LOW BACK PAIN – రోజూ ఎలాంటి పనులు చేస్తే నడుం నొప్పి వస్తుంది?

By manavaradhi.com

Published on:

Follow Us
Low back pain relief

ఉదయం లేచిన దగ్గర నుంచి ఉరుకులు పరుగుల జీవితమే. ఆధునికత పెరుగుతున్న కొద్దీ .. కాలం స్పీడుగా పరుగెడుతోంది.. దానికి తగ్గట్టూ మనమూ వేగంగా పరుగు పెట్టాల్సిన పరిస్థితి తప్పడం లేదు. ఇళ్లు, ఆఫీసు, వ్యాపారాలు .. ఇలా ప్రతి ఒక్కరిపై పని భారం పెరుగుతూనే ఉంది. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు వివధ పనుల ఒత్తిడిలో శరీరం నలిగిపోతోంది. శరీరంపై విపరీతంగా ఒత్తిడి పడడంతో నొప్పులు తప్పడం లేదు. ముఖ్యంగా అన్నింటి కంటే నడుముపైనే ఎక్కువగా భారం పడుతుంది. దీంతో నడుం నొప్పితో ఇబ్బంది పడని వారు చాలా అరుదనే చెప్పాలి.

రోజువారీ పనులు చేసేటప్పుడు నడుముపై ఒత్తిడి పడుతుంది. ఆఫీసు డెస్క్ దగ్గర.. కంప్యూటర్ ముందు గంటలు గంటలు కూర్చుంటున్నారా? ఐతే నడుం నొప్పి తప్పదు. దీర్ఘకాలంగా ఆఫీసులో కూర్చోవాల్సిన ఉద్యోగం చేస్తుంటే .. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కూర్చుకునేందుకు అనువుగా.. నిటారుగా ఉండే కూర్చుని వినియోగించాలి. వెన్ను.. వెనక్కి వంగేలా ఉండే విధంగా కుర్చీ ఉంటే మంచిది. నడుం నొప్పి బాధించకుండా గుండ్రంగా చుట్టిన టవల్ ను కుర్చీలో ఉపయోగించుకోవాలి. కీ బోర్డ్,మానిటర్ చూసేందుకు పదే పదే వంగకుండా .. వాటిని దగ్గరగా పెట్టుకుని పని చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. కళ్లు చూసే స్థాయి కంటే కిందకి ఉండే విధంగా మానిటర్ ను అమర్చుకోవాలి.

గంటలు గంటలు ఒకే చోట కూర్చుంటే నడుం నొప్పి. . తప్పదు. అందుకే పని మధ్యలో కాసేపు అటు ఇటూ నడిస్తే మంచిది. కనీసం గంటకు ఒకసారైనా ఒక చిన్న విరామం తీసుకోవాలి. దీని వల్ల నడుంపై ఒత్తిడి పడకుండా ఉంటుంది. అంతే కాదు ఈ చిన్న విరామం మరింత శక్తివంతంగా పని చేసేందుకు ఎనర్జీ ఇస్తుంది. శారీరక కండరాలు కూడ కాస్త ఉత్తేజితమవుతాయి… ఉద్యోగంలో భాగం కొంత మంది ఎక్కువ సేపు నిలబడే పని చేస్తారు. ట్రాఫిక్ విధులు నిర్వర్తించే వారు, హోటళ్లు, మాల్స్, క్షౌరశాలలో పని చేసే వారు, ఆస్పత్రుల్లో పని చేసే సిబ్బంది.. ఇలా చాలా మంది నిలబడే పని చేస్తూ ఉంటారు. ఎక్కువ సేపు నిలబడి ఉండడం వల్ల బ్యాక్ పెయిన్ ఇబ్బంది పెడుతుంది. ఐతే దీన్ని అధిగమించేందుకు ఒక కాలును స్టూల్ పై పెట్టుకోవాలి. ఇలా కొద్ది సేపు ఉన్న తర్వాత మరో కాలు మార్చుకుంటే సరిపోతుంది. దీని వల్ల నడుము భాగంపై ఒత్తిడి పడకుండా ఉంటుంది.

ఎక్కువ బరువు ఉన్న వస్తువులు ఎత్తడం.. పిల్లలను ఎత్తుకున్నప్పుడు కూడా నడుం నొప్పి వచ్చే అవకాశం ఉంది. వీలైనంత వరకు పెద్ద బరువు ఉన్న వస్తువులు ఎత్తకుండా ఉండే మంచిది. ఒకవేళ తప్పనిసరైతే భారాన్ని చేతులు, కాళ్లపై సమంగా పడేలా చూసుకోవాలి… చాలా దూరం.. కారు డ్రైవింగ్ చేసినప్పుడూ నడుంపై తీవ్రంగా ఒత్తిడి పడుతుంది. ఫలితంగా నడుం నొప్పి బాధించే అవకాశం ఉంది. ఇందుకోసం కారు డ్రైవింగ్ చేసటప్పుడు స్టీరింగ్ కు అనుకూలంగా సీటు అడ్జెస్ట్ చేసుకోవాలి. నడుం నొప్పి రాకుండా మార్కెట్లో చిన్న మెత్తలు దొరుకుతున్నాయి. వాటిని నడుముకు సీటుకు మధ్యలో పెట్టుకోవడం మంచిది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు గంటకోసారి విరామం తీసుకోవాలి.

బ్యాక్ పెయిన్ కు హై హీల్స్ కూడా కారణమవుతాయి. ముఖ్యంగా ఆడవాళ్లు వీలైనంత వరకు హైహీల్స్ ను వాడకుండా ఉండడం మంచిది. మంచి కుషన్ ఉన్న షూస్ వినియోగించుకోవాలి. దీనివల్ల మోకాళ్లు, మడమలపై భారం పడకుండా ఉంటుంది. ఫలితంగా నడుం నొప్పి వచ్చే అవకాశం తక్కువ. .. ఉదయం లేచిన వెంటనే కండరాలు రిలాక్స్ అయ్యేలా చిన్న చిన్న ఎక్సర్ సైజ్ లు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. రాత్రి నిద్ర పోయినప్పుడు కూడా మంచి భంగిమలో పడుకోవడం అలవాటు చేసుకోవాలి. పక్కకు తిరిగి పడుకున్నప్పుడు రెండు మోకాళ్ల మధ్య మెత్త పెట్టుకుంటే మంచిది. ఐతే వెల్లకిలా పడుకున్నప్పుడు మోకాళ్ల కింద మెత్త పెట్టుకోవడం వల్ల నడుం నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

శారీరక శ్రమ అవసరమే.. అలాగని శరీరాన్ని ఎక్కువ కష్టపెట్టవద్దు. శక్తి కోల్పోకుండా .. పనులు చేసుకునేవిధంగా మనల్ని మనమే తీర్చి దిద్దుకోవాలి. ఫలితంగా ఎలాంటి నడుము నొప్పులు రాకుండా జాగ్రత్తగా ఉండవచ్చు. చిన్న చిన్న తేలికపాటి వ్యాయామాలు మనల్ని నొప్పులకు దూరం చేస్తాయి. దీనితోపాటు బరువును నియంత్రణలో ఉంచుకోవడం చాలా అవసరం.

Leave a Comment