Down Syndrome: డౌన్‌ సిండ్రోమ్‌ అంటే ఏంటి..?

By manavaradhi.com

Published on:

Follow Us
Down Syndrome

మన చుట్టుపక్కల డౌన్ సిండ్రోమ్ సమస్య ఉన్న పిల్లలు తరచుగా కనబడుతుంటారు. పిల్లల్లో కనిపించే ప్రధానమైన మానసిక వికాస లోపం ఇది. జన్యుపరమైన కారణాల వలన గర్భస్థదశలోనే పిల్లల్లో ఈ లోపం ఏర్పడుతుంది. మెదడు పెరుగుదలలో లోపాలు ఉండటం వలన వారి ఐక్యూ కూడా తక్కువగా ఉంటుంది. ఆడపిల్లలకు 18ఏళ్ల లోపు 35 ఏళ్ల తరువాత వివాహమై వారు ఆయా వయసుల్లో గర్భం దాల్చినట్లయితే వారికి పుట్టిన పిల్లలకు డౌన్ సిండ్రోమ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

డౌన్స్ సిండ్రోమ్ .. వంశపారంపర్యంగా సంక్రమించే సమస్య. డౌన్ సిండ్రోమ్ సమస్య ఉన్న పిల్లల్లో మానసిక వికాసం ఉండదు. ఈ సమస్య వల్ల పుట్టే పిల్లల్లో పుట్టుకతోనే గుండె సమస్యలు, వినికిడి లోపం, కంటిలోపాలు, ADHD , ప్రవర్తనకు సంబందించిన సమస్యలు, ఆటిజం, జీర్ణవ్యవస్థ లోపాల లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.దీంతోపాటు రోగనిరోధక వ్యవస్థలో లోపాలు కూడా వచ్చే అవకాశం ఉంది. డౌన్స్ సిండ్రోమ్ ఉన్నవారికి నడక, మాటలు ఆలస్యంగా వస్తాయి. కొందరిలో మతిమరుపు కూడా ఉంటుంది. ఈ స‌మ‌స్య ఉన్న పిల్ల‌ల‌ను చూడ‌గానే గుర్తుప‌ట్ట‌వ‌చ్చు. చ‌ప్పిడి ముక్కు, చెవులు చిన్న‌గా కింద‌కు ఉండటం, క‌నుబొమ‌ల లోప‌ల ముడ‌త‌లు ఉంటాయి. ఈ పిల్ల‌లు పొట్టిగా, లావుగా ఉంటారు. అర‌చేతుల్లో గీత‌లు త‌క్కువ‌గా ఉంటాయి. మెద‌డు పెరుగుద‌ల‌లో లోపాలు ఉండ‌టం వ‌ల‌న వీరిలో ఐక్యూ కూడా త‌క్కువ‌గానే ఉంటుంది.

స్త్రీలు గ‌ర్భం దాల్చే వ‌య‌సు పెరుగుతున్న‌కొద్దీ వారికి పుట్టే పిల్ల‌ల్లో ఈ స‌మ‌స్య రావ‌డానికి అవ‌కాశాలు పెరుగుతాయి. అందుకే మ‌హిళ‌లు స‌రైన వ‌య‌సులో గ‌ర్భం దాల్చడం అనేది పిల్ల‌ల ఆరోగ్యంలో కీల‌క పాత్ర‌ని పోషిస్తుంది. తల్లి వయసు 30ఏళ్ల లోపు ఉన్నట్లయితే ప్రతి 2500 మంది శిశువుల్లో ఒకరికి డౌన్ సిండ్రోమ్ సమస్య వచ్చే అవకాశం ఉంది. అదే 45ఏళ్లు దాటిన తల్లులకు పుట్టే పిల్లల్లో అయితే ప్రతి 32మందికి ఒకరు డౌన్ సిండ్రోమ్ బారిన పడుతున్నట్టుగా లెక్కలు చెబుతున్నాయి. మనదేశంలో ఏటా 23 నుండి 29వేలమంది పిల్లలు ఈ సమస్యతో జన్మిస్తున్నారంటే దీని తీవ్రతని మనం అర్థం చేసుకోవచ్చు.

పిల్ల‌ల్లో డౌన్స్ సిండ్రోమ్ రాకుండా నివారించాలంటే మొట్ట‌మొద‌ట తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ త‌ల్లి గ‌ర్భం దాల్చే వ‌య‌సు 18 ఏళ్ల‌కు లోపు 35 ఏళ్ల‌కు పైబ‌డి లేకుండా చూసుకోవ‌డం. గ‌ర్భ‌స్థ శిశువులో జ‌న్య‌ప‌ర‌మైన లోపాల‌ను ముందుగానే గుర్తించే ప‌రీక్ష‌లు ఉన్నాయి. 30ఏళ్లు పైబ‌డ్డాక గ‌ర్భం దాల్చే మ‌హిళ‌లు అంద‌రూ ఈ ప‌రీక్ష‌ల‌ను చేయించుకోవ‌టం మంచిది. ఒక వేళ పుట్ట‌బోయే బిడ్డ‌కు డౌన్స్ సిండ్రోమ్ ఉన్న‌ట్టుగా తేలితే వారు ముందుగా మాన‌సికంగా ధైర్యంగా ఉండాలి. వారిలోని నైపుణ్యాన్ని తల్లిదండ్రులు వెలికితీసే ప్రయత్నం చేయాలి. వీరికి చక్కగా శిక్షణనిస్తే కొన్నిరకాల చేతి వృత్తుల్లో రాణించగలుగుతారు. తమకు తాముగా పనులు చేసుకునేందుకు అవసరమయ్యే శారీరక శిక్షణ, మాటలు స్పష్టంగా రావడానికి ప్రత్యేకంగా స్పీచ్ థెరపీలు కూడా ఉన్నాయి.

డౌన్ సిండ్రోమ్ తో ఉన్న పిల్ల‌ల ప‌ట్ల ప్రేమ ఆప్యాయత చూపించాలి. వీరిపై ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాలి. అంతేకాదు వీరికి సమతుల ఆహారం, చక్కని శిక్ష‌ణ‌, క్ర‌మం త‌ప్ప‌కుండా ఆరోగ్య‌ప‌రీక్ష‌లు చేయించినట్లైతే వీరి మానసిక, శారేరాక ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీరికి చక్కని శిక్షణను ఇచ్చే స్వ‌చ్ఛంద సంస్థ‌లు కూడా ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వీరికి ఎప్పుడూ అండగా ఉంటూ వీరిలో మానసిక స్థైర్యాన్ని నింపాలి.

డౌన్ సిండ్రోమ్ తో పుట్టే పిల్లలను చులకనగా చూడవద్దు. వారికి మాటలు స్పష్టంగా రావడానికి, ప్రవర్తనలో మార్పులు రావడానికి ప్రత్యేక థెరపీలు ఎంతగానో సహకరిస్తాయి. తల్లిదండ్రులు భయానికి, సిగ్గుకి గురికాకుండా ఈ పిల్లలకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది.

Leave a Comment