో ఉపయోగకరంగా పనిచేస్తాయి. కడుపు నింపుకోవడానికి కాకుండా శరీరానికి శక్తిని అందివ్వడానికి మనం ఆహారం తీసుకోవాలి.

వాతావరణ, కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఆహారం తీసుకోవాలి. బ్యాలెన్సింగ్ ఫుడ్ అన్నీ విధాలా శ్రేయస్కరం. మనం నిత్యం తీసుకునే ఆహారం, విటమిన్లు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేడ్లు.. ఇలా అన్నీ సమపాళ్లలో ఉండాలి. తీసుకునే ఆహారం ఎప్పుడూ ఒకే రకంగా ఉండకూడదు. కాలానుగుణంగా వచ్చే పండ్లూ, కూరగాయలు ఎంచుకోవాలి. అలాగే వెన్న తీసిన పాలూ, పాల పదార్థాలూ.. చిరుధాన్యాలు తీసుకోవాలి. అప్పుడే శరీరానికి అవసరమైన పోషకాలన్నీ అందుతాయి. ప్యాక్‌ చేసిన బయటి ఆహారాన్ని కొంటున్నప్పుడు తప్పనిసరిగా వెనక భాగంలో ఉండే వివరాలను చదవాలి. దానిలో ఉండే కెలోరీలు, కొవ్వు, ఉప్పు శాతం ఎంతున్నాయో చూసుకోవడం మంచిది.

తక్కువ తిన్నా, లేదా ఎక్కువ తిన్నా రెండూ ప్రమాదాలు కొని తెస్తాయి. కొంత మంది తక్కువ తిన్నా లావు అవుతుంటారు. మరి కొందరు ఎంత తిన్నా సన్నగానే ఉంటారు. దీనికి కారణం వారికి అందే పోషకాలు అనే చెప్పుకోవాలి. ప్రమాదకరమైన కొవ్వులతో పాటు, ఆహారంలో అవసరమైన కొవ్వులు కూడా ఉంటాయి. మంచి చేసే కొవ్వుల వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. అలాగే అనవసరమైన కొవ్వు శరీరంలో పేరుకు పోయి, స్థూలకాయంతో పాటు ఇతర రోగాలను తీసుకొస్తుంది. ఏ ఆహారం తీసుకున్నా ఎలా తీసుకోవాలన్న విషయాన్ని తెలుసుకున్నప్పుడే ఆహారం శరీరానికి మేలు చేస్తుంది.

ఒక్కోసారి ఆరోగ్యకరమైన ఆహారం అయినప్పటికీ సరైన విధానంలో తీసుకోకపోవడం వల్ల అనారోగ్యాలకు కారణం అవుతుంది. చక్కని పోషకాహారంతో పాటు వ్యాయామం లాంటి ఆరోగ్యకరమైన అలవాట్లు మేలు చేస్తాయి. ఉదయాన్నే నిద్ర లేవగానే అధికంగా నీరు తీసుకోవడం, నడక లాంటి వ్యాయామాలు చేయడం, తిన్న తర్వాత కాస్త దూరం నడవడం, నూనె, మసాలా, కారం, ఉప్పు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవచ్చు.

మంచి ఆహారపు అలవాట్లతో కలిగే మంచితో పాటు చెడు ఆహారపు అలవాట్లతో కలిగే దుష్ప్రభావాలను తెలుసుకుని, ఆ మేరకు మంచి ఆహారపు అలవాట్లును అనుసరించడం ఎంతో అవసరం. ఆహారం పరిమాణంపై దృష్టి పెట్టాలి. ఎక్కువ తింటే భుక్తాయాసం, అజీర్తి, ఊబకాయంవంటి సమస్యలు తలెత్తొచ్చు. కాబట్టి.. తగినంత పరిమాణంలో ప్రతి రోజు.. వేళకి తినండి.

Leave a Comment