మన శరీరంలో ఉన్న మూత్రపిండాలు ఒక అద్భుతమైన వ్యవస్థ. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపటంలో ఇవి ముఖ్యమైన పాత్రని పోషిస్తున్నాయి. శరీరంలో నీటి పరిమాణం తగ్గకుండా చూస్తూ, జీవక్రియ జరుగుతున్నపుడు పేరుకునే కాలుష్యాన్ని ఇవి బయటకు పంపుతాయి. ప్రతి నాలుగు నిముషాలకు ఒకసారి మనలోని రక్తాన్ని అంతటినీ ఇవి శుభ్రం చేస్తుంటాయి. దీన్ని బట్టి వీటి పనితీరుని, మన ఆరోగ్యంలో వీటి పాత్రని అర్థం చేసుకోవచ్చు. మూత్రంలోని లవణాలు గట్టిపడి ఘనీభవించినప్పుడు మూత్రపిండాల్లో రాళ్లు తయారవుతాయి. ఈ రాళ్ళు మూత్రప్రవాహాన్ని అడ్డగించినపుడు ఇన్ఫెక్షన్, నొప్పి వంటి సమస్యలు ఏర్పడతాయి. తీవ్రమైన కడుపు నొప్పిని, ఇతర సమస్యలను కలిగించే ఈ రాళ్లు చిన్నవిగా ఉంటే మూత్రం ద్వారానే బయటకు వచ్చేస్తాయి. అలా రానివాటిని శస్త్రచికిత్స ద్వారా బయటకు తీస్తారు.
మూత్ర వ్యవస్థ అనేది మూత్రపిండాలు, మూత్రనాళాలు, మూత్రకోశం తదితర భాగాలతో నిర్మితమై ఉంటుంది. మూత్రపిండాలు చిక్కుడు గింజ ఆకారంలో ఎర్రని రంగులో 12 సెంటీమీటర్ల పొడవు, 150 గ్రాముల బరువు కలిగి ఉంటాయి. ఇవి పొట్ట వెనుకభాగంలో వెన్నుకి ఇరువైపులా ఉంటాయి. రక్తంలోని అదనపు నీటిని, వ్యర్థాలను వడపోయటం వీటి ప్రధాన బాధ్యత. రక్తంలో సోడియం పొటాషియం నీరు ఎక్కువైనా తక్కువైనా ప్రమాదమే. మూత్రపిండాలు ఈ స్థితిని క్రమబద్ధం చేస్తాయి. మూత్రపిండాల్లో తయారైన మూత్రాన్ని వాటినుండి బయల్దేరే మూత్రనాళాలు మూత్రకోశానికి చేరవేస్తాయి. మూత్రకోశం అనేది ఒక తిత్తివంటి నిర్మాణం. వ్యాకోచం చెందటం ద్వారా మూత్రాన్ని విసర్జన సమయం వరకూ నిల్వ చేస్తుంది. మూత్రకోశం పూర్తిస్థాయి సామర్థ్యం వరకూ నిండిన తరువాత నాడీ సంకేతాలను అనుసరించి మూత్రాన్ని వెలుపలకు పంపిస్తుంది. మూత్రంలోని క్యాల్షియం సాల్ట్స్, యూరిక్ యాసిడ్, ఆక్సలేట్ వంటి పదార్థాలే రాళ్లుగా మారతాయి.
ఇవి మూత్రంలో ఎక్కువగా ఉన్నపుడు తొలుత మూత్రం చిక్కగా వస్తుంది. ఆ తరువాత రాళ్లు ఏర్పడతాయి. మూత్రంలో సహజంగా ఉండే కొన్ని రకాల జీవరసాయన పదార్థాలు రాళ్లు ఏర్పడటాన్ని నివారిస్తాయి.
ఒకవేళ ఈ పదార్థాలు లోపిస్తే మూత్రపిండాల్లో రాళ్లు తయారవుతాయి. ఈ రాళ్లు చూడ్డానికి నునుపుగాగాని లేక గగ్గురుగా గాని ఉండవచ్చు. సాధారణంగా పసుపు లేదా గోధుమ రంగులో కనిపిస్తాయి. ఇవి ప్రాథమికంగా మూత్రపిండాల్లో తయారవుతాయి. అయితే ఆ తరువాత ఇవి మూత్రపిండాల్లోనే కాకుండా మూత్రమార్గంలోని ఇతర ప్రదేశాల్లో కూడా పెరగవచ్చు. ఈ రాళ్లను అవి ఏర్పడిన కారణాలను బట్టి ప్రైమరీ స్టోన్స్, సెకండరీ స్టోన్స్ గా విడగొట్టారు.
ఆల్కహాల్ తీసుకునేవారిలో, మలబద్దకం ఉన్నవారిలో, మంచంమీద కదలలేని స్థితిలో ఉన్నవారిలో, ఖరీదైన ఆహారం తీసుకునేవారిలోనూ మూత్రంలో ఆమ్ల గుణాలు ఎక్కువగా ఉండటం వలన ప్రైమరీ స్టోన్స్ ఏర్పడతాయి.
సెకండరీ స్టోన్స్ మూత్రంలో ఇన్ఫెక్షన్ల కారణంగా ఏర్పడతాయి. మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లలో కొన్ని ప్రధాన రకాలు కాల్షియం ఆగ్జలేట్స్, కాల్షియం ఫాస్పేట్, సిలికాన్ స్టోన్స్, యూరిక్ యాసిడ్ స్టోన్స్. ఈ రాళ్లు సాధారణంగా బఠానీ గింజంత గానీ లేదా చింత గింజంత గానీ ఉంటాయి. మూత్రాశయంలో రాళ్లు 600 గ్రాముల దాకా ఉండే అవకాశం ఉంది. ఒకేసారి చాలా ఎక్కువ సంఖ్యలో కూడా ఇవి ఏర్పడే అవకాశం ఉంది.
మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్లు అన్నిసార్లూ నొప్పిని కలిగించవు. రాయి మూత్రపిండంలోపల ఉంటే జీవితంలో ఎప్పటికీ దాని లక్షణాలు బయటపడకుండా ఉండిపోయే అవకాశం ఉంది. సాధారణంగా అయితే మూత్రాశయం, కిడ్నీల్లో ఏర్పడే రాళ్ల వల్ల విపరీతమైన నొప్పి కలుగుతుంది. మూత్రం పోసే సమయంలో నొప్పి, మంట, వికారం, జ్వరం, పొట్ట కింది భాగంలో నొప్పి, మూత్రం రంగు మారడం, ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లడం, తక్కువ మొత్తంలో మూత్రం విసర్జించడం, దుర్వాసన ఇలాంటి లక్షణాలు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడినప్పుడు కనబడతాయి.
రాయి మూత్రకోశంలో ఉంటే మూత్రకోశ గోడలకు అది రాసుకున్నపుడల్లా పొత్తికడుపులో నొప్పి వస్తుంది. మూత్రద్వారం వరకు నొప్పిగా అనిపించవచ్చు. మూత్రపిండంలోని రాళ్లు కదిలి బయటకు రావడానికి ప్రయత్నించినపుడు విపరీతమైన కడుపు నొప్పి ఉంటుంది. మూత్ర విసర్జన గొట్టంలో రాయి ఆగిపోతే మూత్రం రావటం ఆగిపోయి, మూత్రాశయం ఉబ్బిపోయి నొప్పి కలుగుతుంది. మూత్రాశయంలో రాళ్లు చేరిప్పుడు కటి భాగంలోనూ, పొత్తికడుపులోనూ నొప్పి ఉంటుంది. మూత్రపిండం లేదా మూత్రనాళం గోడలకు రాళ్లు రాసుకుంటే మూత్రంలో రక్తం పడుతుంది. మూత్ర విసర్జన చేసేటపుడు నొప్పి ఎక్కువగా ఉంటుంది. మూత్రపిండాల్లో రాళ్లను సకాలంలో గుర్తించి చికిత్స చేయకపోతే యూరినరీ ట్రాక్ లో ఆటంకం ఏర్పడి మూత్రవ్యవస్థ సమస్యలు తీవ్రం అవుతాయి.
ఒకసారి మూత్రపిండాల్లో రాళ్లు తీయించినా తిరిగి ఏర్పడే అవకాశం ఉంది. ఎక్కువ సార్లు రాళ్లు ఏర్పడితే మూత్రపిండాలు పాడైపోయే ప్రమాదం ఉంది. అందువలన మొదటి సారి ఈ సమస్యకు చికిత్స చేయించుకున్నాక తిరిగి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రోజుకు 8నుండి13 గ్లాసుల వరకు నీళ్లు తాగాలి. యాపిల్స్, మిరియాలు, చాక్లెట్స్, కాఫీ, ఛీజ్, ద్రాక్ష, ఐస్క్రీమ్, విటమిన్ సి కలిగిన పండ్లు, పెరుగు, టమటా, కమలాపండ్లను తినటం తగ్గించాలి. మాంసాహారం, ఉప్పునికూడా నియంత్రించాలి. మద్యం తాగకూడదు. విటమిన్ సి డి సప్లిమెంట్లను ఎక్కువగా తీసుకోకూడదు. చిన్నచిన్న రాళ్లు ఉన్నవాళ్లు నీరు బాగా తాగటం, ఆహారంలో మార్పులు చేసుకోవటం, చీము కణాలుంటే డాక్టరు సలహాతో యాంటీ బయోటెక్స్ వాడటం చేయాలి.
జనాభాలో 4 – 8 % మంది మూత్రపిండాల్లో రాళ్ళతో బాధపడుతున్నారని ఒక అంచనా. దీనిని బట్టి సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇవి స్త్రీలలో కంటే పురుషుల్లో ఎక్కువగా కనబడుతున్నాయి. ఏదిఏమైనా ప్రతి అనారోగ్యానికి మొదటి దశ అంటూ ఒకటి ఉంటుంది. ఈ దశలోనే తగిన చికిత్స, జాగ్రత్తలు తీసుకుంటే ఎంత తీవ్రమైన అనారోగ్యాలనైనా అదుపులో ఉంచవచ్చు.