ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మందిలో కనిపించే ప్రధాన సమస్య మలబద్దకం. స్కూల్‌కెళ్లే చిన్నారుల్లో అయితే ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. మారుతున్న జీవనవిధానాల కారణంగా.. బయటి ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య తీవ్రరూపం దాల్చుతుంది. అసలింతకీ మలబద్దకం సమస్య ఎందుకు వస్తుంది..?
ఉదయాన్నే మలవిసర్జన సక్రమంగా జరిగితే రోజంతా అన్ని పనులను ఎలాంటి చికాకులు లేకుండా పూర్తిచేసుకోవడానికి వీలుంటుంది. అంతటి ముఖ్యమైన పనిని పూర్తిచేయడానికి బద్దకించడం వల్ల సమస్య మరింత జఠిలంగా మారి శరీరంలో విషపదార్థాలు పేరుకుపోయి వివిధ ఆరోగ్య సమస్యలు రావడానికి కారణమవుతుంది. మామూలుగా ప్రతి మనిషికీ ఒక పద్ధతిలో మల విసర్జన జరుగుతుంది. సహజమైన పద్ధతిలో మార్పు సంభవించి, జరగాల్సిన సమయంలో మలవిసర్జన జరగనట్లయితే దానిని మలబద్ధకంగా భావించాలి. సాధారణంగా మూడు రోజులకు మించి మలవిసర్జన కాకుండా ఉంటే దానికి కారణం తెలుసుకొని చికిత్స తీసుకోవడం ఉత్తమం. పెద్దపేగు ఎక్కువ నీటిని పీల్చుకోవడం లేదా పెద్దపేగు కండరాలలో కదలికలు తగ్గిపోవడం వల్ల పేగులో మలం కదలికలు చాలా నెమ్మదిగా కదిలి మలబద్దకం ఏర్పడుతుంది. మలబద్దకంతో ముఖ్యంగా జీర్ణాశయ వ్యాధులు, పైల్స్, ఫిషర్స్, తలనొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
మారిన జీవన విధానం, చిరుతిండ్లకు ఎక్కువగా అలవాటుపడటం, సమయానికి ఆహారం, నీరు తీసుకోకపోవడం, పీచు ఉన్న పదార్థాలు తినకుండా రోజులో ఎక్కువసార్లు ఫాస్ట్ఫుడ్స్ తీసుకోవడం వలన మలబద్దకం ప్రధాన సమస్యగా తీవ్రరూపం దాల్చుతుంది. నీళ్లు తగినంత తీసుకోకపోవడం, ఆహారంలోఎక్కువ ఫైబర్ లేకపోవడం, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండడం. తగినన్ని నీళ్లు తీసుకోకుండా, ఆహారంలో చక్కెరల శాతం పెరిగితే పెరిస్టాలిక్ కండరాలలో కదలికలు చాలా నెమ్మదించి మలబద్దకం సమస్య వస్తుంది. కొన్ని రకాల మందులు ముఖ్యంగా ఐరన్ టానీక్ తీసుకొన్నప్పుడు, మలాశయంలో పుండ్లు పండినప్పుడు, థైరాయిడ్ గ్రంథి చురుకుదనం తగ్గినప్పుడు, తీవ్రమైన ఒత్తిడి, మానసికి ఆందోళనకు గురయినప్పుడు ఈ సమస్య కనిపిస్తుంది. ఈ సమస్య వచ్చినప్పుడు.. తేన్పులు ఎక్కువగా ఉండటం, గ్యాస్‌తో పొట్ట మొత్తం ఉబ్బినటుగా ఉండటం, రాత్రి నిద్ర పట్టకపోవడం, కడుపులో గడబిడలతో పుల్లటి తేన్పులు రావడం, మల విసర్జన సరిగా పూర్తిగా కాదు. ఎప్పుడు చూసినా నీరసంగా ఉండటం, తిన్నది సరిగ్గా జీర్ణం కాకపోవడం, కడుపునొప్పి, వాంతులు అవుతాయి.
మన జీవనశైలిపై ప్రభావం చూపే మలబద్దకాన్ని నివారించుకోవడానికి ముఖ్యంగా ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నిత్యం పుష్కలంగా నీరు తాగడంతో పాటు పీచు అధికంగా ఉండే కూరగాయలు, ఆకు కూరలతోపాటు అరటి పండ్లు, పైన్ఆపిల్, బత్తాయి, సపోట పండ్లనుఆహారాలను డైట్లో చేర్చుకోవాలి. ఫాస్ట్ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, మసాలాలు, వేపుళ్లు వంటి ఆహార పదార్థాలను దూరంపెట్టాలి. నిలువ వుంచిన పచ్చళ్లు, కాఫీ, టీలు తగ్గించాలి. ఉదయం నిద్రలేవగానే రెండు గ్లాసుల నీళ్లు తాగి అటు ఇటు కొద్ది సమయం పాటు నడిస్తే కడుపులో పేగుల కదలికలు పెరుగి మల విసర్జన సాఫీగా సాగుతుంది. కివి పండ్లు, యాపిల్స్, పియర్స్, నారింజ, అంజీర్ పండ్లను తినడం వల్ల మలబద్దకాన్ని నివారించుకోవచ్చు.
మన జీవనశైలి, ఆహారపుటలవాట్ల కారణంగానే ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిసినా మన అలవాట్లను మార్చుకోలేక సమస్యను పెద్దది చేసుకొంటున్నాం. సమస్య వచ్చినప్పుడే చికిత్స తీసుకోవడం లేదా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. మలబద్దకం సమస్యను అలక్ష్యం చేయకుండా వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోవాలి.






