Health:ఆస్పిరిన్ టాబ్లెట్‌ గుండె పోటు ప్రమాదాన్ని తగ్గిస్తుందా.. !

By manavaradhi.com

Published on:

Follow Us
When using aspirin Precautions to follow

గుండె సంబంధ సమస్యలతో బాధ పడే వారు, మరియు ఇతర సమస్యలతో సతమతమయ్యే వారు ఆస్ప్రిన్ టాబ్లెట్లు తీసుకుంటూ ఉంటారు. వీటిలో వైద్యులు సూచించి తీసుకునే వారు కొందరైతే, సొంత వైద్యంగా తీసుకునే వారు మరి కొందరు. ఇలా రోజూ ఆస్ప్రిన్ తీసుకోవడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువంటున్నారు వైద్యులు.

ఆస్ప్రిన్ తరచూ తీసుకోవడం వల్ల గుండె సమస్యల నుంచి రక్షణ పొందవచ్చనే విషయం మనం వింటున్న విషయమే. చాలా మంది ఇళ్ళలో ఉండే ఈ ఔషధం అనేక ఇతర సమస్యల నుంచి రక్షణ ఇస్తుంది కూడా.. అనేక ప్రయోజనాలు ఉండడం వల్ల మరో ఆలోచన లేకుండా… స్ట్రిప్పుల కొద్దీ యాస్ప్రిన్ టాబ్లెట్లను ఆహారంతో పాటు తీసేసుకుంటున్నాం. మరికొందరైతే వైద్యుల సలహా కూడా లేకుండా ఇష్టం వచ్చినట్లు దీన్ని వాడేస్తున్నారు. ఇది అద్భుతమైన ఔషధమే కావచ్చు, స్టెరాయిడ్స్ అవసరం రానీయకుండా చాలా సమస్యల నుంచి బయట పడేసే మార్గమే కావచ్చు… అయితే దీని విషయంలో వైద్యులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే మధ్యవయసు వారిలో దీన్ని గుడ్డిగా వాడటం తగదని ప్రముఖ వైద్య నిపుణుల బృందం ‘యూఎస్‌ ప్రివెంటివ్‌ సర్వీసెస్‌ టాస్క్‌ఫోర్స్‌’ తాజాగా సిఫారసు చేసింది. ఇదేమీ అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. రకరకాల అధ్యయనాలు, అనుభవాలను శాస్త్రీయంగా పరిశీలించి, సమీక్షించి చేసిన సిఫారసు. ఇలాంటి మార్పులు గతం నుంచీ వస్తున్నవే.

జబ్బులు వచ్చాక బాధపడే కన్నా రాకుండా చూసుకోవటమే ఉత్తమం. కాబట్టే నివారణ చర్యలకు అంత ప్రాధాన్యం. ఇందుకు మందులూ తోడ్పడతాయి. వీటిల్లో తక్కువ మోతాదు ఆస్ప్రిన్‌ ఒకటి. ఇది తొలిసారి పక్షవాతం, గుండెపోటు బారినపడకుండా కాపాడుతుందని చాలాకాలంగా భావిస్తూ వస్తున్నారు. తక్కువ మోతాదు ఆస్ప్రిన్‌ చాలాకాలంగా పెద్ద వరంగానే ఆదుకుంది. దీంతో గుండెజబ్బులు, పక్షవాతం ముప్పు తగ్గటం నిజమే. అయితే కొందరికి లోలోపల రక్తస్రావమయ్యే ముప్పు లేకపోలేదు. ఇలాంటి ముప్పు తక్కువే అయినా వయసుతో పాటు పెరుగుతూ వచ్చే అవకాశముంది.

ఇప్పటికే గుండెపోటు, పక్షవాతం వచ్చినవారు మరోసారి వీటి బారినపడకుండా ఆస్ప్రిన్‌ బాగానే ఆదుకుంటుంది. దీని విషయంలో వైద్య నిపుణుల బృందం ఎలాంటి మార్పులు చేయలేదు. తొలిసారి గుండెపోటు, పక్షవాతం నివారణ విషయంలోనే కొత్త సిఫారసు చేసింది. అరవై ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసు గలవారికి తొలిసారి గుండెపోటు, పక్షవాతం నివారణకు ఆస్ప్రిన్‌ వాడొద్దని గట్టిగా సూచించింది. అదే 40-59 ఏళ్ల వారైతే డాక్టర్‌ సలహా మేరకు లాభ నష్టాలు బేరీజు వేసుకొని ఆరంభించాలని పేర్కొంది.ఆస్ప్రిన్‌ అనేది విటమిన్‌ మాత్ర వంటిది కాదనే విషయాన్ని ఇది స్పష్టంగా వెల్లడించి నట్టయ్యింది. ఆస్ప్రిన్‌తో లాభాలు ఉన్నాయి. అలాగని నష్టాలు లేకపోలేదు. కాబట్టి వయసు మీద పడిందని ఎవరికివారు ఆస్ప్రిన్‌ వేసుకోవటానికి బదులు డాక్టర్‌తో చర్చించి ఆరంభించటం మేలని నిపుణులు చెబుతున్నారు.

రోజూ తీసుకున్నప్పటికీ లేదా అప్పుడప్పుడూ తీసుకున్నప్పటికీ యాస్ప్రిన్ డోస్ తగ్గించుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. దీని వల్ల సమస్యల శాతాన్ని చాలా వరకూ తగ్గించుకోవచ్చు. అయితే ఆస్ప్రిన్ సమస్య నుంచి బయట పడే మార్గం మరొకటి లేదు కాబట్టి వైద్యుని సలహా మేరకు మాత్రమే తీసుకోవడం ఉత్తమం. కుటుంబంలో గుండె సంబంధ సమస్యలు తరచూ ఎదురౌతున్నప్పుడు అలాంటి వారికి యాస్ప్రిన్ తీసుకోక తప్పదు. అదే విధంగా ఇప్పటికే గుండె సమస్యలు ఎదుర్కొన్న వారికి సైతం ఇది తప్పని ఔషధం. ఇప్పటికే గుండె సమస్యలు ఉన్నవారు, రక్తపోటు సమస్యను ఎదుర్కొంటున్న వారు, గుండె సమస్యలతో పొగ తాగే అలవాటు ఉన్న వారు వీటిని వాడక తప్పని పరిస్థితి. అయితే వీటిని వాడితే అవన్నీ చేయవచ్చని కాదు, వాడక తప్పని పరిస్థితిగానే చెప్పుకోవాలి. ఇలాంటి సమస్యలు ఉన్న వారు వైద్యుని సలహా మేరకు తీసుకోవాలి.

గుండె సమస్యలు ఉన్న వారిలో ఎవరు దీన్ని తీసుకోకూడదనే విషయాన్ని సులభంగానే గ్రహించవచ్చు. 20 నుంచి 40 ఏళ్ళ మధ్య వయసు ఉన్న వారు దీన్ని తీసుకోవలసిన అవసరం లేదు. అయితే రిస్క్ మరింత పెరిగితే, తీసుకోకతప్పదు. ఈ రెండు రకాల వ్యక్తులు కాక, మూడో రకం వ్యక్తులు కూడా ఉంటారు. వీరిలో వంశపారంపర్యంగా సమస్యలు ఉంటాయి. డిమెన్షియా, కలోన్ క్యాన్సర్, గుండె సమస్యలు ఉన్నప్పుడు వీటిని ఎట్టి పరిస్థితుల్లో వారు ఆపకుండా వాడవలసి ఉంటుంది. అంతర్జాతీయ వైద్య సంస్థలు సైతం తప్పని సరి పరిస్థితుల్లో తీసుకోవలసి వచ్చినా ఆస్ప్రిన్ మంచిది కాదనే విషయాన్ని చెబుతున్నాయి.అదే విధంగా స్త్ర్లీలు, గర్భిణులు, పిల్లలు వీటికి దూరంగా ఉండడం ఎంతో మేలు చేస్తుంది. వైద్యుని సలహా మేరకు మాత్రమే ఎవరైనా ఆస్ప్రిన్ తీసుకోవాలి.

Leave a Comment