ఆటలాడుతూ కిందపడినప్పుడో.. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎముకలు విరగడం చూస్తుంటాం. అయితే వయసు పెరిగేకొద్ది ఎముకల సాంధ్రత తగ్గిపోయి విరిగిపోవడం జరుగుతుంటాయి. చిన్నచిన్న సందర్భాలకే ఎముకలు విరగకుండా ఉండాలంటే ఏంచేయాలి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎముకలు విరగకుండా చూసుకోవచ్చు..?
ప్రమాదాలు జరిగినప్పుడు లేదా ఎత్తైన ప్రదేశం నుండి క్రింద పడినప్పుడు లేదా ఆటలాడేప్పుడు అనుకోకుండా బలంగా దెబ్బ తగిలిన సందర్భాల్లో ఎముకలు విరిగిపోతుంటాయి. ఎక్కువగా చేతులు, కాళ్ళ ఎముకలు ఇలా విరుగుతుంటాయి. ఎముకల నిర్మాణానికి కాల్షియం అనే పోషకం కావాలి. ఇది తగ్గిపోయినప్పుడు ఎముకల సాంద్రత తగ్గిపోయి గుల్లబారిపోతాయి. అందువల్ల ఎముకలు చాలా బలహీనం అవుతాయి. తొందరగా, చిన్న దెబ్బకే విరిగిపోయేందుకు ఆస్కారం ఉంటుంది. 35 ఏళ్ల వయసు దాటిన తర్వాత ఎముకల సాంద్రత తగ్గుతూ వస్తుంది. మహిళల్లో మెనోపాజ్ తరువాత ఎముక సాంద్రత తగ్గిపోవడం మరింత వేగవంతం అవుతుంది. అలాగే జన్యుపరమైన కారణాలు, వ్యాయామం చేయకపోవడం, విటమిన్ డి లోపం, సిగరెట్ స్మోకింగ్, అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం, ఆర్థరైటిస్ ఉండడం, శరీర బరువు తక్కువగా ఉండడం వంటి కారణాల వల్ల ఎముకలు విరుగుతుంటాయి.
విటమిన్ డి లోపం వల్ల ఆహారం నుంచి కాల్షియంను శరీరం గ్రహించలేదు. కాబట్టి విటమిన్ డి లోపం ఆస్టియోపోరొసిస్‌కి దారితీస్తుంది. పెద్ద వయసు, శరీర సమతుల్యత దెబ్బతినడం, కండరాల బలహీనత, దృష్టిలోపం, శుక్లాలు రావడంతోపాటు పోషకాహార లోపం, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం, ఆర్థరైటిస్, డయాబెటిస్, పోస్టురల్ హైపోటెన్షన్, పెరిఫెరల్ న్యూరోపతి వంటి సమస్యలతో కిందపడిపోయి ఎముకలు విరిగేందుకు కారణమవుతాయి. ఇంట్లో తడిగా ఉన్నప్పుడు, ఎగుడుదిగుడు నేలపై నడిచినప్పుడు కిందపడిపోయే ప్రమాదమున్నందున మెల్లగా నడవాలి. అలాగే జారిపోయే చెప్పులు, హైహీల్స్ వేసుకోకుండా జాగ్రత్తపడాలి. ఇంట్లో తగినంత వెలుతురు ఉండేలా చూసుకోవాలి. రాత్రివేళల్లో తప్పనిసరిగా బెడ్‌ల్యాంపులు వేసి పెట్టుకోవాలి. నడిచేదారిలో అడ్డంకులు లేకుండా చూసుకోవాలి.
రక్తాన్ని పలుచబరిచే కొన్ని రకాల మందులు, దీర్ఘకాలికంగా వాడే కార్టికోస్టిరాయిడ్స్ కూడా ఆస్టియోపోరొసిస్‌కు దోహదం చేయవచ్చు. కొన్ని రకాల మాత్రలతో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి శరీరం తూలిపోయే అవకాశాలుంటాయి. అలాగే సెడటివ్స్ లేదా స్లీపింగ్ మాత్రలు, రక్తపోటు మందులు యాంటిడిప్రేసన్ట్స్ , మూర్ఛ వ్యాధిని తగ్గించు పదార్థం, కండరాల సడలింపుదారులు, హృదయ పరిస్థితులకు వాడే కొన్ని రకాల మందులు శరీరం పట్టుతప్పి పడిపోయేందుకు దోహదపడుతుంటాయి. ఆహారం ద్వారా తగినంత కాల్షియం, ప్రొటీన్లు తీసుకోవడం. క్రమం తప్పకుండా నిత్యం శారీరక శ్రమ చేయడం వల్ల ఎముకలను ధృడంగా తయారుచేసుకోవచ్చు. బరువు తక్కువగా పడే వ్యాయామాలైన వాకింగ్, జంపింగ్, జాగింగ్ లాంటివి రోజూ చేయాలి.
ఎముకలు విరిగితే ఎంత బాధగా ఉంటుందో అనుభవించే వారికే తెలుస్తుంది. సహజంగా వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు సాంధ్రత తగ్గిపోయి త్వరగా విరిగిపోతుంటాయి. అలా జరుగకుండా ఉండేందుకు కాల్షియం, విటమిన్ డీ ఎక్కువగా లభించే ఆహారాలు నిత్యం తీసుకోవడం చాలా ఉత్తమం. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో.. నిత్యం ఎముకలు విరగకుండా జాగ్రత్తలు తీసుకొంటూ ఉండాలి.