Eyewear Guide – కళ్ళ జోళ్లు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

By manavaradhi.com

Published on:

Follow Us
Eyewear Guide

చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. వారు ఎప్పుడూ ఒకటే కళ్ళజోడు పెట్టుకుని ఉంటారు. అది వారి బ్రాండ్ గా కూడా మారిపోతుంది. మరికొంత మంది విషయానికి వస్తే, ఎప్పటికప్పుడు కళ్ళజోడు మారుస్తూ ఉంటారు. చదివేందుకు ఒకటి, పనిలో ఉన్నప్పుడు మరొకటి, ఎండ కోసం ఒకటి, డ్రైవింగ్ కోసం ఇంకొకటి… ఇలా మారుస్తూ ఉంటారు. నిజానికి మన జీవనశైలికి తగిన విధంగా కళ్ళజోడును మార్చడమే మంచి విధానం అనేది వైద్యుల మాట.

మనకు దృష్టి సమస్యలు ఉన్నప్పుడు, కంటిలోకి వెళ్ళే కాంతి, మార్గం మార్చుకుని లోపలకు ప్రవేశిస్తుంది. అయితే కళ్ళజోడు పెట్టుకోవడం ద్వారా, అవి కంటిలోకి కాంతి ప్రవేశించే దిశను మారుస్తాయి. కంటి లోపల రెటీనా అనే ప్రత్యేక భాగం దీన్ని తీసుకుని చూపు అందేలా చూస్తుంది. ఏ వస్తువు ఎక్కడ ఉందనే విషయాన్ని తెలియజేస్తుంది. దీని కోసం ప్రత్యేకమైన అద్దాలు అవసరం అవుతాయి. అయితే ఒక్కసారి అద్దాలు తీసుకున్నంత మాత్రాన, అవి జీవితాంతం పని చేయవు. మన కంటి సమస్య పరిస్థితుల్ని బట్టి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అందుకే కనీసం ఆరు నెలలకు ఓ సారి కంటి పరీక్షలు చేయించుకుని, తగిన అద్దాలు తీసుకోవడం తప్పనిసరి. ఎక్కువ కాలం ఒకటే అద్దాలు వాడడం వల్ల సమస్య తగ్గదు సరికదా, పెరుగుతూ పోతుంది.

అద్దాలు ఎప్పటికప్పుడు పరిస్థితిని బట్టి వాడడం వల్ల సమస్య నిదానంగా పెరిగి, ఇబ్బంది లేకుండా చూస్తుంది. కళ్ళద్దాల్లో సాధారణ అద్దాలు, దూరంగా ఉన్న వాటిని దగ్గరగా చూపే అద్దాలు, సమీపంలో ఉన్న వాటిని స్పష్టంగా చూపించే అద్దాలు, అల్ట్రావైలెట్ కిరణాలను అడ్డుకునే పూత పూసిన అద్దాలు, ఎండ కిరణాల నుంచి కాపాడే చలువ అద్దాలు, రాత్రి పూట స్పష్టంగా చూపించే అద్దాలు, ఇలా అనేక రకాలు ఉంటాయి. మన అవసరాలను బట్టి వాటిని ఎంచుకోవచ్చు.

అద్దాలు మాత్రమే కాకుండా, మన ఇతర అవసరాలు బట్టి వాటిలో ప్రత్యేకమైన అంశాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు పోటో క్రోమాటిక్ లెన్స్ విషయం తీసుకుంటే, ఇవి సాధారణ కళ్ళజోడులా పని చేసే చలువు అద్దాలు. అదే విధంగా ఈ మధ్యకాలంలో గీతలు పడకుండా రక్షణ ఇచ్చే అద్దాలు కూడా వస్తున్నాయి. కళ్ళు మరింత సున్నితం అయినప్పుడు, టింట్స్ తో కూడిన అద్దాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే మన అవసరాన్ని బట్టి, బడ్జెట్ ను బట్టి, పరిస్థితిని బట్టి… వైద్యుల సలహా మేరకు అద్దాలు తీసుకోవచ్చు.

వివిధ వయసుల వారికి తగ్గట్టుగా ఫ్రేమ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్లాస్టిక్, మెటల్, ప్లాస్టిక్ మెటల్ కలయిక, టైటానియం-కార్బన్ గ్రాఫైట్ వంటి ప్రత్యేకమైన లోహాలతో తయారు చేసిన అనేక రకాల ఫ్రేములు లభిస్తున్నాయి. వీటిలో మన ముఖానికి ఏది నప్పుతుందో, ఏది మరింత సౌకర్యవంతంగా ఉంటుందో చూసుకుని, ఎంచుకోవాలి. వాటిని ఒక్కసారి ధరించినప్పుడు చెవులు లేదా ముక్కు దగ్గర రుద్దుకుంటోందా, సులభంగా పడుతోందా లేదా లాంటి విషయాలు చూసుకోవాలి. కొన్ని సమయాల్లో వైద్యుని సలహా కూడా తీసుకోవాలి.

మీ ముఖం అకృతిని బట్టి, కళ్ళను బట్టి ఎన్నుకోవలసి ఉంటుంది. కొన్ని రకాల కళ్ళజోళ్ళకు ప్రత్యేకమైన పనులు ఉంటాయి. కంప్యూటర్ మీద పని చేసే వారి కోసం ప్రత్యేకంగా యాంటీ గ్లేర్ అద్దాలు అందుబాటులో ఉన్నాయి. మీకు కంటి సమస్యలు ఉన్నప్పటికీ, వాటిలో యాంటీ గ్లేర్ అద్దాలు లభిస్తాయి గనుక, వాటిని ఎంచుకుని వాడవచ్చు. ఎక్కువ సమయం కంప్యూటర్ మీద దృష్టి కేంద్రీకరించినప్పుడు కొన్ని సమస్యలు ఎదురు కావడానికి ఆస్కారం ఉంది గనుక, ఆ సమస్యలు రాకుండా వీటిని వాడవచ్చు.

ప్రస్తుతం డ్రైవింగ్ కోసం కూడా ప్రత్యేకమైన కంటి అద్దాలు అందుబాటులో ఉన్నాయి. కంటికి గాలి తగలకుండా, దుమ్ము పడకుండా ఇవి ప్రత్యేకమైన పూతతో ఉంటాయి. రాత్రిళ్ళు వాహనాలు నడిపే వారికి మరో రకమైన అద్దాలు ఉన్నాయి. అలాగే చదువుకునేందుకు పుస్తకం దగ్గరగా ఉంటుంది కాబట్టి, సమస్యలు రాకుండా సరైన అద్దాలు అందుబాటులో ఉన్నాయి. అయితే కొన్ని రకాల అద్దాలు బయట ఇతర షాపుల్లో లభిస్తాయి. అలాంటి వాటిని వాడడం వల్ల లేని పోని సమస్యలు కొనితెచ్చుకోవలసిన వస్తుంది గనుక, వైద్యుల సలహా లేకుండా ఎలాంటి అద్దాలు వాడకూడదు.

కొన్ని రకాల క్రీడల్లో కచ్చితంగా గాగుల్స్ అవసరం అవుతాయి. క్రీడలు ఆడేవారు రోజు వారీ కళ్ళద్దాలు వాడడం మంచిది కాదు. అదే విధంగా నిర్మాణం, తయారీ, గనుల తవ్వకం… లాంటి వాటిలో పని చేసే వారికి ప్రత్యేకమైన కంటి అద్దాలు ఉంటాయి. ఏదైనా సరే… వైద్యుని సలహా తీసుకుని వాడడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి.

Leave a Comment