రోజుకో ఆపిల్ తినండి. . ఆరోగ్యంగా ఉండండి.. ఇది మనకు సాధారణంగా వైద్యులు సూచించే మాట. మరి ఆపిల్ తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనేది చాలా మందికి తెలియదు. అసలు ఆపిల్ లు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
రోజుకో ఆపిల్ తింటే .. వైద్యున్ని కలిసే అవసరమే రాదు. ఇది చాలా కాలంగా మనం వింటున్న మాట. ఐతే నిజంగానే ఆపిల్ తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయా అని చాలా మందికి డౌట్ రావచ్చు. నిజంగానే ఆపిల్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆపిల్ లో ఖనిజలవణాలు , విటమిన్లతోపాటు ఫైబర్ కూడా పుష్కలంగా లభిస్తుంది. దీంతో ఆరోగ్యానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా ఆపిల్ లో సోడియం తక్కువగా ఉంటుంది. అలాగే ఫ్యాట్ , కొలెస్ట్రాల్ కూడా తక్కువగానే ఉంటాయి. దాని నుంచి విటమిన్ C అధికంగా లభిస్తుంది.
ఒక్క ఆపిల్ తీసుకుంటే దాదాపు 100 కేలరీల శక్తి వస్తుంది. అందులో 25 గ్రాముల వరకు పిండిపదార్థాలు లభిస్తే.. మరో 19 గ్రాములు చక్కెర .. 4 గ్రాముల ఫైబర్ దొరుకుతుంది. అలాగే ఆపిల్స్ లో ఎక్కువ శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఆపిల్స్ లో ప్లేవనాయిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా పెక్టిన్ అనే ఫ్లేవనాయిడ్ . . జీర్ణశక్తి ప్రక్రియలో బాగా ఉపయోగపడుతుంది. ఐతే ఆపిల్స్ ను ఎప్పుడూ పొట్టుతోనే తినాలి. ఒకవేళ తొక్క తీసేసి తింటే . . దాని ద్వారా పీచుపదార్థంతోపాటు ఫ్లేవనాయిడ్లను కోల్పోవాల్సి వస్తుంది.
ఆపిల్ తిన్నప్పుడు త్వరగా పొట్ట నిండిన ఫీలింగ్ కలుగుతుంది. అలాగే ఆపిల్ జీర్ణమయ్యేందుకు చాలా సమయం తీసుకుంటుంది. ఫలితంగా త్వరగా ఆకలి వేయదు. ఇది బరువు తగ్గాలనుకునే వారికి చాలా మంచిది. వారు త్వరగా .. ఆరోగ్యకరంగా బరువు తగ్గేందుకు వీలవుతుంది. అలాగే ఆలస్యంగా జీర్ణమయ్యే ఆపిల్ ద్వారా యాసిడ్ రెఫ్లక్షన్ ఏర్పడే అవకాశం లేదు. ఆపిల్ లో ఉండే ఫైబర్ వల్ల . . ప్రేవులు శుభ్రంగా ఉంటాయి. మలబద్ధకం లాంటి సమస్యలు వచ్చే అవకాశం చాలా తక్కువ .

ఆపిల్ తొక్క ద్వారా కూడా ప్రయోజనాలు ఉన్నాయి. అంటే తొక్కలో ఉండే పీచుపదార్థం రక్తనాళాలు చిట్లిపోకుండా రక్షిస్తుంది. ఫలితంగా గుండె సంబంధిత వ్యాధులు రాకుండా హార్ట్ స్ట్రోక్ రాకుండా ఉంటుంది. అలాగే శరీరంలోని డీఎన్ఏను ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుంచి రక్షిస్తుంది. ఒకవేళ శరీరంలో ఆక్సిడేటివ్ డ్యామేజ్ జరిగితే . . కేన్సర్ కు దారి తీసే అవకాశం ఉంటుంది. అంటే ఆపిల్స్ లో ఉండే యాంటీఆక్సిడెంట్లు కేన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయన్నమాట. అంతే కాదు అవి క్లోమ గ్రంథిని కూడా కాపాడతాయి. క్లోమగ్రంథికి రక్షణ లభించడం వల్ల . . టైప్ -2 మధుమేహానికి దారి తీసే పరిస్థితులకు అడ్డుకట్ట పడుతుంది.
రోజూ ఆపిల్ తినడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. మెదడు చురుగ్గా పని చేస్తుంది. మతిమరుపు సమస్య అల్జీమర్స్ నుంచి దూరంగా ఉండవచ్చు. అంతే కాదు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రేవులు ఆరోగ్యంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు రోజూ ఆపిల్ తినడం మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఆపిల్స్ లో చక్కెర ఉంటుంది. దీని వల్ల చక్కెర వ్యాధి ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం లేదు. ఎందుకంటే ..బయట నుంచి తీసుకున్న చక్కెరకు దీనికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి మధుమేహం ఉన్న వారు కూడా రోజుకో ఆపిల్ ను నిరభ్యంతరంగా తినవచ్చు.
ఆపిల్ తో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ .. కొన్ని ప్రమాదాలు కూడా దాని వెంబడే పొంచి ఉంటాయి. ఇందుకోసం కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఆపిల్ ఎక్కువగా తింటే . . బరువు పెరిగే ప్రమాదం ఉంది. అంతే కాదు ఆపిల్ పంటకు పురుగులు రాకుండా .. ఎక్కువగా పెస్టిసైడ్స్ వాడతారు . ఇవి వాటి తొక్కపైనే నిల్వ ఉండే అవకాశం ఉంది. కాబట్టి .. ఆపిల్ తినేటప్పుడు చాలా శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే ఆపిల్ విత్తనాలు చాలా ప్రమాదం . ఇవి కడుపులోకి వెళ్లిన తర్వాత సైనైడ్ గా మారే అవకాశం ఉంది.








