Afternoon Naps: మద్యాహ్నం కునుకు మంచిదే? దాని లాభాలు తెలుసుకోండి

By manavaradhi.com

Published on:

Follow Us
Afternoon Naps

మనకు ఆహారం ఎంత ముఖ్యమో, నిద్ర కూడా అంతే అవసరం. కానీ, నేటి ఉరుకులు, పరుగుల జీవితంలో నిద్రలేమి ఒక జబ్బుగా మారిపోతుంది. నిద్ర అనేది అందరికీ తప్పనిసరైన జీవన క్రియ. అది ఎక్కువైనా, తక్కువైనా మానసిక, శారీరక మార్పులు అనివార్యం. రోజులో పని ఒత్తిడి వల్ల కూడా చురుకుతనం తగ్గి అలసిపోయినట్లుగా అనిపిస్తూ వుంటుంది. అలాంటప్పుడు, మధ్యాహ్నం భోజనం ముగించాక చిన్నపాటి కునుకు తీస్తే చాలు. ఆ తర్వాత చలాకీతనం, చురుకుదనం ఇట్టే వచ్చేస్తాయి.

మనలో చాలామంది తీరిక దొరికినప్పుడు కొద్దిసేపు కునుకు తీయటం చూస్తూనే ఉంటాం. అప్పుడప్పుడు ఇలా కాసేపు నిద్రపోవటం వల్ల ఒత్తిడిని కలిగించే హార్మోన్ల మోతాదులు తగ్గుతున్నట్టు పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అప్పుడప్పుడు నిద్రపోవడం వల్ల మెదడుకు విశ్రాంతి చేకూరుతుంది. దీంతో శరీరం పునరుత్తేజితమవుతుంది. పైగా ఇలా కునుకు తీసుకునే వారికి మానసికపరమైన ఒత్తిడి, శారీరకపరమైన ఒత్తిడి నుంచి దూరంగా ఉండవచ్చు.

పగటి పూట చిన్న కునుకు తీయడం ద్వారా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పగటిపూట పనుల గందరగోళం మధ్య చిన్నపాటి కునుకు తీసినా అది జ్ఞాపక శక్తి, మానసిక ప్రవర్తనలపై ప్రభావం చూపుతుంది. కనీసం ఆరు నిమిషాలు నిద్రపోయినా కూడా మెదడులోని జ్ఞాపకశక్తిని పెంచే చర్య జరిగేందుకు అది దోహదం చేస్తుందన్నది పరిశోధకులు చేబుతున్నారు. కాబట్టి ఈ నిద్ర పగటిపూట పనివేళల మధ్యలో పొందితే మరింత చురుగ్గా పనిచేయడానికి ఉపకరిస్తుంది. అంతేకాదు మనం తీసే చిన్నకునుకు గుండె పనితీరు మెరుగయ్యేందుకు, హార్మోన్‌ల హెచ్చుతగ్గులను సమం చేసేందుకు, రక్తనాళాలు శుభ్రపరిచేందుకు ఉపకరిస్తుంది.

రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల కలిగే ఒత్తిడిని దీని ద్వారా తగ్గించుకోవచ్చు. మధ్యాహ్న సమయంలో 10-20 నిమిషాలు నిద్రపోవడం వల్ల ఆ తరువాత చేసే పనిలో ఉత్సాహం నిండుతుంది. ఆఫీసులో కొంత సమయం పనిచేసిన తరువాత ప్రొడక్టివిటి లెవల్స్ తగ్గడం వల్ల కొద్దిగా బద్దకంగా ఫీలవుతారు. అలాంటి సమయంలో చిన్నపాటి కునుకు తీయడం చురదనం తిరిగి పొందడం వల్ల ఏకాగ్రతను పెంచుకోవచ్చు.

రాత్రి ఎంతగా నిద్రించినా, మధ్యాహ్నం వేళ చిన్నపాటి కునుకు చాలా ఉపయోగంగా వుంటుంది. పగటి పూట మనం తీసే చిన్న కునుకును నాప్‌ అంటారు. నాప్ అంటే 10 నుంచి 20 నిమిషాలే ఉంటుంది. అలా కాకుండా దీని పేరుతో అలాగే నిద్రపోతే రాత్రి నిద్రకు ఆటంకం కలుగుతుంది. ఆ ప్రభావం తిరిగి మరుసటి ఉదయం మీపై పడుతుంది. పగటి నిద్రకు చాలా తక్కువ సమయాన్ని మాత్రమే కేటాయించాలి.

గంటల తరబడి కునుకు తీయడం సరికాదు. ఈ పగటి నిద్ర మరీ ఎక్కువ సమయం కాకుండా కేవలం 10 నుంచి 20 నిముషాలు మాత్రమే వుండాలా చూసుకోవాలి. ఇలా చేస్తే చురుకుతనం, చలాకీతనం పెరిగి ఎంతో ఉపయోగం వుంటుంది. చిన్న కునుకు పేరుతో మధ్యాహ్నం నిద్ర 20 నిమిషాలు దాటితే మాత్రం కొన్ని నష్టాలు కలుగుతాయని మరిచిపోకండి.

ఎక్కువసేపు కునుకు తీయొద్దు. ముఖ్యంగా పనులు చేసే సమయంలో దీని మరవొద్దు. ఎక్కువ సమయం కునుకు తీస్తే చాలాసేపటి వరకు మగతగా అనిపిస్తుంది. ఇది చురుకుదనాన్ని తగ్గిస్తుంది. కాబట్టి పగటిపూట 10-15 నిమిషాల కన్నా ఎక్కువసేపు పడుకోవద్దు.

Leave a Comment