Vitamin B: ఈ ఒక్కటీ ఉంటే ఎనిమిది విటమిన్లు మీ శరీరంలో ఉన్నట్లే.. !

By manavaradhi.com

Published on:

Follow Us
Vitamin B complex

మన దైనందిన జీవితంలో విటమిన్ బి పాత్ర ఎంతో కీలకం. వీటి వల్ల శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా తయరౌతుంది. మనం రోజువారీ తీసుకునే ఆహారంలో అన్నీ ఉండక పోవచ్చు…. ఫ‌లితంగా ప‌లు రకాలు వ్యాధులకు దారితీస్తుంది. అందుక‌ని మీరు తీసుకొనే ఆహారంలో బీ విట‌మిన్లు ఉండేలా చూసుకోండి.

శ‌రీరంలో జీవ‌క్రియ‌లు సాఫీగా జ‌రుగాలంటే అవ‌స‌ర‌మైన ఎంజైమ్‌లు ఉత్తేజంగా ప‌నిచేయ‌డానికి విట‌మిన్లు చాలా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. శ‌రీరంలో ఏదైనా విట‌మిన్ లోపం క‌నిపించిన‌ట్ల‌యితే జీవ‌క్రియ‌లు కుంటుప‌డి వ్యాధి ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ‌తాయి. విటమిన్లు ద్రావణీయత ఆధారంగా కొవ్వులో కరిగే విటమిన్లు, నీటిలో కరిగే విటమిన్లు అని రెండు ర‌కాలుగా ఉంటాయి. విటమిన్ బి, సి లు నీటిలో కరిగే విటమిన్లు. మిగతా విటమిన్లు శరీరంలో ఉండే కొవ్వులో కరిగి జీవక్రియకు సహకరిస్తాయి. విటమిన్ బి అనేది మనం తినే అన్నం నుంచి మొదలుకొని కాయగూరలు, మాంసాహారం వరకు అన్నింట్లోనూ ఉంటుంది. ఈ విటమిన్ లోపం వలన వచ్చే ఇబ్బందులు ఏమిటో తెలియక చాలా మంది దీన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు.

విటమిన్ బి ని ఎనిమిది రకాలుగా వర్గీకరణ చేశారు. మొదటిది థయామిన్..దీన్నే విటమిన్ బి1 అంటారు. ధాన్యంను బియ్యంగా మరపట్టించి తింటుంటాం. బియ్యం తెల్లగా ఆకర్షణీయంగా కనబడుతూ .. బియ్యం పై పొరలు పూర్తిగా పోవడం వలన శరీరానికి బి1 విటమిన్ అందదు. దీని వలన బెరిబెరి అనే వ్యాధి వస్తుంది. ఇక రైబోఫ్లేవిన్ పేరుతో పిలిచేది విటమిన్ బి2. సాధారణంగా ఆవు పాలలో ఈ విటమిన్ చూడొచ్చు. దీని లోపం వలన నోటిపూత, నాలుక మంట, చర్మం పాలిపోవడం లాంటి సమస్యలు వస్తాయి.

విటమిన్ బి3ని నియాసిన్ లేదా నికోటిక్ అమ్లం అంటారు. ఇది జీవక్రియల్లో చురుకుగా వ్యవహరిస్తుంది. ఈ విటమిన్ లోపం వల్ల పెదాల వాపు, మచ్చలు, మందమైన చర్మంతో చేతులు లావెక్కడం లాంటి సమస్యలు వస్తాయి. ముల్లంగి, బఠాణీ, వేరుశనగ, చేపలు లాంటివి తినని వారిలో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి.

విటమిన్ B 5 లోపం వల్ల వెంట్రుకలు రాలిపోవడంతో పాటు కీళ్ళవాతం, కాళ్లు, చేతులు విపరీతంగా మండటం లాంటి సమస్యలకు దారితీస్తుంది. ఇది ఎక్కువగా మాంసం, గుడ్డు, కాలేయం, చేపలు వంటి కూరల్లో దొరుకుతుంది. శాఖాహారుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. విటమిన్ బి6 ఆహారాన్ని జీర్ణం చేసి… శరీరానికి శక్తి అందించడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది.

మాంసాహార పదార్ధాల్లోనే ఈ విటమిన్ బి6 ఎక్కువగా లభిస్తుంది. దీని లోపం వలన అజీర్తి… రక్తహీనతతో పాటు ఫిట్స్, బీపీ పెరగడం లాంటి సమస్యలు రావచ్చు. మన మెదడుపై తీవ్రంగా ప్రభావం చూపించే వాటిలో విటమిన్ బి7 పాత్ర ఎంతో కీలకం. శరీరంలో ఓ మోతాదు వరకు ఈ సల్ఫర్ ఉండటం అత్యవసరం. విటమిన్ బి7 లోపిస్తే మతిమరుపు, మానసిక రుగ్మతలు లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. టొమాటోలు, పాలు, గింజలు, కాయగూరల్లోనూ కొంతమేర బి విటమిన్ దొరుకుతుంది. అయితే చేపలు, మాంసంలో ఎక్కువగా బి 7 దొరుకుతుంది.

బి 9 విటమిన్… దీన్నే ఫోలిక్ యాసిడ్ అని కూడా అంటారు. గర్భిణీ అని నిర్ధారణ అయిన వెంటనే.. లేదా గర్భం దాల్చడానికి 90 రోజుల ముందు నుంచి ఈ ఫోలిక్ యాసిడ్ వాడమని వైద్యులు సూచిస్తుంటారు. మాంసాహారంతో పాటు మొక్కజొన్న, గోధుములు, మొలకెత్తిన గింజలల్లో ఈ ఫోలిక్ యాసిడ్ దొరుకుతుంది. ఇక బి 12 విటమిన్ ఇది కూడా శరీరానికి రక్తహీనత రాకుండా కాపాడుతుంది. బాలింతల్లో కొంతమందికి పాలు సరిగ్గా రాకపోవడానికి కారణం ఈ బి 12 విటమినే.

మ‌నం ఆరోగ్యంగా జీవించడానికి బి విట‌మిన్ల‌ అవసరం ఎంతైనా ఉంది. ఇది ప్రకృతిలో విరివిగా లభిస్తుంది. కాబట్టి మనం తినే ఆహారంలో విటమిన్ బి ఉందా లేదా అనే విషయాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి. సన్నబియ్యానికి బదులు దంపుడు బియ్యానికే ప్రాధాన్యత ఇవ్వాలి. జొన్నలు, రాగులను ఎక్కువగా మర పట్టించకూడదు. 60 ఏళ్ళు చాలామంది నీరసపడిపోతుంటారు. వృద్ధాప్యం వలన ఇక పనిచేయలేం అనుకుంటారు. కానీ ఎక్కువగా విటమిన్ బి లోపంవల్ల ఇలా జరుగుతుంది. కాబట్టి వయసు మీరిన వారు, గర్భిణీలు విటమిన్ బి గురించి అప్రమత్తంగా ఉండాలి. శాఖాహారులు కూరగాయలు, పండ్లు, ఆకు కూరలు, తృణధాన్యాలను ఎక్కువగా తీసుకోవాలి. చిలగడదుంపలతో పాటు డ్రై ఫ్రూట్స్ను కూడా పుష్కలంగా తీసుకోవడం వలన విటమిన్ బి లోపాన్ని తగ్గించుకోవచ్చు.

విటమిన్లు అనేవి శరీరానికి అవసరమైన అమైనో అమ్లాలు. మన శరీరంలో జీవక్రియలు జరగాలంటే విటమిన్లు కావాల్సిందే. విటమిన్ల లోపం ఏర్పడితే జీవక్రియలు మందగించి మనిషి నీరసం అవుతాడు.

Leave a Comment