Foods Relive Constipation:మలబద్ధకం వేధిస్తోందా? ఈ 6 ఆహారాలు తీసుకుంటే సమస్య తీరుతుంది!

By manavaradhi.com

Published on:

Follow Us
foods to relieve constipation fast

ప్రస్తుత కాలంలో మారిపోతున్న ఆహారపు అలవాట్లు ఎన్నో సమస్యలను తీసుకొస్తున్నాయి. అలాంటి వాటిలో మలబద్ధకం కూడా ఒకటి. మలబద్ధకం ఏర్పడినప్పుడు మలం చాలా గట్టిగా తయారౌతుంది. విసర్జన సమయంలో నొప్పి కూడా ఉంటుంది. కడుపు ఉబ్బరంగా ఉన్న భావన కలుగుతుంది. పెద్ద పేగు అధికంగా నీటిని పీల్చుకోవడం లేదా పెద్ద పేగుల్లో కండరాల కదలికలు తగ్గిపోవడం వల్ల మలబద్ధకం ఏర్పడుతుంది.

తగినంత నీరు తీసుకోకపోవడం, ఆహారంలో ఫైబర్ లేకపోవడం, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండడం, ఆహారంలో చక్కెర శాతం పెరగడం లాంటి అనేక కారణాల వల్ల సమస్యలు పెరుగుతాయి. ముఖ్యంగా ఆహారం ద్వారానే ఈ సమస్యలు అధికంగా ఉంటాయి. ఎక్కువ కొవ్వు పదార్థాలు కలిగిన ఆహారం తీసుకోవడం, తగినంత వ్యాయామం లేకపోవడం, మల విసర్జనను వాయిదా వేయడం, ఎక్కువ ఒత్తిడితో కూడిన జీవనశైలి, కొన్ని రకాల ఆహార పదార్థాలు పడక పోవడం, కొన్ని రకాల మందులు వాడడం లాంటి కారణాల వల్ల మలబద్ధకం ఏర్పడుతుంది.

రోజూ ఓ పద్ధతి ప్రకారం వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్ళకపోతే, సమస్యలు తప్పవు. అలాంటప్పుడు విసర్జన క్రియ సరిగా ఉండేలా చూసుకోవడం చాలా అవసరం. రోజూ వ్యాయామం చేయడం, మంచి ఫైబర్ ఉండే అహారాన్ని తీసుకోవడం, అధికంగా ద్రవ పదార్థాలు తీసుకోవడం వల్ల మలబద్ధకం దరి చేరకుండా ఉంటుంది.

మలబద్ధకం బాధిస్తున్నవారు మొట్టమొదటగా చెయ్యాల్సింది ఆహారంలో మార్పులు. పీచు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవటం ఆరంభించాలి. పొట్లకాయ, చిక్కుడుకాయలు, బీరకాయ, వంటివి, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.నిత్యం పచ్చికూర ముక్కల వంటివి తీసుకోవటం మరీ మంచిది. వాస్తవానికి మలబద్ధకం బారినపడకుండా నివారణగా కూడా ఇవి మేలు చేస్తాయి.

రాస్ప్ బెర్రీస్లో కాల్షియం, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఇవి మన దగ్గర తక్కువగా దొరుకుతాయి గనుక, రాస్ప్ బెర్రీ జ్యూస్ మీద ఆధారపడవచ్చు. తర్వాత అధికంగా ఉపయోగ పడేవి బేరి పండ్లు. ఇందులో విటమిన్స్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. పుచ్చకాయ కూడా జీర్ణక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో 92 శాతం నీటితో పాటు యాంటి ఆక్సిడెంట్స్, విటమిన్ ఎ, బి, సి తోపాటు లైకోపిని అధికంగా ఉంటుంది. దీని వల్ల జీర్ణక్రియ సక్రమంగా సాగుతుంది.

అల్బకరా పండ్లలో ఫైబర్ తో పాటు, సార్బిటాల్ ఉంటుంది. దీని వల్ల అధికంగా నీరు తీసుకోవడం సాధ్యమౌతుంది. ఆకుకూరలు కూడా మంచి ఖనిజాలను కలిగి ఉండి, జీర్ణ క్రియను సక్రమంగా నిర్వహించడంలో కీలక పాత్రవహిస్తాయి. బంగాళదుంప ద్వారా ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇందులోనూ రెసిస్టెంట్ స్ట్రాచ్ ఉంటుంది. దీని వల్ల కూడా జీర్ణ క్రియ సక్రమంగా సాగుతుంది.

బీన్స్, అలసందలు, ఉలవలు, పెసలు లాంటివి అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సాఫిగా సాగుతుంది. అదే విధంగా తృణ ధాన్యాలు, పప్పుదినుసులు, ఓట్స్ లాంటివి తీసుకోవడం వల్ల జీర్ణ క్రియలో ఉండే ఇబ్బందులు తొలగి పోతాయి. వీటిలో అధికంగా ఫైబర్ ఉండడంతో పాటు, అధికంగా నీటిని పీల్చుకునే గుణం వల్ల త్వరగా జీర్ణం అయ్యి, తిన్న వారికి ఆకలి కూడా బాగా వేస్తుంది. చెడు కొలస్ట్రాల్ ను తగ్గించి, ప్రొటిన్స్, కాల్షియం, ఇనుమును అందించి శరీరానికి మంచి పోషణ కూడా ఇస్తాయి.

కొన్ని రకాల ద్రవ పదార్థాలు కూడా శరీరంలో నీటి స్థాయిని పెంచుతాయి. అధికంగా నీరు, పండ్ల రసాలు, సూపులు, నీరు అధికంగా ఉండే పండ్లను తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగు పడుతుంది. చాలా మంది సులువైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల బాగా జీర్ణం అవుతుందని భావిస్తారు. నిజానికి పేగుల్లో జీర్ణ క్రియ సక్రమంగా జరగాలంటే నీరు ఉండాలి. నీటితో పాటు, ఫైబర్ ఉంటేనే జీర్ణక్రియ సక్రమంగా సాగుతుంది. అన్ని సమయాల్లో ఆహారం మాత్రమే జీర్ణక్రియ మీద ప్రభావాన్ని చూపదు.

కొన్ని సమయాల్లో వ్యాయామం లేకపోవడం, అధిక ఒత్తిడి తదితర అంశాలు కారణం గనుక, సాధారణ పరిస్థితుల్లో మంచి ఆహారాన్ని తీసుకున్నప్పటికీ, ఇతర కారణాల వల్ల ఇబ్బందులు బాధిస్తుంటే వెంటనే వైద్యుని సంప్రదించి మంచి పరిష్కారాన్ని పొందాలి. వారంలో కనీసం మూడు మార్లు విసర్జన క్రియ జరగలేదంటే తీవ్రమైన మలబద్ధకం ఉన్నట్లు గుర్తించాలి. సాధారణ మలబద్ధకానికి ఆహారంలో మార్పులు సరిపోతాయి. తీవ్రమైన సమస్యకు వైద్యుల ద్వారా పరిష్కారాన్ని పొందాలి.

మలబద్ధకాన్ని సాధ్యమైనంత వరకూ ఆహారం మార్చుకోవటం, వ్యాయామం చెయ్యటం వంటి జీవనశైలి మార్పుల ద్వారానే అధిగమించటం మంచిది. వైద్యులతో చర్చిస్తే అవసరమైతే ఇతరత్రా వ్యాధులకు వేసుకుంటున్న మందులును మారుస్తారు. విరేచనం కావటానికి నిత్యం మందులను ఆశ్రయించేబదులు ఈ మార్పులతో నెగ్గుకు రావటం ఉత్తమం.

Leave a Comment