మన శరీరానికి కావల్సిన పోషకాలన్నీ కూరగాయలు నుంచే ఎక్కువగా లభిస్తాయి. మనం తినే కూరగాయలు శుభ్రం చేయడమూ ఎంతో అవసరం. కూరగాయలు శుభ్రం చేసినప్పుడు … వాటిని ఉడికించేటప్పుడు… వాటిలో నీటిలో కరిగే విటమిన్లు, ఖనిజాలు నష్టపోతాం. అలా కాకుండా పూర్తిగా పోషకాలు అందాలంటే కొన్ని జాగ్రత్తలను సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు. వారి సూచనలు పాటిస్తే.. రోజువారీ తీసుకునేవాటి నుంచి పోషకాలు నష్టపోకుండా చూసుకోవచ్చు.
తాజా కూరగాయల్లో ఎన్నో విలువైన పోషకాలుంటాయి. వాటిని వండడంవల్ల ఆహార పదార్థాలకు రుచి, సువాసన కలుగుతాయి. అలాగే కంటికి ఇంపుగా కనబడతాయి. జీర్ణం చేసుకోవడం తేలికవుతుంది. కూరగాయలను వండడంలో జాగ్రత్తలు పాటిస్తూ కొన్ని మెళకువలు వహిస్తే వండిన వంటలు రుచి, సువాసనలతోపాటు పోషక విలువలు కలిగి ఉంటాయి. కూరగాయలు కడగడం, తరగడం, ఉడకపెట్టడంలో సరియైన అవగాహన లేక ఎన్నో పోషకాలను నష్టపోతున్నాం. ఆహార పదార్థాలను ఉడకపెట్టినా, వేపుడు చేసినా అతిగా చేస్తే పోషక విలువలు నశిస్తాయి.
తినే ఆహారాన్ని ఏ పద్ధతిలో తయారుచేసినా తగు జాగ్రత్తలతోపాటుగా కొన్ని వంటింటి చిట్కాలు తెలుసుకుంటే సరిపోతుంది. ఆహార పదార్థాలలోని పోషకాలు, విటమిన్లు అన్నీ మన సొంతమవుతాయి. తాజా కూరగాయల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. వేపుడు చేయడంవలన ఆహార పదార్థాల రుచి పెరుగుతుంది కానీ ఎంతో విలువైన పోషకాలు నష్టపోతాము. తక్కువ నూనెలో మితంగానే వేపుడు చేసుకోవాలి. డబల్ రోస్ట్ మోజులో పడితే చాలామటుకు పోషకాలు మాయమవుతాయి. వెన్న, డాల్డాలకు బదులుగా ఆలివ్ ఆయిల్‌ను వాడుకోవాలి. ఆరోగ్యానికి ఎంతో మంచిది.
నిత్యం మనం చేసే అనేక పొరపాట్ల వల్ల కూరగాయల్లో ఉండే పోషకాలు పోతుంటాయి. వాటిని కొనుగోలు చేసి తెచ్చి ఫ్రిజ్‌లో పెట్టి తరువాత తీసి కడిగి వండి తినేసరికి వాటిల్లో ఉండే పోషకాల సంఖ్య తగ్గుతుంది. దీంతో మనం తినే కూరగాయల్లో చాలా తక్కువ పోషకాలు ఉంటాయి. అవి మన శరీరానికి సరిపోవు. ఎక్కువ సేపు కూరగాయలను ఉడకబెడితే వాటిల్లో ఉండే పోషకాలు నశిస్తాయి. అందువల్ల వాటిని తక్కువ టైం పాటు ఉడికించాలి. అయితే మరి ఆ టైంలోగా కూరగాయలు ఉడకవు కదా. అంటే.. అవును.. కానీ తక్కువ సమయంలో కూరగాయలు ఉడకాలంటే వాటిలో ముందుగానే ఉప్పు వేయాలి. దీంతో అవి త్వరగా ఉడుకుతాయి.
సమయం తక్కువ పడుతుంది కనుక పోషకాలు కూడా నశించకుండా ఉంటాయి. సాధారణంగా కొందరు కూరగాయలు కట్ చేశాక కడుగుతారు. అలా చేస్తే పోషకాలు పోతాయి. కనుక కూరగాయలను ముందుగా కడగాల్సి ఉంటుంది. తరువాతే వాటిని కట్ చేయాలి. దీంతో పోషకాలు అలాగే ఉంటాయి. కూరగాయలను అడ్డం దిడ్డంగా కట్ చేయకూడదు. వాటిని దాదాపుగా ఒకే సైజ్ వచ్చేట్లు కట్ చేయాలి. అలాగే తక్కువ నీటిలో ఉడికించాలి. దీంతో పోషకాలు నశించకుండా ఉంటాయి.
కొందరు పచ్చి కూరగాయలకు పొట్టు తీసి తరువాత వాటిని ఉడికిస్తారు. కానీ అలా కాకుండా కూరగాయలను పొట్టు తీయకుండానే ఉడికించి తరువాత పొట్టు తీయాలి. దీంతో పోషకాలు అలాగే ఉంటాయి. బంగాళాదుంపలను పొట్టు తీయకుండా కొన్ని సార్లు అలాగే ఉడికిస్తాం కదా. తరువాత పొట్టు తీస్తాం. అలాగన్నమాట. కూరగాయలను కొందరు నీటిలో నానబెడతారు. అలా చేస్తే నీటిలో కరిగే విటమిన్లు నీటిలో కరిగిపోతాయి. దీంతో కూరగాయల్లో విటమిన్లు ఉండవు. మనం వట్టి చెత్తను తిన్నట్లు అవుతుంది. కనుక కూరగాయలను నీటిలో నానబెట్టరాదు. కొందరు కూరగాయల రంగు అలాగే ఉండాలని చెప్పి వంటల్లో బేకింగ్ సోడా వేస్తారు. అది నిజమే. కానీ దాని వల్ల కూరగాయల్లో ఉండే పోషకాలు నశిస్తాయి. కనుక పోషకాలు కావాలంటే వంటల్లో బేకింగ్ సోడాను వేయకూడదు.
కూరగాయల పోషక విలువలు, అవి ఎంత తాజాగా ఉంటే, అవి అంత ఎక్కువగా ఉంటాయి. సాధ్యమైనంతవరకు దుంప కూరలు, కూరగాయల పొట్టు తక్కువగా తీయాలి. మన శరీరానికి కావాల్సిన చాలా పోషకాలు, ఖనిజ లవణాలు, విటమినులు ఈ తొక్కకిందనే సమృద్ధిగా ఉంటాయి.