ఒత్తిడి.. ఇటీవలి కాలంలో దాదాపు ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్య. శారీరకంగానైనా.. మానసికంగానైనా మన జీవితంలో అదొక భాగమైపోయింది. బాగా ఒత్తిడికి గురైనా, కోపం వచ్చినా మన శరీరంలో కార్టిసోల్, అడ్రినలిన్ అనే హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల మన శరీరం మరింత ఉత్తేజితమై, వాటి ప్రభావం కండరాలమీద పడుతుంది. ఫలితంగా రక్తపోటు పెరుగుతుంది. తరచూ ఒత్తిడికి గురవ్వడం వల్ల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ప్రతీ ఒక్కరూ కాలంతో పరుగులు పెడుతున్న నేటికాలంలో ఒత్తిడి సర్వసాధారణ విషయమైపోయింది. ఇలాగే ఒత్తిడిలోనే ఎక్కువ కాలం గడిపేవారికి భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా మహమ్మారి సమయంలో చాలా మందిలో అనేక సమస్యలు వచ్చాయి. మరీ ముఖ్యంగా కరోనా కారణంగా ఒత్తిళ్లు మరింత పెరిగాయి. మన జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఒత్తిడిని ఇట్టే తగ్గించుకోవచ్చు.
క్రమం తప్పకుండా పని చేయడం శరీరం మరియు మనస్సును విశ్రాంతి తీసుకోవడానికి ఉత్తమ మార్గాలలో ఒకటి. వ్యాయామం చేయడం వల్ల మెదడు నుంచి ఎండార్ఫిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఒత్తిడిని కలిగించే కార్టిసోల్, అడ్రినలిన్ తదితర హార్మోన్లను వ్యాయామం ద్వారా క్రమబద్ధీకరించవచ్చు. రోజుకు కనీసం అరగంట నుంచి గంటసేపు వ్యాయామం చేస్తే మంచి ఫలితం ఉంటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.
ఒత్తిడికి గురైన సమయంలో వ్యాయామం చేసినా ఉపయోగం ఉంటుంది. వ్యాయామం చేయలేని వారు కనీసం నడకను అలవాటు చేసుకోవాలి. ఆహ్లాదకరమైన వాతారణంలో నడిస్తే సెరోటోనిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. దీని వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. మీరు ఒత్తిడికి గురైనప్పుడు, మీ కండరాలు ఒత్తిడికి గురవుతాయి. కాబట్టి వాటిని రిలాక్స్ చేయండి. సాగదీయడం, మసాజ్‌ని ఆస్వాదించండి,వేడినీటితో స్నానం చేయడం లాంటివి చేయండి.
దీర్ఘ శ్వాసల వల్ల కూడా విశ్రాంతి కలిగి శారీరిక, మానసిక ఒత్తిడి నుంచి కోలుకునేలా చేస్తుంది.ఆలోచనల నుంచి మనసును క్లియర్ చేయడమనే ప్రక్రియే మెడి బ్రీతింగ్ ప్రక్రియ. మనం పీల్చే గాలి మీద దృష్టిసారించడం వల్ల అది శరీరాన్ని, మనసునూ ఉత్తేజితం చేస్తుంది. ఇలా తరచూ తీస్తే శరీరం విశ్రాంతి పొంది మెదడుకు వెళ్లే సంకేతాల తరంగాల వేగం తగ్గుతుంది. ఒత్తిడి హార్మోన్లు తొలగుతాయి. మీ పొట్టపై ధ్యాస పెట్టండి. ఛాతీ కంటే కూడా పొట్ట బాగా కదలాలి. ఇది విశ్రాంతి పొందేందుకు మంచి పద్ధతి. గాఢ శ్వాస వల్ల ఏకాగ్రత దృష్టి పెరుగుతుంది.
యోగా, శరీర భంగిమలపై ధ్యాస పెట్టండి. వివిధ యోగా, ఇతర భంగిమలు ఆచరించటం వల్ల కండరాలు విశ్రాంతిని పొంది ఒత్తిడి తగ్గుతుంది. కండరాలు సడలి విశ్రాంతి పొందుతారు. జాగింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, డాన్సింగ్ వంటివి కూడా ఒత్తిడిని తగ్గించే ప్రక్రియలే. మెదడుని ప్రశాంతంగా పెట్టుకుంటూ శరీర కదలికలపై దృష్టి పెడితే శరీరానికి అలసట తగ్గి మనస్సు ప్రశాంతమవుతుంది. అప్పుడు ఒత్తిడీ తగ్గుతుంది.
చాలా మందిలో నిద్రలేమి కారణంగానే ఒత్తిడికి గురవుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.కనీసం రోజుకు 7 నుంచి 9 గంటలపాటు నిద్రపోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ప్రతిరోజూ ఒకే సమయంలో నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. వీలైనంత వరకు పడుకునేందుకు అరగంట ముందు నుంచి ఫోన్లు, ల్యాప్‌టాప్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు దూరంగా ఉండటం మంచిది.బాగా ఒత్తిడికి గురైనప్పుడు మీ ఆత్మీయులతో మాట్లాడండి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడటం వల్ల ఒత్తిడిని చాలా వరకు తగ్గించుకోవచ్చు.
చిరాగ్గా ఉన్నప్పుడు ముక్కుకు ఓ సుగంధభరితమైన వాసన తగిలితే ఒక్కసారిగా మనసు తేలికపడుతుంది. బాగా ఒత్తిడి అనిపించినప్పుడు సెంట్‌ను వాసన చూస్తే కొంచెం ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఇష్టాలను, నచ్చిన అంశాలను, తీపి గుర్తులను ఓ పుస్తకంలో రాసిపెట్టుకోండి. ఒత్తిడి అనిపించినప్పుడు వాటిని ఒక్కసారి అలా తిరగేయండి. మనసుకు హాయిగా అనిపిస్తుంది.శరీరానికి వ్యాయామం, యోగా ఎంత ముఖ్యమో సరైన ఆహారం తీసుకోవడం కూడా అంతే ముఖ్యం.
ఫాస్ట్‌ఫుడ్స్, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడంవల్ల సరిగా జీర్ణంకాక ఇబ్బందిగా అనిపిస్తుంది. విటమిన్-సి ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. అంతేకాక కార్టిసోల్ నియంత్రణలో ఉండటం వల్ల ఒత్తిడికి గురికాకుండా ఉంటాం. కార్బోహైడ్రేట్లు, మెగ్నీషియం, ఒమేగా ఆమ్లాలు ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది. ఒత్తిడిలో ఉన్నపుడు, సంగీతం వినడం వల్ల ఒత్తిడి స్థితినుండి త్వరగా కోలుకోవచ్చు. మానసిక స్థితి మేరుగవడానికి ఉద్వేగాలను రేకెత్తించే సామర్ధ్యం సంగీతానికే ఉంది.
యోగా, ధ్యానం చేయడం వల్ల ప్రశాంతంగా ఉండి ఆరోగ్యాన్ని పొందవచ్చు. నిత్యం పని ఒత్తిడితో బిజీగా ఉన్నా ఏదో ఒక సమయంలో వినోదం అందేలా చూసుకోవాలి. దీంతో ఒత్తిడి కొంత మేర తగ్గేందుకు అవకాశం ఉంటుంది. అందరితో ఫన్నీగా మాట్లాడడం, జోక్స్ వినడం వంటివి చేస్తే ఒత్తిడి దూరమవుతుంది. ఏవైన విషయాలు మిమ్మల్ని బాధపెడితే, వాటి గురించి మాట్లాడటం వల్ల మీ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు కుటుంబ సభ్యులు, స్నేహితులు మీ డాక్టర్ లేదా థెరపిస్ట్‌తో మాట్లాడవచ్చు.
ప్రతి అనారోగ్య సమస్యకు ప్రధాన కారణం ఒత్తిడి అని అనేక అధ్యయనాలు నివేదికలు ఇచ్చాయి. ఎవరైతే ఎక్కువ ఒత్తిళ్లకు లోనవుతున్నట్లు కనిపిస్తారో, వారు అనేక మానసిక, శారీరక అనారోగ్యాలకు కూడా ప్రభావితమవు తారని మానసిక వైద్యులు చెబుతున్నారు. మరి అటువంటి ఒత్తిడిని దూరం చేయాలంటే వ్యాయామం తప్పనిసరి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే అధిక ఒత్తిడిని నియంత్రించవచ్చు