మీరు తీసుకునే పానీయాల్లో ఎక్కువ క్యాలరీలు ఉన్నాయేమో

By manavaradhi.com

Published on:

Follow Us

తెల్లారి లేస్తే మనం ఎన్నో రకాల ద్రవపదార్ధాలు తీసుకుంటూ ఉంటాం. పళ్లరసాలు, ఎనర్జీ డ్రింకులు, పాలు…ఇలా ఎన్నో. ఈ ద్రవపదార్థాలని మనం త్వరగా తాగేయవచ్చు. అవి త్వరగా జీర్ణమవుతాయి. అయితే సాధారణంగా ఆహారాన్ని తీసుకుంటూ ఎప్పుడో ఒకసారి ఇలా ద్రవపదార్థాలు తీసుకోవటం వరకు అయితే పరవాలేదు…. కానీ కొంతమంది ఇప్పుడు కేవలం ద్రవాహారాలు మాత్రమే తీసుకుంటూ బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారు. కొంతమంది ఘనాహారం బదులుగా పూర్తిగా గానీ లేదా ఘనాహారంతో పాటు రోజుకి ఒకటి రెండుసార్లు కానీ ద్రవాహారాలు మాత్రమే తీసుకుంటూ ఉంటారు. పండ్లు , కూరగాయల రసాలు, మిల్క్ షేకులు వంటివాటిని ఇలా ద్రవాహారాలుగా తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో వైద్యులు వీటిని వాడమని సలహా ఇవ్వవచ్చు. ద్రవాహారాలు తీసుకోవాలని అనుకున్నపుడు అందులో శరీరానికి అవసరమైన పోషకాలు అన్నీ ఉండాలి. అలా లేనప్పుడు ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫ్యాట్స్, విటమిన్లు, మినరల్స్ వంటివి శరీరంలో సమతౌల్యంలో ఉండవు. పళ్లు కూరగాయలు వంటివాటిని యధాతథంగా కాకుండా రసాల రూపంలో తీసుకోవటం వలన శరీరానికి తగినంత పీచు అందదు. దాంతో మలబద్దకం ఇతర అజీర్తి సమస్యలు ఏర్పడవచ్చు.

ఉదయం లేచిన దగ్గర నుంచీ.. రాత్రి పడుకునే వరకూ మనం రకరకాల పానీయాలు తాగుతూనే ఉంటాం. వీటిని వదులుకోవటానికి అస్సలు ఇష్టపడం కూడా. తరచూ కూల్‌డ్రింకులు తాగటం మజాగానే అనిపించొచ్చు. కానీ ఇవి తీవ్ర అనర్థాలకు దారితీస్తాయి. కూల్‌డ్రింకులను ఎంత ఎక్కువగా తాగితే దంతాలు అంతగా దెబ్బతింటాయి. కూల్‌డ్రింకుల్లో చక్కెర చాలా ఎక్కువగా ఉంటుంది. రోజు మొత్తమ్మీద తీసుకోదగిన చక్కెరలో సగానికి పైగా ఒక్క కూల్‌డ్రింకు నుంచే వచ్చేస్తుంది. ఇలా వచ్చే అదనపు క్యాలరీలన్నీ ఒంట్లో కొవ్వుగా మారిపోతాయి. దీంతో బరువు పెరుగుతారు. చక్కెర విషయంలో మన పండ్ల రసాలూ తక్కువేం కాదు. పండ్ల రసాల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉండేమాట నిజమేగానీ ఇవీ కూల్‌డ్రింకులంత తియ్యగానే ఉంటున్నాయి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. కొన్ని రకాల పండ్ల రసాల్లో కూల్‌డ్రింకుల కన్నా చక్కెర ఎక్కువే ఉంటుంది. ఎంత సహజమైనదైనా అధిక మోతాదుల్లో ఉండటం వల్ల ఇది కూడా- అదనంగా కలిపే చక్కెరల మాదిరే హాని చేస్తుంది. అందుకే పండ్ల రసాయల విషయంలోనూ పరిమితి పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే సిఫార్సు చేస్తోంది. అతిగా పంచదార కలిపిన డ్రింకులు, కృత్రిమ చక్కెరల డ్రింకులు, పండ్ల రసాలన్నింటినీ కూడా- మధుమేహ ముప్పు కారకారకాలుగానే చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీటి విషయంలో ఎక్కడా మితం తప్పకూడదు.

పాలను ‘క్యాల్షియం గని’ అనుకోవచ్చు. కాకపోతే పాలతో ప్రయోజనం ఎక్కువ. పాలలో నీరు, ప్రోటీన్లు, ఖనిజాలు, విటమిన్లు, చక్కెరలు, సంతృప్త కొవ్వు, కొలెస్ట్రాల్‌ వంటివన్నీ ఉంటాయి. అందుకే పాలను సంపూర్ణ ఆహారమనీ అంటుంటారు. ఏడాది తర్వాత మాత్రం పిల్లలకు అదనంగా వెన్నతీయని పాలు ఇవ్వాలని సిఫారసు చేస్తుంటారు. వీటిలో ఉండే కొవ్వు పిల్లల మెదడు వృద్ధికి తోడ్పడుతుంది. కాఫీతో ఉన్న ఒకే ఒక్క ఇబ్బంది- మొదట్లో దీనివల్ల ఉత్సాహం, ఏకాగ్రత పెరిగినా క్రమేపీ మన శరీరం దీనికి అలవాటు పడిపోతుంది. కానీ మితంగా.. రోజుకు 3-4 కప్పులకు మించకుండా తాగితే పెద్దగా హాని చేయకపోవచ్చని పరిశోధకులు అంటున్నారు.కాఫీలో కెఫీన్‌ ఒక్కటే కాదు. క్లోరెజెనిక్‌ ఆమ్లాలు కూడా పెద్దమొత్తంలో ఉంటాయి. ఇవి మన శరీరం గ్లూకోజును స్వీకరించే ప్రక్రియను నెమ్మదింపజేస్తాయి. అయితే కాఫీ అతిగా తాగితే మాత్రం క్యాన్సర్‌ ముప్పు పెరగొచ్చు. కొన్నిరకాల వైద్యపరీక్షల సమయంలోనూ వైద్యులు ద్రవాహారాలు తీసుకోమని చెబుతారు. కొన్నిసార్లు ఆపరేషన్ తరువాత జీర్ణవ్యవస్థ చక్కబడేవరకు ద్రవాహారాలే సూచిస్తారు. ఇవి ఎక్కువగా పళ్లరసాలు సూపులు అయి ఉంటాయి. ఇవన్నీ వైద్యుల పర్యవేక్షణలో ఆ సందర్భం వరకు మాత్రమే జరుగుతాయి కనుక వీటివలన సాధారణంగా చెడు ప్రభావాలు ఉండవు. అయితే ద్రవాహారం తీసుకోవాలని తమకు తాము గా నిర్ణయం తీసుకునే వారు మాత్రం తప్పకుండా వైద్యులను సంప్రదించి అది తమకు సరిపడుతుందా లేదా అనే విషయంలో సలహా తీసుకోవాలి.

Leave a Comment