రుచి.. వాసన.. ఈ రెండూ మన జీవితానికి మౌలికమైన అంశాలు. వర్షం పడిందంటే చాలు.. మట్టివాసన ముక్కుపుటాలకు తాకుతుంది. అట్టి ఘ్రాణ శక్తి లేకపోతే మనం వాతావరణాన్ని అనుభవించలేం. అలాగే.. కమ్మటి కాఫీ వాసన.. గులాబీల పరిమళం.. మనం గుర్తించంగానీ.. ఇవన్నీ తెలియనప్పుడు మన జీవితం దుర్భరమనే సత్యాన్ని గుర్తించాలి. నాలుక..ముక్కు.. ఈ రెండూ ఘ్రాణశక్తిని కోల్పోతే…?
నమిలే ఆహారం రుచిని మనకు తెలియజెప్పేది నాలుక. నోటి లోపల నాలుక పైభాగాన రుచిమొగ్గలు ఉంటాయి. సన్నటి చెమట పొక్కుల మాదిరిగా సుమారు 9 వేలకు పైగా ఉంటాయి. ఒక్కో రుచి మొగ్గలో చాలా రుచి కణాలుంటాయి. మనం ఆహారం నమిలేటప్పుడు ఈ కణాలు ప్రేరేపితమై… వీటికి అనుసంధానంగా ఉన్న నాడుల ద్వారా అట్టి సమాచారం మెదడుకు చేరుతుంది. అప్పుడు మనకు రుచి భావన కలుగుతుంది. ఈ రుచి మొగ్గలు నాలుక మీదా.. నోట్లో పైభాగంలోనూ, గొంతులో కూడా ఉంటాయి. పుట్టినప్పుడు నాలుక, నోరు, గొంతు, అంగిట్లో సుమారు 10 వేలకు పైగా రుచి మొగ్గలుంటే.. 50 ఏళ్లు పైబడిన తర్వాత ఈ మొగ్గల సంఖ్య తగ్గటం మొదలవుతుంది.
వయసుతో పాటు రుచి, వాసన మందగించటం సహజ పరిణామమే. అయితే కొన్ని రకాల మందుల వల్ల కూడా రుచులు మందగించే అవకాశాలుంటాయి. కొందరికి నోరు ఎప్పుడూ రుచి’ లేనట్లుగానే ఉంటుంది. కొందరికి ఏమీ తినకపోయినా కూడా ఎప్పుడూ నోట్లో ఏదో ఉన్నట్టే అనిపిస్తుంటుంది. ఇంకొందరికి నోట్లో విపరీతంగా నీళ్లు ఊరుతుంటాయి.
- యాంటీ బయాటిక్స్, ఎసిడిటీ తగ్గేందుకు తీసుకునే మందులు
- ఆందోళన, కుంగుబాటు వంటి మానసిక సమస్యలకు వాడే మందులతో
- నోటిలో లాలాజలం వూరటం తగ్గి నోరు పొడిబారుతుండటం వల్ల ఘ్రాణ శక్తిని కోల్పోతుంది.
- కట్టుడు పళ్ల కారణంగా రుచి సమస్యలు తలెత్తే అవకాశం.
- పొగ తాగేవారిలో, వూపిరితిత్తుల్లో ఇన్షెక్షన్లు ఉన్న వారిలో కూడా రుచులు మారిపోవచ్చు.
- క్యాన్సర్ చికిత్స తీసుకునే వారిలోనూ ఆహారం రుచి తెలియదు.
కొందరిలో ముక్కు వాసనలు గుర్తించలేని విధంగా తయారవుతుంది. ముక్కులోని మ్యూకస్ పొరల్లో దుమ్ము దూళి చేరకతో నాసికలు మూసుకుపోయి వాసనలు తెల్సుకోకుండా తయారవుతాయి. వాసనలు తెలియని కారణంగా చాలా మంది.. తమకు తెలియకుండానే ఆహారపుటలవాట్లను మార్చుకుంటూ ఉంటారు. కొంత మంది తిండి సహించక తిండి తగ్గించేసి చాలా కొద్దిగా తింటుంటారు. మరికొందరు కడుపు నిండిన భావన కలగక.. ఎక్కువ తినటం ఆరంభిస్తారు. ఇవన్నీ దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని దెబ్బతీసేవే అని గుర్తుంచుకోవాలి.
- రుచి తెలియక పంచదార, ఉప్పు పెంచుకుని వేసుకోవడం మంచిది కాదు. ఫలితంగా హైబీపీ, గుండె జబ్బులు పెరిగే అవకాశముంటుంది.
- కొందకిలో తిండి సయించక మానసిక కుంగుబాటుకు గురవుతుంటారు.
- ఆకలి మందగిస్తుంది. ఫలితంగా తిండి తగ్గిపోయి పోషకాహార లోపం, బలహీనత, రోగనిరోధక శక్తి తగ్గిపోవటం, రక్తహీనత వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.
- వాసనలు తెలియకపోవటం వల్ల చెడిపోయిన పదార్థాలను గుర్తించలేక తినేస్తుంటారు.
- మతిమరుపు వ్యాధి వస్తుందనడానికి ఇది తొలి సంకేతంగా తీసుకోవాలి. వాసనలు తెలియటం లేదని గుర్తించినప్పుడు.. నిర్లక్ష్యం చేయక వైద్యులతో చర్చించటం ఎంతో అవసరం.
ఆహార పదార్థాలకు కమ్మటి వాసననిచ్చే సుగంధ ద్రవ్యాలను కలుపుకోవటం, ఆకర్షణీయంగా ఉండేలా వండుకోవటం వల్ల కొంత ప్రయోజనం ఉంటుంది. రుచి తెలియటం లేదని తిండి మానేస్తే.. పోషకాహార లోపం తలెత్తుతుందని గుర్తెరగాలి. వాసన తెలియడం లేదని ఏదంటే అది తినడం కూడా ఆరోగ్యానికి ప్రమాదకరమని గుర్తించాలి.