Stomach Cancer – జీర్ణాశయ క్యాన్సర్‌ ఎందుకొస్తుంది, నివారణ మార్గాలేంటి..?

By manavaradhi.com

Updated on:

Follow Us

ఒకప్పుడు క్యాన్సర్ గురించి తెలిసిన వారు చాలా అరుదు… అదే ప్రస్తుత రోజుల్లో క్యాన్సర్ వ్యాధి సాధారణ వ్యాధిగా మారిపోయింది. ప్రజల్లో ఉన్న నిర్లక్ష్య ధోరణి, క్యాన్సర్ పట్ల అవగాహనాలోపమే క్యాన్సర్ మరణాల సంఖ్య పెరిగేందుకు దోహదపడుతోంది. రకరకాలుగా, వివిధ శరీర భాగాలకు క్యాన్సర్ వస్తోంది.

శరీరంలో కణ విభజనలు.. క్రమ పద్ధతిలో నియంత్రించబడతాయి. కొన్ని సందర్భాలలో కణాల పెరుగుదలలో నియంత్రణ లేనందువల్ల.. కణాలు చాలా వేగంగా, అస్తవ్యస్తంగా విభజన చెంది కణ సమూహాలను ఏర్పరుస్తాయి. ఈ కణసమూహాలనే కంతి అంటారు. అలాంటి ప్రమాదకరమైన వాటిని కేన్సర్ అని పిలుస్తారు. ‘ గ్లాండ్యూలార్’ అనే కణాలలో జీర్ణాశయ క్యాన్సర్ ప్రారంభమవుతుంది. ఒక్కో సారి జీర్ణాశయంలోని పైపోరలు ఇన్‌ఫెక్షన్ల బారిన పడి క్యాన్సర్‌కు కారకమవుతాయని వైద్యులంటున్నారు. హెచ్‌ పైలోరి ఇన్‌ఫెక్షన్లు ఉన్నవారిలో జీర్ణాశయంలో లింఫోమాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే జీర్ణాశయ క్యాన్సర్ ఒక్కసారిగా రాదు. జీర్ణాశయంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తాయి. జీర్ణాశయంలో క్యాన్సర్ కణాలు కార్డియా అనే భాగంలో ప్రారంభమవుతుంది. అవి జీఈ జంక్షన్ అనే ప్రాంతంలో అభివృద్ధి చెందుతాయి. ఒక్క జీర్ణాశయంలోనే కాకుండా దాని పక్కనున్న అవయవాలకూ వివిధ రకాలుగా క్యాన్సర్ విస్తరించే అవకాశం ఉంటుంది.

జీర్ణశయ క్యాన్సర్లు ముఖ్యంగా… అడినో కార్సినోమా, లింఫోమా, గ్యాస్ట్రో ఇన్‌టెస్టైనల్ స్టోమల్ ట్యూమర్, కార్సినోయిడ్ ట్యూమర్.. గా కనిపిస్తాయి. జీర్ణాశయానికి వచ్చే క్యాన్సర్లో 90 శాతానికి పైగా అడినో కార్సినోమా రకానికి చెందినవే. ఇవి జీర్ణాశయంలోపల గ్రంథి కణాలకు అభివృద్ధి చెందుతాయి. లింఫోమా రకం క్యాన్సర్ … జీర్ణాశయం గోడల్లో కనిపిస్తాయి. ఎలాంటి రకం లింఫోమా అనే దాన్ని బట్టి చికిత్స ఉంటుంది. గ్యాస్ట్రో ఇన్‌టెస్టినల్ స్టోమల్ ట్యమూర్లు … చాలా అరుదుగా వస్తుంటాయి. ఇవి కూడా ప్రాథమిక దశలో జీర్ణాశయ గోడలకు వచ్చే క్యాన్సర్ కణతులుగా చెప్పవచ్చు. ఆ తరువాత ఇవి జీర్ణాశయంలో ఇతర భాగాలకు వ్యాపిస్తాయి. జీర్ణాశయంలోని హార్మోన్లను తయారు చేసే కణాల వల్ల కార్సినోయిడ్ ట్యూమర్లు ఏర్పడతాయి. ఇవి ఇతర శరీర అవయవాలకు వ్యాపించవు.

పుట్టుకతో ఉండే జన్యు లోపాలు, కుటుంబంలో పెద్దలకు ఈ వ్యాధి ఉన్నట్లయితే… స్టమక్ క్యాన్సర్ వచ్చే అవకాశం. ఏ గ్రూప్‌ బ్లడ్‌ ఉన్న వారికి ఈ క్యాన్సర్‌ సోకే అవకాశాలు ఎక్కువ. పొగ తాగటం, మద్యపానం, వేపుడు ఆహారం తినేవారికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హెలికోబాక్టర్‌ పైలోరి వంటి సూక్ష్మక్రిముల ఇన్‌‌ఫెక్షన్‌‌తో కడుపు చెడి క్యాన్సర్‌‌కు దారి తీయవచ్చు. గ్యాస్ట్రైటిస్‌ వంటి సమస్యలు ఎక్కువ కాలం వేధిస్తే, చికిత్స లేకపోవటం కారణంగా క్యాన్సర్‌ రూపం దాల్చవచ్చు.

*జీర్ణాశయ క్యాన్సర్ వ్యాధి వచ్చిన వారిలో సాధారణంగా ఆహారం మింగటం కష్టంగా ఉంటుంది. ఆకలి ఉండదు. బరువును కోల్పోతారు.

  • పొత్తి కడుపులో నొప్పిరావటం
  • కడుపు నిండిన భావన కలగటం
  • తిన్న ఆహార పదార్థాలు రుచి అనిపించకపోవటం
  • ఛాతీలో మంట రావటం
  • వికారం, వాంతులు, కొన్ని సార్లు రక్తస్రావం
  • రక్తాన్ని వాంతి చేసుకుంటారు
  • యాస్పిరేషన్ న్యూమోనియా లక్షణాలు కనిపిస్తాయి.
  • కడపుపై తడిమితే గడ్డల్లాంటివి తగులుతుంటాయి.
    కొన్నిసార్లు కేన్సర్ కణితి తాలూకు రక్తం కొన్నిసార్లు బయటికి రాకుండా పేగుల్లోకి వెళ్లిపోయి రక్తం కూడా జీర్ణమవుతుంది. ఫలితంగా నల్లటి విరేచనాలు వస్తాయి. అప్పటికే కేన్సర్ ముదిరిపోయి ఉంటే పొట్ట ఉబ్బిపోవడం, పొట్టలోకి నీరు రావడం, జాండిస్ రావడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

జీర్ణాశయంలో క్యాన్సర్‌.. ఏ భాగంలో ఉందో, ఏ భాగానికి పాకిందో ఎండోస్కోపి ద్వారా నిర్ధారించుకోవచ్చు. బయాప్సి పరీక్షల్లో కూడా క్యాన్సర్‌ను కనిపెట్టవచ్చు. సిటీ స్కాన్‌ గానీ, పెట్ సిటీ స్కాన్ గానీ అవసరమవుతుంది. వీటి ద్వారా క్యాన్సర్ కణతి జీర్ణాశయంలోనే ఉందా..? అందులో నుంచి బయటకొచ్చి ఇతర భాగాలకు పాకిందా..? అనేది తెలుసుకోవచ్చు. వీటన్నింటితో పాటు సీఈఏ పరీక్ష కూడా చేయించుకోవాలి.

జీర్ణాశయ క్యాన్సర్ నివారణ… మంచి ఆహార పదార్థాలతోనే సాధ్యమవుతుంది. విటమిన్లు, ఖనిజ లవణాలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవాలి. వీటితో పాటు పండ్లు, అన్ని రకాల ఆకుకూరలు, కాయగూరలు ఆహారంలో భాగం చేసుకోవాలి. మత్తు పానీయాలు, ధూమపానం వంటి చెడు అలవాట్లను మానుకోవాలి. బీర్, మద్యం, ఉప్పు, నిల్వ చేసిన ఆహారపదార్ధాలను తీసుకోవడం మానేయాలి. కాలిఫ్లవర్, బంగాళదుంప, ఉల్లిపాయలకు.. స్టమక్ క్యాన్సర్ రాకుండా అడ్డుకునే లక్షణాలు ఉన్నట్లు చైనా పరిశోధనల్లో తేలింది. అన్ని రకాల కూరగాయల్లో సి విటమిన్ ఉంటుంది. బంగాళదుంపల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ పొట్టలోని కణజాలం మీద ఒత్తిడి పడకుండా కాపాడతాయి. ప్రతిరోజూ 50 గ్రాముల సి విటమిన్ తీసుకుంటే 8 శాతం క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందని, 100 గ్రాముల పండ్లు తినడం వల్ల 5 శాతం క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందని సర్వేలు చెబుతున్నాయి. వ్యాధి బయటపడగానే ఆదుర్దా చెందకుండా… వైద్యుడ్ని సంప్రదించడం మంచిది. వైద్యుడి సూచనల మేరకు జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి.

Leave a Comment