నిరంతరం రక్తంలోని వ్యర్థాలను వడకడ్తూ… మూత్రపిండాలు మన శరీరంలోని అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంటాయి. ఒకసారి మూత్రపిండాల పనితీరు మందగిస్తే… తిరిగి పూర్తిస్థాయిలో ఆరోగ్యకరంగా చేయడం చాలా కష్టమైన పని. పైగా ఎంతో ఖర్చుతో కూడుకున్నది. మూత్రపిండం పూర్తిగా విఫలమైతే కృత్రిమంగా రక్తాన్ని శుద్ధి చేయాల్సి వస్తుంది. దీన్నే డయాలసిస్ అని వైద్య పరిభాషలో పిలుస్తారు. మన దేశంలో కిడ్నీ వ్యాధులతో బాధపడే వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. ప్రస్తుతం కిడ్నీ వ్యాధిగ్రస్థులు ఇరవై లక్షలకు పైగా ఉన్నారని ఓ అంచనా. ఏటా అదనంగా మరో రెండు లక్షల మంది కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారు.
జీవి మనుగడకు మెదడు, గుండెతో పాటు మూత్రపిండాలు ఎంతో ముఖ్యమైనవి. రక్తంలో చేరుతున్న కల్మషాన్ని గాలించి, వడపోసి, శుభ్రంచేసే పని మూత్రపిండాలది. విరామం లేకుండా రక్తాన్ని శుభ్రం చేసే ప్రక్రియను మూత్రపిండాలు కొనసాగిస్తుంటాయి. రక్తంలో ఎక్కువున్న నీరు, వ్యర్థపదార్థాలను ఎప్పటికప్పుడు వడకట్టేస్తూ ఉంటాయి. అయితే… మన శరీరంలోని రక్తములో ఉన్న వ్యర్ధ పదార్ధాలను వడకట్టలేక పోయినపుడు, మూత్రం ద్వారా సరిగా విసర్జించలేకపోయినపుడు, శరీరంలో ఉప్పును, నీటిని తగుపాళ్ళలో సమం చేయలేకపోయినప్పుడు, శరీరంలో రక్త పోటును క్రమబద్దీకరించ లేకపోయినప్పుడు, మూత్రపిండాలు పనిచేయడం లేదని గ్రహించాలి. దీనినే కిడ్నీఫెల్యూర్ అని అంటారు. కిడ్నీలు సాధారణ స్ధితికి రాలేనంతగా చెడిపోతాయి.
మూత్రపిండాలు ప్రతి రోజూ సుమారు 200 లీటర్ల రక్తాన్ని వడకట్టి అందులోంచి దాదాపు 2 లీటర్ల వ్యర్థాలను, అధికంగా ఉన్న నీటినీ తోడెస్తాయి. ఇలా తోడేసే నీరే మూత్రం రూపంలో బయటకు పోతుంది. మితిమీరిన రక్తపోటు, అదుపు తప్పిన రక్తపు చక్కెర స్థాయిలు, కొన్ని రకాల రోగాలకు వాడే మందుల కారణంగా మూత్రపిండాలకు హాని ఏర్పడే అవకాశాలుంటాయి. శాశ్వత కిడ్నీ ఫెయిల్యూర్‌కు జన్యుపరమైన, నిర్మాణలోపాల వంటి అనేక అంశాలు కూడా కారణమవుతాయి. కిడ్నీ 15శాతం కన్నా ఎక్కువ పనిచేయలేని స్థితికి వచ్చేవరకు కిడ్నీలో వ్యాధి ఉన్నదనే లక్షణాలు ఏవీ కనిపించవు. కిడ్నీలు సాధారణం కన్నా తక్కువ స్థాయిలో పనిచేస్తున్నాయనడానికి… డయాలసిస్ దశకు చేరుకున్నాయనడానికి కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.
- మూత్ర పరిమాణం తగ్గిపోతుంది.
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది.
- కొన్నిసార్లు వాంతులు, తలనొప్పి, ఫిట్స్ వస్తాయి
- పిల్లల్లో చర్మంపై రాష్, కీళ్లనొప్పులు, జ్వరం, నీళ్ల విరేచనాలు వస్తాయి
- కిడ్నీలు పనిచేయని పిల్లల్లో ఎదుగుదల తక్కువగా ఉంటుంది.
- పదేపదే మంచినీరు తీసుకుంటుంటారంటే మూత్రపిండాల పనితీరులో తేడా వచ్చినట్లుగా గుర్తించాలి.
రక్తపోటుకు గురయ్యే వారు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలి. బీపీ, ఘగర్ లాంటి జబ్బులున్నవారు ప్రతి 3 నెలలకోమారు ఆరోగ్యపరీక్షలు చేయించుకోవాలి. ప్రొటీన్ పరీక్షలు చేయించుకోవాలి. డయాలసిస్‌లో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
- లీటర్‌కు తక్కువ కాకుండా పాలు, పండ్ల రసాల వంటి ద్రవాలు తీసుకోవాలి.
- ఉప్పు రోజుకు 2 గ్రాములకు మించి వాడకూడదు.
- బీపీ, ఘుగర్ మందులు రెగ్యులర్‌గా వాడాలి.
- కండరాలు, ఎముకల పటిష్టం కోసం వ్యాయామాలు చేయాలి. యోగా, వాకింగ్, జాకింగ్ చేయవచ్చు. డయాలసిస్ కారణంగా ద్రవాలు సడెన్‌గా షిఫ్ట్ కావడం వల్ల బీపీ తగ్గి తలనొప్పి లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనే గుర్తుంచుకోవాలి. వారానికి కనీసం మూడు సార్లు డయాలసిస్ చేసుకోవాలి.
డయాలసిస్ అంటే భయపడేవారు కిడ్నీ జబ్బులను పెంచుకుంటారన్నది నిజం. శరీరంలోని అన్ని భాగాలూ డ్యామేజి కాకముందే మేల్కొనాలి. వైద్యం ఎంత అభివృద్ధి చెందినా.. కిడ్నీల ఆరోగ్యం మన చేతుల్లోనే.. అన్న విషయం గుర్తెరగాలి.